ఆ ఇంటి ఆశాజ్యోతి ఆరిపోయింది. వికసించిన విద్యా కుసుమం రాలిపోయింది. ఉన్నత చదువులు చదివి.. చెల్లిని చదివిస్తానన్న ఆ చిన్నారి మాటలు గాలిలో కలసిపోయాయి. రాత్రి ఫోన్ చేసి బాగా చదువుతున్నానని చెప్పిన విద్యార్థిని, ఉదయం ఫోన్ చేసి చనిపోతున్నానని చెప్పడం.. ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం రావడం పెను విషాదంగా మారింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్న బూరాడ గ్రామానికి చెందిన డబ్బాడ రమాదేవి(16) ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం రావడంతో కన్నవారు కుప్పకూలిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
రేగిడి: బూరాడ గ్రామానికి డబ్బాడ అప్పలనాయుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఇతని భార్య వరలక్ష్మి గృహిణి. వీరిది నిరుపేద కుటుంబం. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్దమ్మా యి భవాని డైట్ శిక్షణ పూర్తి చేసుకొని రాజాంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. రెండో కూతురు రమాదేవి గత ఏడాది పదో తరగతి రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి 10/10 జీపీఏ సాధించింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు రావడంతో అక్కడ చేరి మొదటి సంవత్సరం చదువుతోంది. తమ కుమార్తెలు ఉన్నత చదువులు చదువుతుండడంతో తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు. మూడో కుమార్తె రోహిణి రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఈ పిల్లను కూడా ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులు కష్టపడుతూ వస్తున్నారు. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి ఫోన్ చేసిన రమాదేవి తాను సెకెండ్ మిడ్ పరీక్షలకు సిద్ధమవుతున్నానని, ఇప్పటి వరకూ చదివానని తెలిపింది. ఆరోగ్యం పాడవుతుందని, పడుకోవాలని తల్లిదండ్రులు సూచించడంతో ఫోన్ కట్ చేసింది. అయితే రమాదేవి శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరోసారి ఇంటికి ఫోన్ చేసింది.
తండ్రి అప్పలనాయుడు ఫోన్ ఎత్తగా తాను రాత్రి 12 గంటల వరకూ చదివిన విషయాలు మరచిపోతున్నానని, ఏమీ గుర్తుండడం లేదని.. చనిపోతాను నాన్న అని చెప్పడంతో ఆందోళన చెందిన అప్పలనాయుడు ఆమెను ఓదార్చి ఇంటి వద్ద ఉన్న పెద్ద కుమార్తె భవానీకి ఫోన్ ఇచ్చాడు. తన చెల్లికి సోదరి నచ్చచెప్పినప్పటికీ వినిపించుకోకుండా రమాదేవి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వారు మరింత ఆందోళనకు గురయ్యారు. ఉదయాన్నే నూజివీడు వెళ్లి రమాదేవిని ఇంటికి తీసుకొచ్చి కొద్ది రోజుల అనంతరం తిరిగి పంపిద్దామని అనుకున్నారు. ఇంతలోనే ఉదయం 7 గంటల సమయంలో ఆమె భవనం పైనుంచి దూకి చనిపోయినట్టు కళాశాల నుంచి ఫోన్ రావడంతో కుటుంబీకులు కుప్పకూలిపోయారు. గ్రామస్తులను విషాదంలోకి నెట్టేసింది. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా ఉంటుందనుకున్న రమాదేవి ఆత్మహత్యకు పాల్పడటాన్ని కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. రమాదేవి తండ్రి అప్పలనాయుడు హుటాహుటిన నూజివీడు పయనమయ్యాడు.
– మంచానికే పరిమితమైన తల్లి
రమాదేవి తల్లి వరలక్ష్మికి మూడేళ్ల క్రితం నడుం ఆపరేషన్ జరిగింది. అప్పటినుంచి ఆమె ఇంటికే పరిమితమైంది. గత కొన్నాళ్లుగా మంచం పైనే ఉంటుంది తండ్రి అప్పలనాయుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా కాలం నెట్టుకొస్తున్నాడు. వీరి స్వగ్రామం రేగిడి మండలం వండానపేట కాగా పిల్లల చదువు కోసం బూరాడ వచ్చి 20 ఏళ్లు అద్దె ఇంట్లో ఉంటున్నారు. కాగా విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు తదితరులు బూరాడ చేరుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.
ప్రతిభా అవార్డు రాకపోవడమే కారణమా?
ఇదిలా ఉండగా రమాదేవికి ప్రతిభా అవార్డు రాలేదు. ఈ అవార్డు రాలేదని కుటుంబీకులతో గత రెండురోజులుగా చెబుతుండేదని కుటుంబీకులు సాక్షికి తెలిపారు. పదో తరగతిలో 10 జీపీఏ వచ్చినా అవార్డు రాకపోవడంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని కుటుంబీకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment