సంఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్న ఎస్పీ త్రివిక్రమవర్మ
పాలకొండ: పాలకొండలో చంచలనం కలిగించిన డైట్ విద్యార్థిని పాలక పావని మృతి కేసు పలు మలుపులు తిరుగుతోంది. మూడు రోజులుగా పోలీసులు కేసును ఛేదించలేకపోయారు. ప్రస్తుతం ఈ కేసు వ్యవహారంలో సీతంపేటకు చెందిన అధికార పార్టీ నాయకుడు జిల్లాకు చెందిన ఓ మంత్రితో పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. దీంతో పావని ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించేలా దర్యాప్తు సాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట్లో హత్య జరిగినట్టు ప్రాథమిక నిర్థారణకు వచ్చిన పోలీసులు ప్రస్తుతం మంత్రి జోక్యంతో కేసును నీరుగారుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా పోస్టుమార్టం నిర్వహించిన సమయంలో ఆరు అంగులాల వరకూ గొంతు కోసి ఉండడంతో పావనిని హత్య చేశారని వైద్యులు నిర్థారించారు. దీంతో ఇప్పటికే ఇంటి యజమాని సహ ఎనిమిది మందిని పోలీసులు విచారించారు. మరి కొంతమందిని అదుపులో ఉంచి విచారిస్తున్నారు.
ఎమ్మెల్యే ఆగ్రహం
కేసు విషయంలో జరుగుతున్న రాజకీయ వ్యవహారంతో ఎమ్మెల్యే కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన మహిళను హత్యచేసినా పట్టించుకోరా అంటూ మండిపడ్డారు. ఈ విషయమై ఆమె ఎస్పీ త్రివిక్రమవర్మతో ఫోన్‌లో మాట్లాడారు. రాజకీయ నాయకుల ఒత్తిడితో కేసును పక్కతోవ పట్టిస్తే ఆందో ళన చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో కీలక నిందితులను అరెస్టు చేయాలని, పోస్టుమార్టం నివేదిక బహిర్ఘతం చేయాలని కోరారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేసును న్యాయబద్ధంగా చేయాలని ఇప్పటికే కోరామని, పోలీసులు మాత్రం కేసును నీరుగార్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు వ్యవహారంలో సీతంపేటకు చెందిన ఓ నాయకుడు డబ్బులుకాజేసీ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలు స్తుందని ఆరోపించారు. గిరిజనులకు అన్యాయం జరిగేలా దర్యాప్తు సాగితే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఎస్పీ సందర్శన
పావని మృతిపై ఎస్పీ త్రివిక్రమవర్మ స్వయంగా పరిశీలనకు దిగారు. మరోసారి పాలకొండ శుక్రవారం వచ్చిన ఆయన పావని మృతిచెందిన ఇంటిని పరిశీలించారు. అక్కడ స్థానికులతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులతోనూ సంఘనా స్థలంలో వివరాలు తీసుకున్నారు. క్రైం డీఎస్పీ వేణుగోపాలనాయుడు, డీఎస్పీ స్వరూపరాణి, సీఐ వేణుగోపాలరావు, ఎస్సై వాసునారాయణ ఆయనతో పాటు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. కాగా ఎస్పీ త్రివిక్రమవర్మ విలేకరులతో మాట్లాడుతూ పావని ముందుగా యాసిడ్ తాగి అనంతరం గొంతు కోసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తుందన్నారు. అయితే యాసిడ్ తాగించి హత్య చేశారా, లేక తానే ఆత్మహత్య చేసుకుందా అన్నది దర్యాప్తులో తేలుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి అనుమానితులను విచారిస్తున్నామని చెప్పారు. కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment