తూత్తుకూడి: తమిళనాడులోని తూత్తుకూడిలో వేదాంత స్టెర్లైట్ కాపర్ పరిశ్రమను మూసేయాలంటూ ఈ ఏడాది మే నెలలో నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపి 13 మంది అమాయకులను పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. చనిపోయిన 13 మందిలో 12 మందికి బుల్లెట్లు ఛాతీ లేదా అంతకన్నా పై భాగంలోనే తగిలాయనీ, సగం మంది శరీరాల్లోకి బుల్లెట్లు వెనుకవైపు నుంచి దూసుకెళ్లాయని పోస్ట్‌మార్టమ్ నివేదికలు తాజాగా స్పష్టం చేస్తున్నాయి. దీనిని బట్టి అక్కడి పోలీసులు నిబంధనలను ఎంత తీవ్రంగా ఉల్లంఘించారో తెలుస్తోంది.
భారత్‌లో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం నిరసనల్లో పరిస్థితి పూర్తిగా చేయిదాటినప్పుడు మాత్రమే భద్రతా దళాలు కాల్పులు జరిపేందుకు అనుమతి ఉంది. కాల్పులు జరిపినా వాటి లక్ష్యం ఆందోళనలను అణచివేయడమే తప్ప మనుషులను చంపడం అయ్యుండకూడదు. తల, ఛాతీ, గుండె భాగంలో బుల్లెట్ తగలకుండా శరీరంలో వీలైనంత కింద భాగంలో, గరిష్టంగా నడుము వరకు ఉన్న భాగంలో మాత్రమే కాల్చాలి. కానీ ఈ నిబంధనలను ఉల్లంఘించి, ఆందోళనకారుల ప్రాణాలు తీయడానికి అన్నట్లు ఈ ఏడాది మే నెలలో పోలీసులు కాల్పులు జరిపారు. చనిపోయిన వారిలో అత్యంత చిన్న వయస్కురాలు 17 ఏళ్ల బాలిక కాగా, బుల్లెట్ ఆమె తల వెనుక భాగంలో తగిలి నోటి నుంచి బటయకొచ్చిందని పోస్ట్‌మార్టంలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment