నిబంధనల ఉల్లంఘన
సాక్షి, చెన్నై: మీనంబాక్కం విమానాశ్రయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఎం డీఎంకే నేత వైగోపై కేసు నమోదు అయింది. ఆయనతోపాటుగా 400 మందిపై కేసులు పెట్టారు. అయితే, నిబంధనలను ఉల్లంఘిస్తున్నా చోద్యం చూసినందుకుగాను విమానాశ్రయం ఇన్‌స్పెక్టర్ మహిమై వీరన్‌పై బదిలీ వేటు పడింది.
ఎండీఎంకే నేత వైగో చాలా కాలం తర్వాత విదేశాలకు గత వారం వెళ్లారు. ఆయనపై ఉన్న కేసుల ఎత్తివేతతో తొలి పర్యటనలో మలేషియాకు వెళ్లారు. అక్కడ తమిళ మహాసభల్ని ముగించుకుని బుధవారం చెన్నైకు తిరుగు పయనమయ్యారు. విదేశాలకు వెళ్లి వస్తున్న తమ నేతకు ఘన స్వాగతం పలికేందుకు ఎండీఎంకే వర్గాలు ఏర్పాట్లు చేశాయి. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే విమానాశ్రయం పరిసరాల్లో హంగామా సృష్టించాయి.
వివాదం: విదేశీ టెర్మినల్ వద్ద ప్రత్యేక ఆంక్షలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎవరైనా వస్తే, వారిని ఆహ్వానించేందుకు పెద్ద సంఖ్య లో టెర్మినల్ వైపుగా ఎవ్వరూ చొచ్చుకు రాకూడదు. అలాగే, ఊరేగింపులు నిర్వహించరాదు. అయితే, ఎండీఎంకే వర్గాలు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించాయి. వైగో బయటకు రాగానే టెర్మినల్ ప్రవేశ మార్గంలోకి చొచ్చుకెళ్లాయి. భద్రతా సిబ్బంది అడ్డుకునే క్రమంలో వైగో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అక్కడి భద్రతా సిబ్బందిని ఆయన తీవ్రంగానే మందలించారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన ఎండీఎంకే వర్గాలు ఉత్సాహంతో కేరింతలు కొడుతూ టెర్మినల్ నుంచి ఊరేగింపుగా నినాదాలతో హోరెత్తిస్తూ ముందుకు కదిలారు.
కేసుల నమోదు: విమానాశ్రయం పరిసరాల్లో సాగిన ఎండీఎంకే వర్గాల హంగామాను అక్కడి ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. నిబంధనల ఉల్లంఘన, భద్రతలో స్థానిక పోలీసుల వైఫల్యంను ఎత్తి చూపుతూ హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో నగర పోలీసు యంత్రాంగం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగర పోలీసు కమిషనర్ జార్జ్ ఆదేశాలతో అక్కడి పోలీసులు ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. వైగోకు ఆహ్వానం పలికేందుకు వచ్చిన వారి పేర్లను సేకరించి, కేసుల నమోదుకు నిర్ణయించారు.
ఎండీఎంకే నేత వైగో, మల్లై సత్య, పాలవాక్కం సోము తదితరులతో పాటుగా 400 మందిపై కేసులు నమోదు చేశారు. విమానాశ్రయంలో భద్రత విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, వారించిన వారిపై తిరగబడడం, నిబంధనల ఉల్లంఘన, అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తదితర సెక్షన్లతో వీరిపై కేసులు పెట్టారు. చివరకు అక్కడి భద్రతా విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్ మహిమై వీరన్‌పై బదిలీ వేటు తప్పలేదు. ఆయన్ను అక్కడి నుంచి ట్రిప్లికేషన్ క్రైం బ్రాంచ్‌కు మార్చారు. మైలాపూర్ ఇన్‌స్పెక్టర్ వెంకటరమణను విమానాశ్రయూనికి బదిలీ చేశారు.