narsarao peta
-
పల్నాడు జిల్లా నరసరావుపేటలో కత్తిపోట్ల కలకలం
-
అంతుచిక్కని హత్యలు
నరసరావుపేట టౌన్: గుంటూరు జిల్లాలోని నరసరావుపేట డివిజన్ పరిధిలో గత పదిహేను రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న వరుస హత్య కేసుల్లో మిస్టరీ వీడడం లేదు. హత్యకు గురికాబడ్డవారు ఎవరు..ఎందుకు హత్య గావించబడ్డారు.. సంఘటనలకు కారకులెవరు.. జిల్లావాసులా.. లేక ఇతర ప్రాంతాలవారా అనే అంశం తేలక.. కేసుల్లో పురోగతి లభించక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఈనెల 3న చిలకలూరిపేట మండలం కావూరు-లింగంగుంట్ల గ్రామ సమీపంలోని కుప్పగంజివాగు వద్ద గుర్తు తెలియని యువతి హత్యకు గురైంది. ఆ కేసుకు సంబంధించి ఇంతవరకు మృతురాలు ఎవరనేది తేలలేదు. అసలు హత్యా లేక ఆత్మహత్య అనేది పోలీసులు నిర్థారించలేకపోతున్నారు. ఆ యువతి జిల్లా వాసి లేక ఇతర ప్రాంతానికి చెందినదా అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా 9వ తేదీ రొంపిచర్ల మండలం మునమాక రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి రైలు పట్టాలపై శవమై కనిపించాడు. తొలుత రైలులో నుంచి జారి పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావించారు. మృతుని జేబులో రైలు టికెట్ లభించకపోవడంతో ఎవరైనా హత్యచేసి అక్కడ పడవేశారా.. లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన వ్యక్తి ఎవరనేది నేటికీ తేలలేదు. అదే రోజు పట్టణంలోని బరంపేటలో గల కోళ్ళ లక్ష్మయ్య వీధిలో శ్రీనివాసరెడ్డి, అనిత దంపతులు ఫ్యానుకు ఉరివేసుకొని మృతిచెందారు. వీరిది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. ఎనిమిది నెలల క్రితం జీవనోపాధి కోసం పట్టణానికి వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉన్నారు. సమాచారం తెలుసుకున్న బందువులు హుటాహుటిన మృతదేహాలను స్వగ్రామానికి తరలించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకొని అనితను హత్యచేసి అనంతరం శ్రీనివాసరెడ్డి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈనెల 14న మండలంలోని జొన్నలగడ్డ శివారు తిరుమల ఇంజినీరింగ్ కళాశాల వెనుకభాగంలో రైల్వే పట్టాల పక్కన 40 సంవత్సరాల వయస్సుగల వ్యక్తి హత్య గావించబడ్డాడు. రెండు చేతులు నూలుతాడుతో బంధించి తలపై బలమైన ఆయుధంతో దాడిచేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుని చొక్కా కాలర్‌కు ఉన్న లేబుల్ ఆధారంగా కర్నూలువాసిగా భావించి ప్రత్యేక పోలీసు బృందం అక్కడకు వెళ్లి ఆరా తీస్తోంది. తాజాగా మంగళవారం నకరికల్లు మండలం దేచవరం మిద్దె వద్ద గుంటూరుకు చెందిన జ్యోతిష్యుడు భరత్కవి ఏడుకొండలు ఉరఫ్ సీతారామయ్య హత్య గావించబడ్డాడు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో రొంపిచర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొందరు హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులు చిక్కితేగాని ఏడుకొండలు హత్యకు గల కారణాలు బయటపడతాయి. ఓ వైపు కేసులు ఛేదించాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు, మరో వైపు మృతుల ఆచూకీ లభించక కేసుల్లో పురోగతి లేక అధికారులు అయోమయానికి గురవుతున్నారు. మృతిచెందిన వ్యక్తులు ఎవరనేది స్పష్టమైతే కాని ఈ కేసుల్లో మిస్టరీ వీడేటట్లు లేదని పోలీసువర్గాలు భావిస్తున్నాయి. మృతులను గుర్తించేదిశగా పోలీసు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తునప్పటికీ ఫలి తం దక్కడం లేదు. మిస్టరీగా మారిన హత్య కేసులు చివరికి ఏమవుతాయానేది వేచి చూడాల్సి ఉంది. -
ముగిసిన బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు
నరసరావుపేట రూరల్, న్యూస్‌లైన్: స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు శుక్రవారం ముగిశాయి. రెండు రోజులుగా జరుగుతున్న బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో ఏబీఆర్ ప్రభుత్వ కళాశాల రేపల్లెకు ప్రథమస్థానం, టీజేపీఎస్ కళాశాల గుంటూరు ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాయి. వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల చీరాల జట్టు తృతీయ స్థానం, ఆర్సి కళాశాల రేపల్లె జట్టు చతుర్థస్థానంలో నిలిచాయి. బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథులుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల యోగావిభాగం కన్వీనర్ సూర్యనారాయణ, పట్టణ యూనియన్ బ్యాంక్ మేనేజర్ వై.నాగేశ్వరరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల వల్ల విద్యార్థులకు మంచి భవిష్యత్తుతో పాటు ఆరోగ్యం చేకూరుతుందన్నారు. కళాశాలలు క్రీడలను ప్రోత్సహించి ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి ఎం.ఆర్శేషగిరిరావు, ప్రిన్సిపాల్, టోర్నమెంట్ చైర్మన్ నాతాని వెంకటేశ్వరరావు, కె.నాసరయ్య, కళాశాల పీడీ ఆదిబాబు, అబ్బూరి లక్ష్మీనారాయణ, షేక్ ఫరీద్ పాల్గొన్నారు. -
రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన
నరసరావుపేట వెస్ట్, న్యూస్‌లైన్: కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వం, సోనియాగాంధీ రాజ్యాంగానికి, సంప్రదాయానికి, చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజనకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివప్రసాదరావు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకవైపు సీమాంధ్ర ప్రజలు, మరోవైపు తెలంగాణ లోని మెజార్టీ ప్రజలు రాష్ర్ట విభజనను వ్యతిరేకిస్తున్నారన్నారు. అయినప్పటికీ కేంద్రం రాష్ట్రాన్ని విభిజించేందుకు పూనుకుందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ప్రతులను యుద్ధ విమానంలో రాష్ట్రానికి తీసుకురావాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. రాష్ర్టంపై యుద్ధం చేసేందుకే వచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఆరు కోట్లమంది ప్రజలు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. చట్టసభల్లో పోరాటం చేయకుండా సిగ్గులేకుండా విభజనకు పాల్పడుతున్నారన్నారు. ఇటువంటి విభజన గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. విభజన రాజ్యాంగంలోని 371(డి) ఆర్టికల్ 3ని ఉల్లంఘించి జరుగుతుం దన్నారు. విభజన అనేది అన్ని పక్షాల ఆమోదంతో జరగాల్సివుండగా ఎమ్మెల్యేల అభిప్రాయానికి వ్యతిరేకంగా రాష్ర్టపతి కూడా నిర్ణయం తీసుకున్నారన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించినా ఇంకా విభజన చేయాలనే తలంపుతోనే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. భారత సంతతి కాని సోనియాగాంధీ ఇటలీ నుంచి వచ్చి ఇక్కడ ఒక మాఫి యాలా వ్యవహరిస్తోందని విమర్శించారు. రానున్న 20 ఏళ్ల వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనిపించదని డాక్టర్ కోడెల జోస్యం చెప్పారు. సొంత పార్టీ ఎంపీలే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస నోట్ ఇవ్వటంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధోగతిగా తయారైందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో చర్చలంటేనే భయపడే పరిస్థితికి చేరుకుందన్నారు. రాహూల్ గాంధీ పేరు చెబితే ఓట్లుకూడా పడని పరిస్థితి ఎదురైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతమయ్యేవరకు సీమాంధ్రలో ఉద్యమం సాగుతుందని చెప్పారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు వేల్పుల సింహాద్రియాదవ్, జిల్లా ప్రచార కార్యదర్శి కొల్లి ఆంజనేయులు, మాజీ ఎంపీపీ కడియం కోటిసుబ్బారావులు పాల్గొన్నారు.