Terms of violation
-
తూత్తుకూడి కాల్పుల్లో నిబంధనల ఉల్లంఘన
తూత్తుకూడి: తమిళనాడులోని తూత్తుకూడిలో వేదాంత స్టెర్లైట్ కాపర్ పరిశ్రమను మూసేయాలంటూ ఈ ఏడాది మే నెలలో నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపి 13 మంది అమాయకులను పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. చనిపోయిన 13 మందిలో 12 మందికి బుల్లెట్లు ఛాతీ లేదా అంతకన్నా పై భాగంలోనే తగిలాయనీ, సగం మంది శరీరాల్లోకి బుల్లెట్లు వెనుకవైపు నుంచి దూసుకెళ్లాయని పోస్ట్‌మార్టమ్ నివేదికలు తాజాగా స్పష్టం చేస్తున్నాయి. దీనిని బట్టి అక్కడి పోలీసులు నిబంధనలను ఎంత తీవ్రంగా ఉల్లంఘించారో తెలుస్తోంది. భారత్‌లో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం నిరసనల్లో పరిస్థితి పూర్తిగా చేయిదాటినప్పుడు మాత్రమే భద్రతా దళాలు కాల్పులు జరిపేందుకు అనుమతి ఉంది. కాల్పులు జరిపినా వాటి లక్ష్యం ఆందోళనలను అణచివేయడమే తప్ప మనుషులను చంపడం అయ్యుండకూడదు. తల, ఛాతీ, గుండె భాగంలో బుల్లెట్ తగలకుండా శరీరంలో వీలైనంత కింద భాగంలో, గరిష్టంగా నడుము వరకు ఉన్న భాగంలో మాత్రమే కాల్చాలి. కానీ ఈ నిబంధనలను ఉల్లంఘించి, ఆందోళనకారుల ప్రాణాలు తీయడానికి అన్నట్లు ఈ ఏడాది మే నెలలో పోలీసులు కాల్పులు జరిపారు. చనిపోయిన వారిలో అత్యంత చిన్న వయస్కురాలు 17 ఏళ్ల బాలిక కాగా, బుల్లెట్ ఆమె తల వెనుక భాగంలో తగిలి నోటి నుంచి బటయకొచ్చిందని పోస్ట్‌మార్టంలో తేలింది. -
వాహనదారులూ జాగ్రత్త
ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే చలానా తప్పదు నగరంలో అడుగడుగునా నిఘా నేత్రాలు 240 జంక్షన్లలో 350 సీసీ కెమెరాలు మరో 200 హ్యాండ్ కెమెరాలు ఈ ఏడాది 31,05,445 ఉల్లంఘన కేసులు నమోదు సగటున ప్రతీరోజు 8508 మంది..., గంటకు 354 మంది.., నిమిషానికి ఆరుగురు ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు సిటీబ్యూరో: వాహనదారులూ తస్మాత్ జాగ్రత్త... ట్రాఫిక్ పోలీసులు లేరుకదా అని నిబంధనలను ఉల్లంఘించి వాహనం నడిపితే చలానా బారిన పడతారు. ఎక్కడ? ఎప్పుడు, ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడ్డారనే సాక్ష్యాలతో సహా ట్రాఫిక్ పోలీసులు మీ ఇంటికి చలాన్ పంపిస్తారు. నగరంలోని 240 జంక్షన్లలో ఉన్న సుమారు 350 సీసీ కెమెరాలు ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే వెంటనే ఫొటోలు తీసేస్తున్నాయి. అలాగే, ప్రతీ చిన్నజంక్షన్, రహదారులపై 200 మంది కానిస్టేబుళ్ల చేతిలో ఉన్న కెమెరాలతోనూ ఫొటోలు తీస్తున్నారు. ఈ ఏడాది 31,05,445 మంది ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినట్లు నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ జితేందర్ తెలిపారు. రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు వాహనం నడుపుతున్న వాహనదారులు ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసుల నుంచి ఇంటికి వస్తున్న చలానా చూసి కంగుతింటున్నారు. గతంలో ఉల్లంఘనకు పాల్పడితే రూ.100 చ లానా విధించేవారు.. అది ఇప్పుడు రూ.1000కి చేరింది. ఈ నే పథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే టాప్ 20 జంక్షన్లలో మొదటి స్థానం ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ ఠాణా పరిధిలోని యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు చౌరస్తా ఉంది. ఇక్కడ గత రెండేళ్లలో 53161 మంది రాగ్సైడ్ డ్రైవింగ్ చేసి చలానా బారిన పడ్డారు. ఇక రెండో స్థానంలో గోషామహల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్ఏ బజార్ చౌరస్తా ఉంది. ఇక్కడ కూడా రాగ్సైడ్ డ్రైవింగ్ చేసిన 48833 మందిపై చలానా కొరడా జుళిపించారు. ఇక మూడో స్థానంలో నల్లకుంట పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్వీఎస్ కళాశాల చౌరస్తా దక్కించుకుంది. ఇక్కడ 34247మంది చలానా బారిన పడ్డారు. ఇక ఉల్లంఘన తీరును గమనిస్తే 82 రకాల ఉల్లంఘనలు ట్రాఫిక్ విభాగంలో ఉన్నాయి. ఈ ఏడాది అన్ని రకాల ఉల్లంఘనల్లో మొత్తం 31,05,445 కేసులు నమోదు కాగా... అందులో మొదటి స్థానంలో అత్యధికంగా ఎక్స్ట్రా ప్రొజెక్షన్ ఆన్ టాప్ (పరిమితికి మించి ఎత్తు/ పొడుగులో సామగ్రి తరలింపు) కేసులు 5,16,613 గూడ్స్ వాహనాలపై కేసులు నమోదయ్యాయి, రెండో స్థానంలో పార్కింగ్ ఆన్ సర్వీస్ రోడ్స్ కేసులు 4,80,509, మూడో స్థానంలో రాంగ్‌సైడ్ డ్రైవింగ్ 4,42,591 ఉన్నాయి. -
క్యాబ్...భద్రత ఏది సాబ్?
⇒ క్యారెక్టర్ సర్టిఫికెట్ లేకుండా డ్రైవర్ల నియామకాలు ⇒ ప్రవర్తనపై కొరవడిన పర్యవేక్షణ ⇒ నిబంధనలు ఉల్లంఘిస్తున్న క్యాబ్స్ సంస్థలు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని క్యాబ్‌లలో ప్రయాణికులకు భద్రత లేకుండాపోతోంది. డ్రైవర్ల నియామకాల్లో క్యాబ్ సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ఈ సంస్థల పనితీరుపై పర్యవేక్షణ, నిఘా కొనసాగించవలసిన రవాణా, పోలీసు విభాగాలు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నాయి. నగరంలోని వేలాది వాహనాలు ఎలాంటి వ్యక్తుల చేతుల్లో ఉన్నాయనే అంశంపై స్పష్టత లేదు. మేరు, డాట్స్, ఓలా, ఎల్లో, గ్రీన్‌క్యాబ్స్ తదితర 15కు పైగా క్యాబ్ సంస్థలు నగరంలో వేలాది వాహనాలతో ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పిస్తున్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు. ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు ఎక్కువ శాతం క్యాబ్స్పైనే ఆధార పడుతున్నారు.24 గంట లూ రవాణా సదుపాయాన్ని కల్పించే క్యాబ్ సంస్థలు లాభార్జనే తప్ప ప్రయాణికుల భద్రతను పట్టించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధం.. ఆర్టీఏ నిబంధనల ప్రకారం క్యాబ్ సంస్థలు కనీసం ఐదు వాహనాలను సొంతంగా సమకూర్చుకొని ప్రత్యేకమైన కార్యాలయంతో పాటు, అన్ని రకాల భద్రతా నిబంధనలకు అనుగుణంగా అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. నగరంలోని చాలా సంస్థలు కేవలం కాల్ సెంటర్లుగా వ్యవహరిస్తున్నాయి. సొంత వాహనాలు, నమ్మకమైన డ్రైవర్లు లేకుండానే సేవలు అందిస్తున్నాయి, పైగా వాటి కార్యాలయాలపై ఆర్టీఏ అధికారులకు స్పష్టత లేకపోవడం గమనార్హం. ఆర్టీఏ నిబంధనల మేరకు క్యాబ్ సంస్థలుగా లెసైన్స్ పొందినవి ఏటా లెసైన్స్‌లను రెన్యువల్ చేసుకోవాలి. కానీ ఇదేదీ కనిపించడం లేదు. అత్యవసర పరిస్థితులు, మహిళా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకమైతే తప్ప స్పందించని ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యంతో అనేక సంస్థలు నిబంధనలను తుంగలో తొక్కి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ‘క్యారెక్టర్’ లేదు... నగరంలోని ఒకటి, రెండు మినహా మిగతా క్యాబ్ సంస్థలు డ్రైవర్ల క్యారెక్టర్‌పై నిశితమైన పరిశీలన లేకుండానే వ్యాపార ప్రకటనలు, ఆదాయమే లక్ష్యంగా ఎడాపెడా వాహనాల సంఖ్యను పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాహన యజమాని చిరునామా, పర్మిట్ గడువు తదితర అంశాలతో పాటు ఆ వాహనాన్ని నడిపే డ్రైవర్ ప్రవర్తనపై పోలీసుల సర్టిఫికెట్ తప్పనిసరి. వారిపై గతంలో ఏమైనా కేసులు నమోదై ఉన్నాయా, జైలుకు వెళ్లారా, చుట్టుపక్కల వారితో గొడవలు, కొట్లాటలకు దిగడం వంటి అంశాలపై స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి క్యారెక్టర్ సర్టిఫికెట్ తీసుకోవాలి. క్యాబ్ సంస్థలు ఇలాంటి ధ్రువీకరణ లేకుండానే డ్రైవర్లను నియమిస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్ చేపడతాం: రఘునాథ్, జేటీసీ హైదరాబాద్ మోటారు వాహన నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లెసైన్సులు ఇవ్వడమే కాదు. వాటిని రద్దు చేసే అవకాశం కూడా ఉంది. వాహనాన్ని నడిపేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్న ఒక వ్యక్తికి డ్రైవింగ్ లెసైన్స్ పొందే హక్కు ఉంది. చెడు ప్రవర్తన, మద్యం తాగి వాహనాలను నడపడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, డ్రగ్స్ తీసుకోవడం వంటి వాటి ఆధారంగా లెసైన్స్‌లను రద్దు చేసే అధికారం ఉంది. బుధవారం నుంచి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం. -
ఆ కాంట్రాక్టర్‌పై అంత ప్రేమ ఎందుకో?
* మురికినీటి తరలింపులో నిబంధనలు ఉల్లంఘన * ఏడాదికి రూ.52లక్షలు అప్పనంగా చెల్లింపు * దోచిపెడుతున్న ట్రిపుల్ఐటీ అధికారులు నూజివీడు : నూజివీడు ట్రిపుల్‌ఐటీలో శుద్ధిచేసిన మురికినీటిని బయటకు తరలించేందుకు ట్రిపుల్ఐటీ ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్‌కు సంబంధిత అధికారులు అప్పనంగా లక్షలాది రూపాయలను దోచిపెడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులు, సిబ్బంది వారి అవసరాలకు ఉపయోగించగా వచ్చే మురుగునీటిని ట్రిపుల్‌ఐటీలో ఏర్పాటు చేసిన ఎస్టీపీ(సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లో శుద్ధిచేసినప్పటికీ... ఇంకా కొన్ని మలినాలు మిగిలి ఉన్న నీటిని కాంట్రాక్టు పొందిన వ్యక్తి జనావాసాలు లేని బయట దూరప్రాంతాలకు ట్యాంకర్లతో తరలించాల్సి ఉంది. అయితే ఈ నీటిని దూర ప్రాంతాలకు ట్యాంకర్లతో తరలించకుండానే కాంట్రాక్టర్‌కు అప్పనంగా నెలకు రూ. 4.40 లక్షలు ట్రిపుల్ఐటీ అధికారులు అందజేస్తున్నారని తెలుస్తోంది. ట్రిపుల్‌ఐటీలో విద్యనభ్యసిస్తున్న 7వేల మంది విద్యార్థుల అవసరాలకు, మెస్‌లలో వాడిన నీటిని శుద్ధిచేసి వెలుపలికి పంపించేందుకు ఆవరణలోనే ఎస్టీపీని నిర్మించారు. అయితే దీనినుంచి నీటిని వెలుపలికి పంపేందుకు ఎలాంటి డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో రోజుకు వచ్చే దాదాపు 12లక్షల లీటర్ల నీటిని బయటకు తరలించేందుకు ట్యాంకర్లను వినియోగిస్తున్నారు. అయితే ఈ పనిని కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏ రోజుకారోజు ట్యాంకర్లలో ఈ నీటిని తీసుకెళ్లి ఊరివెలుపల తోటలలోనో, వాగులలోనే పారబోసి రావాలి. దీనికి గానూ వెయ్యి లీటర్లకు రూ.12.20పైసల చొప్పున చెల్లించేటట్లు టెండర్ల ప్రక్రియ ద్వారా మూడేళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే కాంట్రాక్టర్ నీటిని ట్యాంకర్లలో తరలించకుండా మోటర్లతో నీళ్ల ట్యూబ్‌ల ద్వారా ట్రిపుల్‌ఐటీని ఆనుకుని ఉన్న రాజీవ్‌స్వగృహకు కేటాయించిన స్థలంలో వదిలేస్తున్నారు. అంతేగాకుండా ప్రతిరోజూ రాత్రిపూట ట్రిపుల్‌ఐటీని ఆనుకుని ఉన్న గొడుగువారిగూడెం గ్రామం పైకి ఈ నీటిని వదిలేస్తున్నాడు. ఈ విషయం తెలిసినా ట్రిపుల్ ఐటీ అధికారులు కాంట్రాక్టర్‌కు నెలకు రూ4.40లక్షలు చెల్లించేస్తున్నారు. ట్యూబ్‌లతో బయటకు తరలించేటప్పుడు కాంట్రాక్టర్‌కు ఏ విధంగా బిల్లు చెల్లిస్తున్నారో అంతుబట్టడం లేదని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు మురుగునీరు గ్రామంలోకి వస్తుండడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు, ఈగలు ఉధృతమై తాము గ్రామంలో నివశించలేకపోతున్నామని గొడుగువారిగూడెం గ్రామస్తులు ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు కాంట్రాక్టర్‌కు వత్తాసు పలుకుతున్నారు తప్పితే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ఐటీ మురుగునీటి సమస్యను పరిష్కరించకుండా కాలం గుడుపుతున్న అధికారుల వైఖరికి నిరసనగా ఈనెల మొదటి వారంలో నిర్వహించిన జన్మభూమి వార్డు సభను సైతం గ్రామస్తులు అడ్డుకుని అధికారులను నిలదీశారు. కాంట్రాక్టు ముగిసినా రెండేళ్లుగా ఈ కాంట్రాక్టరే... ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ కాలపరిమితి ముగిసి రెండేళ్లవుతున్నా మరళా టెండర్లు పిలిచి కాంట్రాక్టును ఇవ్వకుండా ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్‌కే గడువు పొడిగిస్తూ వస్తున్నారు. పోటీవస్తే ఎవరైనా ఇంతకన్నా తక్కువకు టెండర్ వేస్తే ట్రిపుల్ఐటీకి డబ్బులు ఆదా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు పొడిగించారనేది బహిరంగ రహస్యమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లు పిలిచాం నేను కొత్తగా వచ్చా. గతంలో ఎందుకు పొడిగించారో తెలియదు. టెండర్ల ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం టెండర్లను ఆహ్వానించాం. త్వరలోనే కొత్త కాంట్రాక్టర్ వస్తారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం. మురికినీరు వదిలేస్తున్నారని గొడుగువారిగూడెం గ్రామస్తుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. - కే హనుమంతరావు, ఇన్చార్జి డెరైక్టర్ -
నిబంధనల ఉల్లంఘన
సాక్షి, చెన్నై: మీనంబాక్కం విమానాశ్రయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఎం డీఎంకే నేత వైగోపై కేసు నమోదు అయింది. ఆయనతోపాటుగా 400 మందిపై కేసులు పెట్టారు. అయితే, నిబంధనలను ఉల్లంఘిస్తున్నా చోద్యం చూసినందుకుగాను విమానాశ్రయం ఇన్స్పెక్టర్ మహిమై వీరన్పై బదిలీ వేటు పడింది. ఎండీఎంకే నేత వైగో చాలా కాలం తర్వాత విదేశాలకు గత వారం వెళ్లారు. ఆయనపై ఉన్న కేసుల ఎత్తివేతతో తొలి పర్యటనలో మలేషియాకు వెళ్లారు. అక్కడ తమిళ మహాసభల్ని ముగించుకుని బుధవారం చెన్నైకు తిరుగు పయనమయ్యారు. విదేశాలకు వెళ్లి వస్తున్న తమ నేతకు ఘన స్వాగతం పలికేందుకు ఎండీఎంకే వర్గాలు ఏర్పాట్లు చేశాయి. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే విమానాశ్రయం పరిసరాల్లో హంగామా సృష్టించాయి. వివాదం: విదేశీ టెర్మినల్ వద్ద ప్రత్యేక ఆంక్షలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎవరైనా వస్తే, వారిని ఆహ్వానించేందుకు పెద్ద సంఖ్య లో టెర్మినల్ వైపుగా ఎవ్వరూ చొచ్చుకు రాకూడదు. అలాగే, ఊరేగింపులు నిర్వహించరాదు. అయితే, ఎండీఎంకే వర్గాలు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించాయి. వైగో బయటకు రాగానే టెర్మినల్ ప్రవేశ మార్గంలోకి చొచ్చుకెళ్లాయి. భద్రతా సిబ్బంది అడ్డుకునే క్రమంలో వైగో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అక్కడి భద్రతా సిబ్బందిని ఆయన తీవ్రంగానే మందలించారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన ఎండీఎంకే వర్గాలు ఉత్సాహంతో కేరింతలు కొడుతూ టెర్మినల్ నుంచి ఊరేగింపుగా నినాదాలతో హోరెత్తిస్తూ ముందుకు కదిలారు. కేసుల నమోదు: విమానాశ్రయం పరిసరాల్లో సాగిన ఎండీఎంకే వర్గాల హంగామాను అక్కడి ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. నిబంధనల ఉల్లంఘన, భద్రతలో స్థానిక పోలీసుల వైఫల్యంను ఎత్తి చూపుతూ హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో నగర పోలీసు యంత్రాంగం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగర పోలీసు కమిషనర్ జార్జ్ ఆదేశాలతో అక్కడి పోలీసులు ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. వైగోకు ఆహ్వానం పలికేందుకు వచ్చిన వారి పేర్లను సేకరించి, కేసుల నమోదుకు నిర్ణయించారు. ఎండీఎంకే నేత వైగో, మల్లై సత్య, పాలవాక్కం సోము తదితరులతో పాటుగా 400 మందిపై కేసులు నమోదు చేశారు. విమానాశ్రయంలో భద్రత విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, వారించిన వారిపై తిరగబడడం, నిబంధనల ఉల్లంఘన, అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తదితర సెక్షన్లతో వీరిపై కేసులు పెట్టారు. చివరకు అక్కడి భద్రతా విధుల్లో ఉన్న ఇన్స్పెక్టర్ మహిమై వీరన్పై బదిలీ వేటు తప్పలేదు. ఆయన్ను అక్కడి నుంచి ట్రిప్లికేషన్ క్రైం బ్రాంచ్‌కు మార్చారు. మైలాపూర్ ఇన్స్పెక్టర్ వెంకటరమణను విమానాశ్రయూనికి బదిలీ చేశారు.