వాహనదారులూ జాగ్రత్త
ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే చలానా తప్పదు
నగరంలో అడుగడుగునా నిఘా నేత్రాలు
240 జంక్షన్లలో 350 సీసీ కెమెరాలు
మరో 200 హ్యాండ్ కెమెరాలు
ఈ ఏడాది 31,05,445 ఉల్లంఘన కేసులు నమోదు
సగటున ప్రతీరోజు 8508 మంది...,
గంటకు 354 మంది..,
నిమిషానికి ఆరుగురు ట్రాఫిక్
ఉల్లంఘనకు పాల్పడుతున్నారు
సిటీబ్యూరో: వాహనదారులూ తస్మాత్ జాగ్రత్త... ట్రాఫిక్ పోలీసులు లేరుకదా అని నిబంధనలను ఉల్లంఘించి వాహనం నడిపితే చలానా బారిన పడతారు. ఎక్కడ? ఎప్పుడు, ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడ్డారనే సాక్ష్యాలతో సహా ట్రాఫిక్ పోలీసులు మీ ఇంటికి చలాన్ పంపిస్తారు. నగరంలోని 240 జంక్షన్లలో ఉన్న సుమారు 350 సీసీ కెమెరాలు ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే వెంటనే ఫొటోలు తీసేస్తున్నాయి. అలాగే, ప్రతీ చిన్నజంక్షన్, రహదారులపై 200 మంది కానిస్టేబుళ్ల చేతిలో ఉన్న కెమెరాలతోనూ ఫొటోలు తీస్తున్నారు. ఈ ఏడాది 31,05,445 మంది ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినట్లు నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ జితేందర్ తెలిపారు. రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు వాహనం నడుపుతున్న వాహనదారులు ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసుల నుంచి ఇంటికి వస్తున్న చలానా చూసి కంగుతింటున్నారు. గతంలో ఉల్లంఘనకు పాల్పడితే రూ.100 చ లానా విధించేవారు.. అది ఇప్పుడు రూ.1000కి చేరింది. ఈ నే పథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే టాప్ 20 జంక్షన్లలో మొదటి స్థానం ఎస్‌ఆర్‌నగర్ ట్రాఫిక్ ఠాణా పరిధిలోని యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు చౌరస్తా ఉంది. ఇక్కడ గత రెండేళ్లలో 53161 మంది రాగ్‌సైడ్ డ్రైవింగ్ చేసి చలానా బారిన పడ్డారు. ఇక రెండో స్థానంలో గోషామహల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్‌ఏ బజార్ చౌరస్తా ఉంది. ఇక్కడ కూడా రాగ్‌సైడ్ డ్రైవింగ్ చేసిన 48833 మందిపై చలానా కొరడా జుళిపించారు. ఇక మూడో స్థానంలో నల్లకుంట పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్‌వీఎస్ కళాశాల చౌరస్తా దక్కించుకుంది. ఇక్కడ 34247మంది చలానా బారిన పడ్డారు. ఇక ఉల్లంఘన తీరును గమనిస్తే 82 రకాల ఉల్లంఘనలు ట్రాఫిక్ విభాగంలో ఉన్నాయి. ఈ ఏడాది అన్ని రకాల ఉల్లంఘనల్లో మొత్తం 31,05,445 కేసులు నమోదు కాగా... అందులో మొదటి స్థానంలో అత్యధికంగా ఎక్‌స్ట్రా ప్రొజెక్షన్ ఆన్ టాప్ (పరిమితికి మించి ఎత్తు/ పొడుగులో సామగ్రి తరలింపు) కేసులు 5,16,613 గూడ్స్ వాహనాలపై కేసులు నమోదయ్యాయి, రెండో స్థానంలో పార్కింగ్ ఆన్ సర్వీస్ రోడ్స్ కేసులు 4,80,509, మూడో స్థానంలో రాంగ్‌సైడ్ డ్రైవింగ్ 4,42,591 ఉన్నాయి.