క్యాబ్...భద్రత ఏది సాబ్?
⇒ క్యారెక్టర్ సర్టిఫికెట్ లేకుండా డ్రైవర్ల నియామకాలు
⇒ ప్రవర్తనపై కొరవడిన పర్యవేక్షణ
⇒ నిబంధనలు ఉల్లంఘిస్తున్న క్యాబ్స్ సంస్థలు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని క్యాబ్‌లలో ప్రయాణికులకు భద్రత లేకుండాపోతోంది. డ్రైవర్ల నియామకాల్లో క్యాబ్ సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ఈ సంస్థల పనితీరుపై పర్యవేక్షణ, నిఘా కొనసాగించవలసిన రవాణా, పోలీసు విభాగాలు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నాయి.
నగరంలోని వేలాది వాహనాలు ఎలాంటి వ్యక్తుల చేతుల్లో ఉన్నాయనే అంశంపై స్పష్టత లేదు. మేరు, డాట్స్, ఓలా, ఎల్లో, గ్రీన్‌క్యాబ్స్ తదితర 15కు పైగా క్యాబ్ సంస్థలు నగరంలో వేలాది వాహనాలతో ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పిస్తున్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు. ఐటీ కారిడార్‌లకు రాకపోకలు సాగించే ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు ఎక్కువ శాతం క్యాబ్స్‌పైనే ఆధార పడుతున్నారు.24 గంట లూ రవాణా సదుపాయాన్ని కల్పించే క్యాబ్ సంస్థలు లాభార్జనే తప్ప ప్రయాణికుల భద్రతను పట్టించుకోవడం లేదు.
నిబంధనలకు విరుద్ధం..
ఆర్టీఏ నిబంధనల ప్రకారం క్యాబ్ సంస్థలు కనీసం ఐదు వాహనాలను సొంతంగా సమకూర్చుకొని ప్రత్యేకమైన కార్యాలయంతో పాటు, అన్ని రకాల భద్రతా నిబంధనలకు అనుగుణంగా అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. నగరంలోని చాలా సంస్థలు కేవలం కాల్ సెంటర్లుగా వ్యవహరిస్తున్నాయి. సొంత వాహనాలు, నమ్మకమైన డ్రైవర్లు లేకుండానే సేవలు అందిస్తున్నాయి, పైగా వాటి కార్యాలయాలపై ఆర్టీఏ అధికారులకు స్పష్టత లేకపోవడం గమనార్హం.
ఆర్టీఏ నిబంధనల మేరకు క్యాబ్ సంస్థలుగా లెసైన్స్ పొందినవి ఏటా లెసైన్స్‌లను రెన్యువల్ చేసుకోవాలి. కానీ ఇదేదీ కనిపించడం లేదు. అత్యవసర పరిస్థితులు, మహిళా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకమైతే తప్ప స్పందించని ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యంతో అనేక సంస్థలు నిబంధనలను తుంగలో తొక్కి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
‘క్యారెక్టర్’ లేదు...
నగరంలోని ఒకటి, రెండు మినహా మిగతా క్యాబ్ సంస్థలు డ్రైవర్ల క్యారెక్టర్‌పై నిశితమైన పరిశీలన లేకుండానే వ్యాపార ప్రకటనలు, ఆదాయమే లక్ష్యంగా ఎడాపెడా వాహనాల సంఖ్యను పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాహన యజమాని చిరునామా, పర్మిట్ గడువు తదితర అంశాలతో పాటు ఆ వాహనాన్ని నడిపే డ్రైవర్ ప్రవర్తనపై పోలీసుల సర్టిఫికెట్ తప్పనిసరి. వారిపై గతంలో ఏమైనా కేసులు నమోదై ఉన్నాయా, జైలుకు వెళ్లారా, చుట్టుపక్కల వారితో గొడవలు, కొట్లాటలకు దిగడం వంటి అంశాలపై స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి క్యారెక్టర్ సర్టిఫికెట్ తీసుకోవాలి. క్యాబ్ సంస్థలు ఇలాంటి ధ్రువీకరణ లేకుండానే డ్రైవర్లను నియమిస్తున్నాయి.
స్పెషల్ డ్రైవ్ చేపడతాం: రఘునాథ్, జేటీసీ హైదరాబాద్
మోటారు వాహన నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లెసైన్సులు ఇవ్వడమే కాదు. వాటిని రద్దు చేసే అవకాశం కూడా ఉంది. వాహనాన్ని నడిపేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్న ఒక వ్యక్తికి డ్రైవింగ్ లెసైన్స్ పొందే హక్కు ఉంది. చెడు ప్రవర్తన, మద్యం తాగి వాహనాలను నడపడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, డ్రగ్స్ తీసుకోవడం వంటి వాటి ఆధారంగా లెసైన్స్‌లను రద్దు చేసే అధికారం ఉంది. బుధవారం నుంచి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం.