ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినికి ఈయూ ఫెలోషిప్‌ | Eu Fellowship for Nuzvid IIIT student | Sakshi
Sakshi News home page

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినికి ఈయూ ఫెలోషిప్‌

Published Sun, Jul 7 2019 3:50 AM | Last Updated on Sun, Jul 7 2019 3:51 AM

Eu Fellowship for Nuzvid IIIT student - Sakshi

నజ్మాసుల్తానాను సత్కరిస్తున్న ఆచార్య సూర్యచంద్రరావు

నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని షేక్‌ నజ్మాసుల్తానా చదువులో ప్రతిభ చాటి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన యూరోపియన్‌ యూనియన్‌ ఫెలోషిప్‌కు ఎంపికైంది. ఈ ఫెలోషిప్‌ కింద ఎంఎస్‌ చేయడానికి నజ్మాసుల్తానాకు ఏడాదికి రూ.20 లక్షల చొప్పున రెండేళ్లపాటు ప్రోత్సాహకంగా అందిస్తారు. దేశవ్యాప్తంగా ఈ ఫెలోషిప్‌కు ఇద్దరు మాత్రమే ఎంపిక కాగా.. అందులో నజ్మాసుల్తానా ఒకరు కావడం విశేషం.

చదువులో మేటి
గుంటూరు నగరం నల్లపాడుకు చెందిన షేక్‌ నజ్మాసుల్తానా చదువులో చిన్ననాటి నుంచి ప్రతిభ  కనబరిచేది. తండ్రి అమీర్‌బాషా మిలటరీలో కెప్టెన్‌గా పనిచేయగా, తల్లి ముజాహిదా సుల్తానా గృహిణి. నజ్మాసుల్తానా 2013లో ట్రిపుల్‌ ఐటీలో పీయూసీలో చేరి, ఆ తరువాత ఇంజనీరింగ్‌లో మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచి తీసుకుంది. అందులోనూ ప్రతిభ కనబరిచింది. ఇంజినీరింగ్‌లో 9.1 సీజీపీఏతో ఉత్తీర్ణురాలైన నజ్మాసుల్తానా ఐఐటీ మద్రాస్‌లో  సిరామిక్‌ టెక్నాలజీలో ఇంటర్న్‌షిప్‌ చేసింది. బయో మెటీరియల్స్‌పై అంతర్జాతీయ రీసెర్చ్‌ పేపర్స్‌ను సైన్స్‌ జర్నల్స్‌కు సమర్పించింది. 

ఆగస్టులో ఫ్రాన్స్‌కు..
నజ్మాసుల్తానా యూరప్‌లోని ఫ్రాన్స్‌లో గల గ్రెనోబుల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ప్రథమ సంవత్సరం, జర్మనీలోని డామ్‌స్ట్రాడ్‌లో ఉన్న టెక్నికల్‌ యూనివర్సిటీలో ద్వితీయ సంవత్సరం చదవనుంది. యూరప్‌లోని నాలుగు దేశాల (ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, పోర్చుగల్‌)కు చెందిన ఏడు యూనివర్సిటీలు కలసి అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ ఆఫ్‌ సైన్సెస్‌కు సంబంధించి రెండేళ్ల ఎంఎస్‌ కోర్సును అభివృద్ధి చేశాయి. ఈ కోర్సులో చేరేందుకు ప్రతిభావంతులైన యూరోపియన్‌ విద్యార్థులకు, యూరోపియనేతర విద్యార్థులకు సైతం అవకాశం కల్పిస్తున్నాయి. నజ్మాసుల్తానా ఆగస్టు మూడో వారంలో ఫ్రాన్స్‌కు వెళ్లనుంది. నజ్మా సుల్తానాను, ఆమె తల్లిదండ్రులు అమీర్‌బాషా, ముజాహిదా సుల్తానాలను ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డి.సూర్యచంద్రరావు సన్మానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement