పిచ్చి ముదిరింది అంటే రోకలి బండ చుట్టండి.. అన్నట్టుంది త్రిపుల్ ఐటీ సంస్థల యాజమాన్యాల తీరు. పదేళ్లుగా పని చేస్తున్న సిబ్బందికి ఇప్పడు వారి పని తీరుపై ఇంటర్వ్యూలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న సిబ్బంది ఆందోళన బాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.
నూజివీడు : రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీ సిబ్బంది ఆందో ళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి యూనివర్సిటీ యాజమాన్యానికి నోటీసులుఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరి పని తీరుపై ఈనెల 20వ తేదీ నుంచి ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొంటూ అక్కడి ఇన్‌చార్జి ఏవో సండ్ర అమరేంద్రకుమార్ నుంచి మెయిల్స్ రావడమే దీనికి ప్రధాన కారణం. పదేళ్లుగా పని చేస్తున్న సిబ్బందికి ఇప్పుడు పని తీరుపై ఇంట ర్వ్యూలేమిటని, ఈ విధానం రాష్ట్రంలో ఏ యూని వర్సిటీలోనైనా, ఏ ప్రభుత్వ శాఖలోనైనా ఉందా అని సిబ్బంది మండిపడుతున్నారు.
ప్రస్తుతం ఇడుపులపాయలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఈ తంతు ముగిసిన తర్వాత నూజివీడులో కూడా చేపడతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇక్కడి సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్జీయూకేటీలో రోజుకొక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా పని చేయాల్సిన సంస్థను పూర్తిగా దిగజార్చేస్తున్నారని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. మరింత నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు కృషి చేయాల్సిన ఉన్నతాధికారులు, దానిని మరిచి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ యూనివర్సిటీ పరువును తీసేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫీడ్ బ్యాక్ ఇస్తున్న విద్యార్థులు..
వాస్తవానికి ట్రిపుల్ ఐటీల్లో కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్న మెంటార్లు, లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పని తీరుపై ప్రతి సంవత్సరం రెండు సార్లు విద్యార్థులు ఆన్‌లైన్ ఫీడ్ బ్యాక్ ఇస్తూనే ఉన్నారు. మొదటి సెమిస్టర్ పూర్తి కాగానే ఒకసారి, రెండో సెమిస్టర్ పూర్తి కాగానే మరోసారి ఫీడ్ బ్యాక్‌ను ఇవ్వడం జరుగుతోంది. అంతేగాకుండా సంబంధిత సబ్జెక్టు హెచ్‌వోడీలు సైతం బోధనా సిబ్బంది పని తీరుపై ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. క్లాసులకు సరిగా వస్తున్నారా, బోధిస్తున్న అంశాలు అర్ధమవుతున్నాయా, విద్యార్థులతో ప్రవర్తన ఎలా ఉంటోంది.. ఇలా పలు ప్రశ్నలు ఇచ్చి వాటికి ఆన్‌లైన్‌లోనే అభిప్రాయాలను విద్యార్థులు వెలిబుచ్చుతారు. ఇలా ఫీడ్ బ్యాక్ ఇచ్చిన తర్వాతే వారిని పరీక్షకు అనుమతిస్తారు. ఇంత పక్కాగా అమలు జరుగుతున్న నేపథ్యంలో మరల తమకు పని తీరుపై ఇంటర్వ్యూలేమిటని బోధనా సిబ్బంది వాపోతున్నారు. మేం పాఠాలు చెప్పకపోతే పీయూసీ, ఇంజినీరింగ్‌లలో ఫలితాలు 8 జీపీఏ కంటే ఎక్కువ ఎలా వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు.
అనేక పరీక్షల తర్వాతే నియామకం..
నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలలో పని చేస్తున్న మెంటార్లను పూర్తిగా ప్రతిభ ఆధారంగానే నియమించారు. ఆరు వారాల పాటు శిక్షణనిస్తూ ఎలిమినేషన్ విధానంలో వారం వారం రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ వచ్చిన వారినే మెంటార్లుగా నియమించడం జరిగింది. శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు బోధనా సిబ్బందిని తీసుకున్నట్లుగా ఆరోజు తీసుకోలేదు. ఇకపోతే బోధనేతర సిబ్బందికి కూడా పని తీరు ఇంటర్వ్యూలేమిటో ఎవరికి బోధ పడటం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూలకు తాము హాజరుకాబోమని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పని చేస్తున్న బోధన సిబ్బంది అధికారులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. దీనికి కొనసాగింపుగా రాబోయే కొద్ది రోజుల్లో ట్రిపుల్ ఐటీల సిబ్బంది ఆందోళన బాట పట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment