రూ.కోట్లకు పడగ చింటూ, బుల్లెట్‌ల వద్ద పలు పంచాయతీలు
మరికొందరిపై కేసుల నమోదుకు రంగం సిద్ధం
రూ.కోటి విలువైన స్థలాల గుర్తింపు
పావని దంపతులకు ముగిసిన పోలీసు కస్టడీ
చిత్తూరు (అర్బన్): పావని.. రెండేళ్ల క్రితం చీరలు అమ్ముతూ జనంలోకి వచ్చిన ఓ సాధారణ మహిళ. ఆమె భర్త చరణ్ ఆటో డ్రైవర్. ఆమె చుట్టుపక్కల వారినే కాకుండా పలు ప్రాంతాల వారిని మాయ మాటలతో పడేసింది. కిలోల లెక్కన బంగారు ఆభరణాలు, రూ.కోట్ల నగదు తీసుకుని చివరకు వారికి టోపీ పెట్టింది. పోలీసు కస్టడీలో ఆమె తెలిపిన వివరాలు విని పోలీసులకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది. తొమ్మిది రోజుల కస్టడీ గడువు పూర్తికావడంతో వారిని సోమవారం కోర్టు ఎదుట హాజరుపరచి చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ విచారణలో పావని దంపతులు చెప్పిన వివరాల మేరకు పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.
అత్యాశే పెట్టుబడి
తమిళనాడుకు చెందిన పావని రెండేళ్ల క్రితం చిత్తూరు నగరం మిట్టూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని చీరల వ్యాపారం, చిన్న కిరాణ దుకాణం నిర్వహించడం మొదలుపెట్టింది. చుట్టు పక్కల మహిళల్ని లక్ష్యంగా చేసుకుని నూటికి రూ.పది చొప్పున వడ్డీ ఇస్తానని చెప్పి నగదు తీసుకుంది. సక్రమంగా వడ్డీ చెల్లిస్తూ నమ్మకం పెంచుకుంది. వారి అత్యాశను పెట్టుబడిగా మార్చుకుంది. నమ్మకమనే పేరిట పలువురు మహిళల నుంచి సుమారు 8.25 కిలోల బంగారు ఆభరణాలను సేకరించింది. వీటిని తాకట్టుపెట్టి సొమ్ము చేసుకుంది. దీనికి తోడు చీటీలు, చేతి బదులు, అధిక వడ్డీలు ఇస్తానని చెప్పి రూ.1.85 కోట్ల వరకు తీసుకుంది.
విదేశీ టూర్లు...
ఇదే నమ్మకంతో చిత్తూరు నగరంలోని ఎస్టేట్‌కు చెందిన ఓఎం.రాందాస్ కుటుంబంతో పరిచయం పెంచుకుంది. నిత్యం ‘డాడీ.. డాడీ..’ అని వారిని పావని పిలిచేది. ఈ క్రమంలోనే వారితో కలిసి థాయ్‌లాండ్, సింగపూర్‌కు సైతం టూర్లకు వెళ్లింది. రాందాస్ కుమార్తె జ్యోత్స్నకు సైతం హాండిచ్చింది. ఇక చీటీల పేరిట రూ.1.83 కోట్లు అప్పులు చేసి న్యాయస్థానంలో ఐపీ దాఖలు చేసింది. ముత్తూట్ ఫిన్‌కార్ప్ సంస్థలో ఏకంగా 234 ఖాతాల్లో 8 కిలోలకు పైగా బంగారు ఆభరణాలను కుదువపెట్టి సొమ్ము చేసుకుంది. డబ్బులు అడిగిన వారిని చింటూ వద్దకు పిలిపించి బెదిరించేది. ఇదే క్రమంలో చిత్తూరుకు చెందిన బుల్లెట్ సురేష్, ప్రియ అనే మహిళకు ఇవ్వాల్సిన ఆభరణాలు, నగలపై పంచాయతీ చేసినట్లు పావని దంపతులు పోలీసులకు వివరించారు. దీనిపై ఇప్పటికే పోలీసులు బుల్లెట్ సురేష్‌ను విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
రూ.కోట్ల విలువైన స్థలాల గుర్తింపు
పావని దంతపతులకు నగరంలోని ఎస్టేట్‌లో ఓ స్థలం, మురకంబట్టులో ఇంటిని గుర్తించారు. వీటి విలువ రూ.కోటి వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీటిపై చట్టపరంగా అటాచ్‌మెంట్‌కు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక పావని వద్ద ఉన్న ఇండికా, డస్టర్, రెండు టెంపో వాహనాలను ఫైనాన్స్ సంస్థలు ఇప్పటికే సీజ్ చేశాయి. తొలుత ఇద్దరు మహిళలు మాత్రమే పావనిపై ఫిర్యాదు చేయగా ప్రస్తుతం వారి సంఖ్య 15కు చేరింది. పావని దంపతులు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.