ఆ కాంట్రాక్టర్‌పై అంత ప్రేమ ఎందుకో?
* మురికినీటి తరలింపులో నిబంధనలు ఉల్లంఘన
* ఏడాదికి రూ.52లక్షలు అప్పనంగా చెల్లింపు
* దోచిపెడుతున్న ట్రిపుల్‌ఐటీ అధికారులు
నూజివీడు : నూజివీడు ట్రిపుల్‌ఐటీలో శుద్ధిచేసిన మురికినీటిని బయటకు తరలించేందుకు ట్రిపుల్‌ఐటీ ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్‌కు సంబంధిత అధికారులు అప్పనంగా లక్షలాది రూపాయలను దోచిపెడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులు, సిబ్బంది వారి అవసరాలకు ఉపయోగించగా వచ్చే మురుగునీటిని ట్రిపుల్‌ఐటీలో ఏర్పాటు చేసిన ఎస్‌టీపీ(సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)లో శుద్ధిచేసినప్పటికీ... ఇంకా కొన్ని మలినాలు మిగిలి ఉన్న నీటిని కాంట్రాక్టు పొందిన వ్యక్తి జనావాసాలు లేని బయట దూరప్రాంతాలకు ట్యాంకర్లతో తరలించాల్సి ఉంది.
అయితే ఈ నీటిని దూర ప్రాంతాలకు ట్యాంకర్లతో తరలించకుండానే కాంట్రాక్టర్‌కు అప్పనంగా నెలకు రూ. 4.40 లక్షలు ట్రిపుల్‌ఐటీ అధికారులు అందజేస్తున్నారని తెలుస్తోంది. ట్రిపుల్‌ఐటీలో విద్యనభ్యసిస్తున్న 7వేల మంది విద్యార్థుల అవసరాలకు, మెస్‌లలో వాడిన నీటిని శుద్ధిచేసి వెలుపలికి పంపించేందుకు ఆవరణలోనే ఎస్‌టీపీని నిర్మించారు. అయితే దీనినుంచి నీటిని వెలుపలికి పంపేందుకు ఎలాంటి డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో రోజుకు వచ్చే దాదాపు 12లక్షల లీటర్ల నీటిని బయటకు తరలించేందుకు ట్యాంకర్లను వినియోగిస్తున్నారు. అయితే ఈ పనిని కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు.
నిబంధనల ప్రకారం ఏ రోజుకారోజు ట్యాంకర్లలో ఈ నీటిని తీసుకెళ్లి ఊరివెలుపల తోటలలోనో, వాగులలోనే పారబోసి రావాలి. దీనికి గానూ వెయ్యి లీటర్లకు రూ.12.20పైసల చొప్పున చెల్లించేటట్లు టెండర్ల ప్రక్రియ ద్వారా మూడేళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే కాంట్రాక్టర్ నీటిని ట్యాంకర్లలో తరలించకుండా మోటర్లతో నీళ్ల ట్యూబ్‌ల ద్వారా ట్రిపుల్‌ఐటీని ఆనుకుని ఉన్న రాజీవ్‌స్వగృహకు కేటాయించిన స్థలంలో వదిలేస్తున్నారు. అంతేగాకుండా ప్రతిరోజూ రాత్రిపూట ట్రిపుల్‌ఐటీని ఆనుకుని ఉన్న గొడుగువారిగూడెం గ్రామం పైకి ఈ నీటిని వదిలేస్తున్నాడు.
ఈ విషయం తెలిసినా ట్రిపుల్ ఐటీ అధికారులు కాంట్రాక్టర్‌కు నెలకు రూ4.40లక్షలు చెల్లించేస్తున్నారు. ట్యూబ్‌లతో బయటకు తరలించేటప్పుడు కాంట్రాక్టర్‌కు ఏ విధంగా బిల్లు చెల్లిస్తున్నారో అంతుబట్టడం లేదని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు మురుగునీరు గ్రామంలోకి వస్తుండడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు, ఈగలు ఉధృతమై తాము గ్రామంలో నివశించలేకపోతున్నామని గొడుగువారిగూడెం గ్రామస్తులు ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు కాంట్రాక్టర్‌కు వత్తాసు పలుకుతున్నారు తప్పితే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో ట్రిపుల్‌ఐటీ మురుగునీటి సమస్యను పరిష్కరించకుండా కాలం గుడుపుతున్న అధికారుల వైఖరికి నిరసనగా ఈనెల మొదటి వారంలో నిర్వహించిన జన్మభూమి వార్డు సభను సైతం గ్రామస్తులు అడ్డుకుని అధికారులను నిలదీశారు.
కాంట్రాక్టు ముగిసినా రెండేళ్లుగా ఈ కాంట్రాక్టరే...
ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ కాలపరిమితి ముగిసి రెండేళ్లవుతున్నా మరళా టెండర్లు పిలిచి కాంట్రాక్టును ఇవ్వకుండా ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్‌కే గడువు పొడిగిస్తూ వస్తున్నారు. పోటీవస్తే ఎవరైనా ఇంతకన్నా తక్కువకు టెండర్ వేస్తే ట్రిపుల్‌ఐటీకి డబ్బులు ఆదా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు పొడిగించారనేది బహిరంగ రహస్యమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టెండర్లు పిలిచాం
నేను కొత్తగా వచ్చా. గతంలో ఎందుకు పొడిగించారో తెలియదు. టెండర్ల ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం టెండర్లను ఆహ్వానించాం. త్వరలోనే కొత్త కాంట్రాక్టర్ వస్తారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం. మురికినీరు వదిలేస్తున్నారని గొడుగువారిగూడెం గ్రామస్తుల నుంచి ఫోన్లు వస్తున్నాయి.
- కే హనుమంతరావు, ఇన్‌చార్జి డెరైక్టర్