Nuzvid IIIT
-
ట్రిపుల్ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
నూజివీడు: స్థానిక ట్రిపుల్ఐటీ విద్యార్థిని మరడపు హారిక (19) ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం ఈసీఈ చదువుతున్న హారిక స్వస్థలం తూర్పుగోదా వరి జిల్లా రాజమండ్రి నగరంలోని కొత్తపేట. వేకువజామున 5.45 గంటల ప్రాంతంలో తాను ఉంటున్న కే–3 హాస్టల్ భవనంపై భాగంలోకి వెళ్లి అక్కడే బ్లేడ్‌తో రెండు చేతులకు మణికట్టు వద్ద, మెడవద్ద కోసుకొని ఆ తరువాత నాలుగంతస్తు పై నుంచి కిందకు దూకింది. విద్యార్థిని కిందకు దూకడంతో భారీగా శబ్దం రావడంతో పాల వ్యాను డ్రైవర్ చూసి వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన వచ్చి క్యాంపస్‌లోనే ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే నైట్ డ్యూటీ వైద్యురాలు ఆస్పత్రిలో లేకపోవడంతో పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. రెండు కాళ్లకు, వెన్నుపూస వద్ద తీవ్ర గాయాలయ్యాయి. బ్లేడ్‌తో కోసుకోవడంతో తీవ్రంగా రక్తస్రావమైంది. క్షతగాత్రురాలికి రక్తం ఎక్కించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థిని స్పృహలోనే ఉండి ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలోని సెమిస్టర్–1 ఫలితాల్లో బ్యాక్‌లాగ్స్ ఉండటంతో భయంవేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పిందని ట్రిపుల్ఐటీ అధికారులు తెలిపారు. ఘటనా స్థలాన్ని నూజివీడు సీఐ ఆర్.అంకబాబు, పట్టణ ఎస్ఐ తలారి రామకృష్ణ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ల్యాప్‌టాప్‌ల కొను‘గోల్మాల్’..!
సాక్షి, నూజివీడు: ఆర్జీయూ కేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీలలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే కాంట్రాక్ట్ అధ్యాపకుల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు వార్తలు రాగా.. ఇప్పుడు శ్రీకాకుళం, ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలకు సంబంధించిన ల్యాప్‌టాప్ కొనుగోళ్లలో కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగినట్లు విజిలెన్స్ గుర్తించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన వైస్ చాన్స్‌లర్, వీసీ కార్యాలయంలో పనిచేసిన కొంతమంది కాంట్రాక్టు అధికారులు, అప్పటి ఆయా ట్రిపుల్‌ఐటీల డైరెక్టర్లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు నిమిత్తం నియమించిన కమిటీ సభ్యులు ఈ తతంగంలో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి ఒక కంపెనీకి అనుకూలంగా టెండర్ చేసి ఈ దోపిడీకి పాల్పడినట్లు సమాచారం. రూ. 8,500 అదనంగా.. శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలకు ఒక్కోక్కటికీ 3,500, ఇడుపులపాయ ట్రిపుల్ఐటీకి 4వేలు.. మొత్తం 11,000 ఏఎండీ ప్రాసెసర్లు కల్గిన ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేశారు. వీటి ధర ఆన్లైన్లో రూ.20వేలు ఉండగా, ఆర్జీయూకేటీ అధికారులు మాత్రం రూ.28,500లకు కొన్నారు. సింగిల్ టెండర్ రాగా దానినే ఆమోదించారు. ఇంత ధర పెట్టి కొనుగోలు చేసినా.. ల్యాప్‌టాప్‌లు చాలా నాసిరకంగా ఉన్నాయని, ఏఎండీ ప్రాసెసర్ కావడంతో ఏమాత్రం పనిచేయడం లేదని విద్యార్థులు, ఫ్యాకల్టీ పేర్కొనడం గమనార్హం. నూతన ల్యాప్‌టాప్‌ల కంటే 2011, 2012 సంవత్సరాలలో కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్‌లే బాగా పనిచేస్తున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. రిపీట్ ఆర్డర్‌పై ఆరా..! ముందుగా శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలకు ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండర్లు పిలిచి 7వేల ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయగా, ఆ తర్వాత ఒంగోలు ట్రిపుల్ఐటీకి మాత్రం 4వేల ల్యాప్‌టాప్‌లను రిపీట్ ఆర్డర్‌పై కొనుగోలు చేయడం గమనార్హం. అప్పట్లో నూజివీడుకు కూడా రిపీట్ ఆర్డర్‌తో కొనుగోలు చేయాలని అప్పటి వైస్‌చాన్స్‌లర్ డైరెక్టర్‌పై తీవ్ర ఒత్తిడి చేసినప్పటికీ అందుకు ఒప్పుకోలేదు. తాను చెప్పిన మాట వినలేదనే ఆ తర్వాత నూజివీడు డైరెక్టర్‌కు రెండోసారి రెన్యువల్ చేయకుండా పంపించేశారు. దీనిపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. టెండర్ ఫైనలైజ్ అయినా రద్దు.. దీనికి ముందు 2017లో ల్యాప్‌టాప్ టెండర్‌ను పిలువగా, ఒక కంపెనీ న్యూజనరేషన్ ప్రాసెసర్‌తో 6 ఏళ్ల గ్యారెంటీతో బై బ్యాక్ పద్ధతిలో రూ.30,400ల ధరకు కోట్ చేయడం జరిగింది. అంతే కాకుండా వీటిని మార్చేటప్పుడు రూ.5,200లతో తానే కొనుగోలు చేస్తానని కూడా ఆ కంపెనీ పేర్కొంది. దీనికి సంబంధించిన టెండర్ కూడా ఫైనలైజ్ అయిన తర్వాత అప్పటి వీసీ ఈ టెండర్‌ను రద్దు చేసి మరలా టెండర్ పిలిచారు.దీనిపైనా అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బెంచ్‌మార్కు టెస్ట్‌లు లేకుండానే.. ఏ కంపెనీకి చెందినవైనా తప్పనిసరిగా వాటి పనితీరును పరిశీలించేందుకు బెంచ్‌మార్కు టెస్ట్‌లు నిర్వహించాల్సి ఉంటుంది. 11వేల ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసేముందు ఇక్కడ ఎలాంటి బెంచ్‌మార్కు టెస్ట్‌లు జరపకుండా నాసిరకం ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసి విద్యార్థులకు అంటగట్టేశారు. అయితే విజిలెన్స్ విచారణ కొనసాగుతుండటంతో మరిన్ని విషయాలు బహిర్గతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థినికి ఈయూ ఫెలోషిప్
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థిని షేక్ నజ్మాసుల్తానా చదువులో ప్రతిభ చాటి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన యూరోపియన్ యూనియన్ ఫెలోషిప్‌కు ఎంపికైంది. ఈ ఫెలోషిప్ కింద ఎంఎస్ చేయడానికి నజ్మాసుల్తానాకు ఏడాదికి రూ.20 లక్షల చొప్పున రెండేళ్లపాటు ప్రోత్సాహకంగా అందిస్తారు. దేశవ్యాప్తంగా ఈ ఫెలోషిప్‌కు ఇద్దరు మాత్రమే ఎంపిక కాగా.. అందులో నజ్మాసుల్తానా ఒకరు కావడం విశేషం. చదువులో మేటి గుంటూరు నగరం నల్లపాడుకు చెందిన షేక్ నజ్మాసుల్తానా చదువులో చిన్ననాటి నుంచి ప్రతిభ కనబరిచేది. తండ్రి అమీర్‌బాషా మిలటరీలో కెప్టెన్‌గా పనిచేయగా, తల్లి ముజాహిదా సుల్తానా గృహిణి. నజ్మాసుల్తానా 2013లో ట్రిపుల్ ఐటీలో పీయూసీలో చేరి, ఆ తరువాత ఇంజనీరింగ్‌లో మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్ బ్రాంచి తీసుకుంది. అందులోనూ ప్రతిభ కనబరిచింది. ఇంజినీరింగ్‌లో 9.1 సీజీపీఏతో ఉత్తీర్ణురాలైన నజ్మాసుల్తానా ఐఐటీ మద్రాస్‌లో సిరామిక్ టెక్నాలజీలో ఇంటర్న్‌షిప్ చేసింది. బయో మెటీరియల్స్‌పై అంతర్జాతీయ రీసెర్చ్ పేపర్స్‌ను సైన్స్ జర్నల్స్‌కు సమర్పించింది. ఆగస్టులో ఫ్రాన్స్‌కు.. నజ్మాసుల్తానా యూరప్‌లోని ఫ్రాన్స్‌లో గల గ్రెనోబుల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రథమ సంవత్సరం, జర్మనీలోని డామ్స్ట్రాడ్లో ఉన్న టెక్నికల్ యూనివర్సిటీలో ద్వితీయ సంవత్సరం చదవనుంది. యూరప్‌లోని నాలుగు దేశాల (ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, పోర్చుగల్)కు చెందిన ఏడు యూనివర్సిటీలు కలసి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఆఫ్ సైన్సెస్‌కు సంబంధించి రెండేళ్ల ఎంఎస్ కోర్సును అభివృద్ధి చేశాయి. ఈ కోర్సులో చేరేందుకు ప్రతిభావంతులైన యూరోపియన్ విద్యార్థులకు, యూరోపియనేతర విద్యార్థులకు సైతం అవకాశం కల్పిస్తున్నాయి. నజ్మాసుల్తానా ఆగస్టు మూడో వారంలో ఫ్రాన్స్‌కు వెళ్లనుంది. నజ్మా సుల్తానాను, ఆమె తల్లిదండ్రులు అమీర్‌బాషా, ముజాహిదా సుల్తానాలను ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ డి.సూర్యచంద్రరావు సన్మానించారు. -
ఆందోళన బాటలో ట్రిపుల్ ఐటీ సిబ్బంది
పిచ్చి ముదిరింది అంటే రోకలి బండ చుట్టండి.. అన్నట్టుంది త్రిపుల్ ఐటీ సంస్థల యాజమాన్యాల తీరు. పదేళ్లుగా పని చేస్తున్న సిబ్బందికి ఇప్పడు వారి పని తీరుపై ఇంటర్వ్యూలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న సిబ్బంది ఆందోళన బాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. నూజివీడు : రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీ సిబ్బంది ఆందో ళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి యూనివర్సిటీ యాజమాన్యానికి నోటీసులుఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరి పని తీరుపై ఈనెల 20వ తేదీ నుంచి ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొంటూ అక్కడి ఇన్చార్జి ఏవో సండ్ర అమరేంద్రకుమార్ నుంచి మెయిల్స్ రావడమే దీనికి ప్రధాన కారణం. పదేళ్లుగా పని చేస్తున్న సిబ్బందికి ఇప్పుడు పని తీరుపై ఇంట ర్వ్యూలేమిటని, ఈ విధానం రాష్ట్రంలో ఏ యూని వర్సిటీలోనైనా, ఏ ప్రభుత్వ శాఖలోనైనా ఉందా అని సిబ్బంది మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇడుపులపాయలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఈ తంతు ముగిసిన తర్వాత నూజివీడులో కూడా చేపడతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇక్కడి సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్జీయూకేటీలో రోజుకొక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా పని చేయాల్సిన సంస్థను పూర్తిగా దిగజార్చేస్తున్నారని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. మరింత నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు కృషి చేయాల్సిన ఉన్నతాధికారులు, దానిని మరిచి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ యూనివర్సిటీ పరువును తీసేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫీడ్ బ్యాక్ ఇస్తున్న విద్యార్థులు.. వాస్తవానికి ట్రిపుల్ ఐటీల్లో కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్న మెంటార్లు, లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పని తీరుపై ప్రతి సంవత్సరం రెండు సార్లు విద్యార్థులు ఆన్లైన్ ఫీడ్ బ్యాక్ ఇస్తూనే ఉన్నారు. మొదటి సెమిస్టర్ పూర్తి కాగానే ఒకసారి, రెండో సెమిస్టర్ పూర్తి కాగానే మరోసారి ఫీడ్ బ్యాక్‌ను ఇవ్వడం జరుగుతోంది. అంతేగాకుండా సంబంధిత సబ్జెక్టు హెచ్వోడీలు సైతం బోధనా సిబ్బంది పని తీరుపై ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. క్లాసులకు సరిగా వస్తున్నారా, బోధిస్తున్న అంశాలు అర్ధమవుతున్నాయా, విద్యార్థులతో ప్రవర్తన ఎలా ఉంటోంది.. ఇలా పలు ప్రశ్నలు ఇచ్చి వాటికి ఆన్లైన్లోనే అభిప్రాయాలను విద్యార్థులు వెలిబుచ్చుతారు. ఇలా ఫీడ్ బ్యాక్ ఇచ్చిన తర్వాతే వారిని పరీక్షకు అనుమతిస్తారు. ఇంత పక్కాగా అమలు జరుగుతున్న నేపథ్యంలో మరల తమకు పని తీరుపై ఇంటర్వ్యూలేమిటని బోధనా సిబ్బంది వాపోతున్నారు. మేం పాఠాలు చెప్పకపోతే పీయూసీ, ఇంజినీరింగ్‌లలో ఫలితాలు 8 జీపీఏ కంటే ఎక్కువ ఎలా వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. అనేక పరీక్షల తర్వాతే నియామకం.. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలలో పని చేస్తున్న మెంటార్లను పూర్తిగా ప్రతిభ ఆధారంగానే నియమించారు. ఆరు వారాల పాటు శిక్షణనిస్తూ ఎలిమినేషన్ విధానంలో వారం వారం రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ వచ్చిన వారినే మెంటార్లుగా నియమించడం జరిగింది. శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు బోధనా సిబ్బందిని తీసుకున్నట్లుగా ఆరోజు తీసుకోలేదు. ఇకపోతే బోధనేతర సిబ్బందికి కూడా పని తీరు ఇంటర్వ్యూలేమిటో ఎవరికి బోధ పడటం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూలకు తాము హాజరుకాబోమని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పని చేస్తున్న బోధన సిబ్బంది అధికారులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. దీనికి కొనసాగింపుగా రాబోయే కొద్ది రోజుల్లో ట్రిపుల్ ఐటీల సిబ్బంది ఆందోళన బాట పట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. -
ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల అవస్థలు
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాలేజ్ హాస్టల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క కరెంటు లేక, మరోపక్క తాగడానికి నీళ్లు లేక అష్టకష్టాలు పడుతున్నారు. సమస్యలపై అధికారులకు తెలియజేసినా ఫలితం లేదని విద్యార్థులు తెలిపారు. దీంతో వారు నిరసనకు దిగారు. కాగా, అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రాలిపోయిన విద్యాకుసుమం
ఆ ఇంటి ఆశాజ్యోతి ఆరిపోయింది. వికసించిన విద్యా కుసుమం రాలిపోయింది. ఉన్నత చదువులు చదివి.. చెల్లిని చదివిస్తానన్న ఆ చిన్నారి మాటలు గాలిలో కలసిపోయాయి. రాత్రి ఫోన్ చేసి బాగా చదువుతున్నానని చెప్పిన విద్యార్థిని, ఉదయం ఫోన్ చేసి చనిపోతున్నానని చెప్పడం.. ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం రావడం పెను విషాదంగా మారింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్న బూరాడ గ్రామానికి చెందిన డబ్బాడ రమాదేవి(16) ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం రావడంతో కన్నవారు కుప్పకూలిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. రేగిడి: బూరాడ గ్రామానికి డబ్బాడ అప్పలనాయుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఇతని భార్య వరలక్ష్మి గృహిణి. వీరిది నిరుపేద కుటుంబం. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్దమ్మా యి భవాని డైట్ శిక్షణ పూర్తి చేసుకొని రాజాంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. రెండో కూతురు రమాదేవి గత ఏడాది పదో తరగతి రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి 10/10 జీపీఏ సాధించింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు రావడంతో అక్కడ చేరి మొదటి సంవత్సరం చదువుతోంది. తమ కుమార్తెలు ఉన్నత చదువులు చదువుతుండడంతో తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు. మూడో కుమార్తె రోహిణి రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఈ పిల్లను కూడా ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులు కష్టపడుతూ వస్తున్నారు. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి ఫోన్ చేసిన రమాదేవి తాను సెకెండ్ మిడ్ పరీక్షలకు సిద్ధమవుతున్నానని, ఇప్పటి వరకూ చదివానని తెలిపింది. ఆరోగ్యం పాడవుతుందని, పడుకోవాలని తల్లిదండ్రులు సూచించడంతో ఫోన్ కట్ చేసింది. అయితే రమాదేవి శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరోసారి ఇంటికి ఫోన్ చేసింది. తండ్రి అప్పలనాయుడు ఫోన్ ఎత్తగా తాను రాత్రి 12 గంటల వరకూ చదివిన విషయాలు మరచిపోతున్నానని, ఏమీ గుర్తుండడం లేదని.. చనిపోతాను నాన్న అని చెప్పడంతో ఆందోళన చెందిన అప్పలనాయుడు ఆమెను ఓదార్చి ఇంటి వద్ద ఉన్న పెద్ద కుమార్తె భవానీకి ఫోన్ ఇచ్చాడు. తన చెల్లికి సోదరి నచ్చచెప్పినప్పటికీ వినిపించుకోకుండా రమాదేవి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వారు మరింత ఆందోళనకు గురయ్యారు. ఉదయాన్నే నూజివీడు వెళ్లి రమాదేవిని ఇంటికి తీసుకొచ్చి కొద్ది రోజుల అనంతరం తిరిగి పంపిద్దామని అనుకున్నారు. ఇంతలోనే ఉదయం 7 గంటల సమయంలో ఆమె భవనం పైనుంచి దూకి చనిపోయినట్టు కళాశాల నుంచి ఫోన్ రావడంతో కుటుంబీకులు కుప్పకూలిపోయారు. గ్రామస్తులను విషాదంలోకి నెట్టేసింది. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా ఉంటుందనుకున్న రమాదేవి ఆత్మహత్యకు పాల్పడటాన్ని కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. రమాదేవి తండ్రి అప్పలనాయుడు హుటాహుటిన నూజివీడు పయనమయ్యాడు. – మంచానికే పరిమితమైన తల్లి రమాదేవి తల్లి వరలక్ష్మికి మూడేళ్ల క్రితం నడుం ఆపరేషన్ జరిగింది. అప్పటినుంచి ఆమె ఇంటికే పరిమితమైంది. గత కొన్నాళ్లుగా మంచం పైనే ఉంటుంది తండ్రి అప్పలనాయుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా కాలం నెట్టుకొస్తున్నాడు. వీరి స్వగ్రామం రేగిడి మండలం వండానపేట కాగా పిల్లల చదువు కోసం బూరాడ వచ్చి 20 ఏళ్లు అద్దె ఇంట్లో ఉంటున్నారు. కాగా విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు తదితరులు బూరాడ చేరుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ప్రతిభా అవార్డు రాకపోవడమే కారణమా? ఇదిలా ఉండగా రమాదేవికి ప్రతిభా అవార్డు రాలేదు. ఈ అవార్డు రాలేదని కుటుంబీకులతో గత రెండురోజులుగా చెబుతుండేదని కుటుంబీకులు సాక్షికి తెలిపారు. పదో తరగతిలో 10 జీపీఏ వచ్చినా అవార్డు రాకపోవడంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని కుటుంబీకులు భావిస్తున్నారు. -
ఏపీ హెచ్ఆర్డీ కార్యాలయం బాపట్లకు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీ హెచ్ఆర్డీ) కార్యాలయాన్ని బాపట్లలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం నూజివీడు ట్రిపుల్ ఐటీ భవనంలో తాత్కాలికంగా కొనసాగుతున్న ఈ కార్యాలయాన్ని బాపట్లకు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. బాపట్లలోని పంచాయతీరాజ్ ఈటీసీ సెంటర్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసి, అనంతరం శాశ్వత భవనాల నిర్మాణం చేపడతామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అలాగే పంచాయతీరాజ్ సంస్థల ప్రజా ప్రతినిధుల శిక్షణకు సంబంధించిన అపార్డు కార్యాలయాన్ని కూడా ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.