ల్యాప్‌టాప్‌ల కొను‘గోల్‌మాల్‌’..!   | Vigilance Investigation In RGUKT Laptop Distribution In Nuzvid | Sakshi
Sakshi News home page

ల్యాప్‌టాప్‌ల కొను‘గోల్‌మాల్‌’..!  

Published Wed, Nov 20 2019 11:36 AM | Last Updated on Wed, Nov 20 2019 11:36 AM

Vigilance Investigation In RGUKT Laptop Distribution In Nuzvid - Sakshi

సాక్షి, నూజివీడు: ఆర్జీయూ కేటీ పరిధిలోని ట్రిపుల్‌ ఐటీలలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరుగుతున్న నేపథ్యంలో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే కాంట్రాక్ట్‌ అధ్యాపకుల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు వార్తలు రాగా.. ఇప్పుడు శ్రీకాకుళం, ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలకు సంబంధించిన ల్యాప్‌టాప్‌ కొనుగోళ్లలో కోట్ల రూపాయలు గోల్‌మాల్‌ జరిగినట్లు విజిలెన్స్‌ గుర్తించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన వైస్‌ చాన్స్‌లర్, వీసీ కార్యాలయంలో పనిచేసిన కొంతమంది కాంట్రాక్టు అధికారులు, అప్పటి ఆయా ట్రిపుల్‌ఐటీల డైరెక్టర్లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు నిమిత్తం నియమించిన కమిటీ సభ్యులు ఈ తతంగంలో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి ఒక కంపెనీకి అనుకూలంగా టెండర్‌ చేసి ఈ దోపిడీకి పాల్పడినట్లు సమాచారం. 

రూ. 8,500 అదనంగా.. 
శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలకు ఒక్కోక్కటికీ 3,500, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీకి 4వేలు.. మొత్తం 11,000 ఏఎండీ ప్రాసెసర్‌లు కల్గిన ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేశారు. వీటి ధర ఆన్‌లైన్‌లో రూ.20వేలు ఉండగా, ఆర్జీయూకేటీ అధికారులు మాత్రం రూ.28,500లకు కొన్నారు. సింగిల్‌ టెండర్‌ రాగా దానినే ఆమోదించారు. ఇంత ధర పెట్టి కొనుగోలు చేసినా.. ల్యాప్‌టాప్‌లు చాలా నాసిరకంగా ఉన్నాయని, ఏఎండీ ప్రాసెసర్‌ కావడంతో ఏమాత్రం పనిచేయడం లేదని విద్యార్థులు, ఫ్యాకల్టీ పేర్కొనడం గమనార్హం. నూతన ల్యాప్‌టాప్‌ల కంటే 2011, 2012 సంవత్సరాలలో కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్‌లే బాగా పనిచేస్తున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు.   

రిపీట్‌ ఆర్డర్‌పై ఆరా..! 
ముందుగా శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలకు ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండర్లు పిలిచి 7వేల ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయగా, ఆ తర్వాత ఒంగోలు ట్రిపుల్‌ఐటీకి మాత్రం 4వేల ల్యాప్‌టాప్‌లను రిపీట్‌ ఆర్డర్‌పై కొనుగోలు చేయడం గమనార్హం. అప్పట్లో నూజివీడుకు కూడా రిపీట్‌ ఆర్డర్‌తో కొనుగోలు చేయాలని అప్పటి వైస్‌చాన్స్‌లర్‌ డైరెక్టర్‌పై తీవ్ర ఒత్తిడి చేసినప్పటికీ అందుకు ఒప్పుకోలేదు. తాను చెప్పిన మాట వినలేదనే ఆ తర్వాత నూజివీడు డైరెక్టర్‌కు రెండోసారి రెన్యువల్‌ చేయకుండా పంపించేశారు. దీనిపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. 

టెండర్‌ ఫైనలైజ్‌ అయినా రద్దు.. 
దీనికి ముందు 2017లో ల్యాప్‌టాప్‌ టెండర్‌ను పిలువగా, ఒక కంపెనీ న్యూజనరేషన్‌ ప్రాసెసర్‌తో 6 ఏళ్ల గ్యారెంటీతో బై బ్యాక్‌ పద్ధతిలో రూ.30,400ల ధరకు కోట్‌ చేయడం జరిగింది. అంతే కాకుండా వీటిని మార్చేటప్పుడు రూ.5,200లతో తానే కొనుగోలు చేస్తానని కూడా ఆ కంపెనీ పేర్కొంది. దీనికి సంబంధించిన టెండర్‌ కూడా ఫైనలైజ్‌ అయిన తర్వాత అప్పటి వీసీ ఈ టెండర్‌ను రద్దు చేసి మరలా టెండర్‌ పిలిచారు.దీనిపైనా అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.   

బెంచ్‌మార్కు టెస్ట్‌లు లేకుండానే.. 
ఏ కంపెనీకి చెందినవైనా తప్పనిసరిగా వాటి పనితీరును పరిశీలించేందుకు బెంచ్‌మార్కు టెస్ట్‌లు నిర్వహించాల్సి ఉంటుంది. 11వేల ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసేముందు ఇక్కడ ఎలాంటి బెంచ్‌మార్కు టెస్ట్‌లు జరపకుండా నాసిరకం ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసి విద్యార్థులకు అంటగట్టేశారు. అయితే విజిలెన్స్‌ విచారణ కొనసాగుతుండటంతో మరిన్ని విషయాలు బహిర్గతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement