Triple IT officials
-
ఆందోళన బాటలో ట్రిపుల్ ఐటీ సిబ్బంది
పిచ్చి ముదిరింది అంటే రోకలి బండ చుట్టండి.. అన్నట్టుంది త్రిపుల్ ఐటీ సంస్థల యాజమాన్యాల తీరు. పదేళ్లుగా పని చేస్తున్న సిబ్బందికి ఇప్పడు వారి పని తీరుపై ఇంటర్వ్యూలు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న సిబ్బంది ఆందోళన బాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. నూజివీడు : రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీ సిబ్బంది ఆందో ళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి యూనివర్సిటీ యాజమాన్యానికి నోటీసులుఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరి పని తీరుపై ఈనెల 20వ తేదీ నుంచి ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొంటూ అక్కడి ఇన్చార్జి ఏవో సండ్ర అమరేంద్రకుమార్ నుంచి మెయిల్స్ రావడమే దీనికి ప్రధాన కారణం. పదేళ్లుగా పని చేస్తున్న సిబ్బందికి ఇప్పుడు పని తీరుపై ఇంట ర్వ్యూలేమిటని, ఈ విధానం రాష్ట్రంలో ఏ యూని వర్సిటీలోనైనా, ఏ ప్రభుత్వ శాఖలోనైనా ఉందా అని సిబ్బంది మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇడుపులపాయలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఈ తంతు ముగిసిన తర్వాత నూజివీడులో కూడా చేపడతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇక్కడి సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్జీయూకేటీలో రోజుకొక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా పని చేయాల్సిన సంస్థను పూర్తిగా దిగజార్చేస్తున్నారని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. మరింత నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు కృషి చేయాల్సిన ఉన్నతాధికారులు, దానిని మరిచి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ యూనివర్సిటీ పరువును తీసేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫీడ్ బ్యాక్ ఇస్తున్న విద్యార్థులు.. వాస్తవానికి ట్రిపుల్ ఐటీల్లో కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్న మెంటార్లు, లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పని తీరుపై ప్రతి సంవత్సరం రెండు సార్లు విద్యార్థులు ఆన్లైన్ ఫీడ్ బ్యాక్ ఇస్తూనే ఉన్నారు. మొదటి సెమిస్టర్ పూర్తి కాగానే ఒకసారి, రెండో సెమిస్టర్ పూర్తి కాగానే మరోసారి ఫీడ్ బ్యాక్‌ను ఇవ్వడం జరుగుతోంది. అంతేగాకుండా సంబంధిత సబ్జెక్టు హెచ్వోడీలు సైతం బోధనా సిబ్బంది పని తీరుపై ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. క్లాసులకు సరిగా వస్తున్నారా, బోధిస్తున్న అంశాలు అర్ధమవుతున్నాయా, విద్యార్థులతో ప్రవర్తన ఎలా ఉంటోంది.. ఇలా పలు ప్రశ్నలు ఇచ్చి వాటికి ఆన్లైన్లోనే అభిప్రాయాలను విద్యార్థులు వెలిబుచ్చుతారు. ఇలా ఫీడ్ బ్యాక్ ఇచ్చిన తర్వాతే వారిని పరీక్షకు అనుమతిస్తారు. ఇంత పక్కాగా అమలు జరుగుతున్న నేపథ్యంలో మరల తమకు పని తీరుపై ఇంటర్వ్యూలేమిటని బోధనా సిబ్బంది వాపోతున్నారు. మేం పాఠాలు చెప్పకపోతే పీయూసీ, ఇంజినీరింగ్‌లలో ఫలితాలు 8 జీపీఏ కంటే ఎక్కువ ఎలా వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. అనేక పరీక్షల తర్వాతే నియామకం.. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలలో పని చేస్తున్న మెంటార్లను పూర్తిగా ప్రతిభ ఆధారంగానే నియమించారు. ఆరు వారాల పాటు శిక్షణనిస్తూ ఎలిమినేషన్ విధానంలో వారం వారం రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ వచ్చిన వారినే మెంటార్లుగా నియమించడం జరిగింది. శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు బోధనా సిబ్బందిని తీసుకున్నట్లుగా ఆరోజు తీసుకోలేదు. ఇకపోతే బోధనేతర సిబ్బందికి కూడా పని తీరు ఇంటర్వ్యూలేమిటో ఎవరికి బోధ పడటం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూలకు తాము హాజరుకాబోమని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పని చేస్తున్న బోధన సిబ్బంది అధికారులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. దీనికి కొనసాగింపుగా రాబోయే కొద్ది రోజుల్లో ట్రిపుల్ ఐటీల సిబ్బంది ఆందోళన బాట పట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. -
ఆ కాంట్రాక్టర్‌పై అంత ప్రేమ ఎందుకో?
* మురికినీటి తరలింపులో నిబంధనలు ఉల్లంఘన * ఏడాదికి రూ.52లక్షలు అప్పనంగా చెల్లింపు * దోచిపెడుతున్న ట్రిపుల్ఐటీ అధికారులు నూజివీడు : నూజివీడు ట్రిపుల్‌ఐటీలో శుద్ధిచేసిన మురికినీటిని బయటకు తరలించేందుకు ట్రిపుల్ఐటీ ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్‌కు సంబంధిత అధికారులు అప్పనంగా లక్షలాది రూపాయలను దోచిపెడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులు, సిబ్బంది వారి అవసరాలకు ఉపయోగించగా వచ్చే మురుగునీటిని ట్రిపుల్‌ఐటీలో ఏర్పాటు చేసిన ఎస్టీపీ(సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లో శుద్ధిచేసినప్పటికీ... ఇంకా కొన్ని మలినాలు మిగిలి ఉన్న నీటిని కాంట్రాక్టు పొందిన వ్యక్తి జనావాసాలు లేని బయట దూరప్రాంతాలకు ట్యాంకర్లతో తరలించాల్సి ఉంది. అయితే ఈ నీటిని దూర ప్రాంతాలకు ట్యాంకర్లతో తరలించకుండానే కాంట్రాక్టర్‌కు అప్పనంగా నెలకు రూ. 4.40 లక్షలు ట్రిపుల్ఐటీ అధికారులు అందజేస్తున్నారని తెలుస్తోంది. ట్రిపుల్‌ఐటీలో విద్యనభ్యసిస్తున్న 7వేల మంది విద్యార్థుల అవసరాలకు, మెస్‌లలో వాడిన నీటిని శుద్ధిచేసి వెలుపలికి పంపించేందుకు ఆవరణలోనే ఎస్టీపీని నిర్మించారు. అయితే దీనినుంచి నీటిని వెలుపలికి పంపేందుకు ఎలాంటి డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో రోజుకు వచ్చే దాదాపు 12లక్షల లీటర్ల నీటిని బయటకు తరలించేందుకు ట్యాంకర్లను వినియోగిస్తున్నారు. అయితే ఈ పనిని కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏ రోజుకారోజు ట్యాంకర్లలో ఈ నీటిని తీసుకెళ్లి ఊరివెలుపల తోటలలోనో, వాగులలోనే పారబోసి రావాలి. దీనికి గానూ వెయ్యి లీటర్లకు రూ.12.20పైసల చొప్పున చెల్లించేటట్లు టెండర్ల ప్రక్రియ ద్వారా మూడేళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే కాంట్రాక్టర్ నీటిని ట్యాంకర్లలో తరలించకుండా మోటర్లతో నీళ్ల ట్యూబ్‌ల ద్వారా ట్రిపుల్‌ఐటీని ఆనుకుని ఉన్న రాజీవ్‌స్వగృహకు కేటాయించిన స్థలంలో వదిలేస్తున్నారు. అంతేగాకుండా ప్రతిరోజూ రాత్రిపూట ట్రిపుల్‌ఐటీని ఆనుకుని ఉన్న గొడుగువారిగూడెం గ్రామం పైకి ఈ నీటిని వదిలేస్తున్నాడు. ఈ విషయం తెలిసినా ట్రిపుల్ ఐటీ అధికారులు కాంట్రాక్టర్‌కు నెలకు రూ4.40లక్షలు చెల్లించేస్తున్నారు. ట్యూబ్‌లతో బయటకు తరలించేటప్పుడు కాంట్రాక్టర్‌కు ఏ విధంగా బిల్లు చెల్లిస్తున్నారో అంతుబట్టడం లేదని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు మురుగునీరు గ్రామంలోకి వస్తుండడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు, ఈగలు ఉధృతమై తాము గ్రామంలో నివశించలేకపోతున్నామని గొడుగువారిగూడెం గ్రామస్తులు ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు కాంట్రాక్టర్‌కు వత్తాసు పలుకుతున్నారు తప్పితే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ఐటీ మురుగునీటి సమస్యను పరిష్కరించకుండా కాలం గుడుపుతున్న అధికారుల వైఖరికి నిరసనగా ఈనెల మొదటి వారంలో నిర్వహించిన జన్మభూమి వార్డు సభను సైతం గ్రామస్తులు అడ్డుకుని అధికారులను నిలదీశారు. కాంట్రాక్టు ముగిసినా రెండేళ్లుగా ఈ కాంట్రాక్టరే... ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ కాలపరిమితి ముగిసి రెండేళ్లవుతున్నా మరళా టెండర్లు పిలిచి కాంట్రాక్టును ఇవ్వకుండా ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్‌కే గడువు పొడిగిస్తూ వస్తున్నారు. పోటీవస్తే ఎవరైనా ఇంతకన్నా తక్కువకు టెండర్ వేస్తే ట్రిపుల్ఐటీకి డబ్బులు ఆదా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు పొడిగించారనేది బహిరంగ రహస్యమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లు పిలిచాం నేను కొత్తగా వచ్చా. గతంలో ఎందుకు పొడిగించారో తెలియదు. టెండర్ల ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం టెండర్లను ఆహ్వానించాం. త్వరలోనే కొత్త కాంట్రాక్టర్ వస్తారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం. మురికినీరు వదిలేస్తున్నారని గొడుగువారిగూడెం గ్రామస్తుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. - కే హనుమంతరావు, ఇన్చార్జి డెరైక్టర్