క్యాబ్‌ ప్రయాణికుల భద్రతకు ‘గార్డియన్‌’ | Cab Companies Will Introduce Real Time Tracking | Sakshi
Sakshi News home page

క్యాబ్‌ ప్రయాణికుల భద్రతకు ‘గార్డియన్‌’

Published Tue, Oct 2 2018 1:11 AM | Last Updated on Tue, Oct 2 2018 1:11 AM

Cab Companies Will Introduce Real Time Tracking - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : క్యాబ్‌ ప్రయాణికులను ప్రత్యేకించి మహిళలను మరింత భద్రంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు దేశీ క్యాబ్‌ సేవల దిగ్గజం ఓలా త్వరలో హైదరాబాద్‌లో సరికొత్త సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. నిర్దేశిత మార్గం నుంచి వాహనం దారితప్పిన లేదా ఆగిన సమయాల్లో ప్రయాణికులను నేరుగా ఫోన్లో సంప్రదించడం, డ్రైవర్‌ ప్రవర్తనపై ఫిర్యాదులుంటే తక్షణమే సమీప పోలీసుస్టేషన్‌కు సమాచారం పంపే ఏర్పాట్లతో కూడిన రియల్‌టైమ్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ ‘గార్డియన్‌’ను ప్రవేశపెట్టనుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లర్నింగ్‌ టూల్స్‌ ఆధారంగా ట్రాకింగ్‌ వ్యవస్థ పనిచేయనుంది. స్ట్రీట్‌ సేఫ్‌ పేరిట చేపడుతున్న దేశవ్యాప్త రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ఈ వ్యవస్థను ఓలా తీసుకొచ్చింది. ముంబై, పుణే, బెంగళూరు నగరాల్లో ఓలా గతవారమే ‘గార్డియన్‌’ను ప్రారంభించింది. ఈ నెలాఖర్లోగా ఢిల్లీ, కోల్‌కతా సహా మరికొన్ని నగరాలకూ దీన్ని విస్తరించనుంది. 

ముందస్తు రక్షణ... 
రాత్రి వేళల్లో మహిళా ప్రయాణికుల భద్రత పోలీసులు, క్యాబ్‌ సంస్థలకు తరచూ సవాల్‌గా మారుతోంది. ప్రస్తుతం క్యాబ్‌లు బుక్‌ చేసుకొనే సమయంలోనే వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్, డ్రైవర్‌ ఫొటో తదితర వివరాలు ప్రయాణికుల స్మార్ట్‌ఫోన్లలో కనిపిస్తున్నా ప్రయాణ సమయాల్లో డ్రైవర్ల ప్రవర్తనను అంచనా వేయడం మాత్రం కష్టసాధ్యమవుతోంది. రాత్రి వేళల్లో డ్రైవర్ల ప్రవర్తనపై తరచుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఒక మహిళ క్యాబ్‌లో ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా మార్గమధ్యలో డ్రైవర్‌ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ట్వీట్‌ చేశారు.

ఈసీఐఎల్‌ ప్రాంతంలోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. దీంతో రాత్రి 10 దాటాక మహిళలు క్యాబ్‌లలో వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాతే బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ముందస్తు రక్షణ వ్యవస్థ మాత్రం ఉండట్లేదు. ఈ నేపథ్యంలో ఓలా ప్రవేశపెట్టనున్న ‘గార్డియన్‌’వ్యవస్థ ద్వారా వాహనం గమనాన్ని ప్రతిక్షణం ట్రాక్‌ చేస్తూ ప్రయాణ సమయంలోనే ప్రయాణికుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు అవకాశం లభించనుంది. 

భద్రతకు భరోసా ... 
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, సికింద్రాబాద్, నాంపల్లి,కాచిగూడ రైల్వేస్టేషన్‌లు, ఎంజీబీఎస్, జేబీఎస్‌ బస్‌స్టేషన్‌లు, తదితర ప్రధాన కూడళ్ల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులతోపాటు హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్‌ వంటి ఐటీ కారిడార్లలో క్యాబ్‌ సర్వీసులను వినియోగించే సాఫ్ట్‌వేర్‌ నిపుణులకు పూర్తి భద్రత కల్పించేందుకు ఓలా ‘గార్డియన్‌’దొహదపడనుంది. ప్రత్యేకించి మహిళా ప్రయాణికుల భద్రతకు ‘గార్డియన్‌’బలమైన అస్త్రంగా పనిచేస్తుందని, ప్రజారవాణా రంగంలో తొలిసారి దీన్ని ప్రవేశపెట్టామని ఓలా ప్రతినిధి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. 

ఎలా పనిచేస్తుంది... 
– ‘గార్డియన్‌’వ్యవస్థ ద్వారా ప్రయాణికులకు, ఓలా సెక్యూరిటీ రెస్పాన్స్‌ టీమ్‌ (ఎస్‌ఆర్‌టీ)కు మధ్య ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ బృందం ప్రతి వాహనాన్ని నిరంతరం ట్రాక్‌ చేస్తుంది. 
– ప్రయాణికులు ఎంపిక చేసుకున్న మార్గంలో కాకుండా డ్రైవర్‌ వేరే మార్గంలోకి మళ్లినట్లుగా అనుమానం వస్తే వెంటనే ప్రయాణికులకు ఈ బృందం ఫోన్‌ చేస్తుంది. ఆ మార్గం సరైనదేనా లేక ఏమైనా ఇబ్బందులున్నాయా అని అడిగి తెలుసుకుంటుంది. 
– అదే సమయంలో డ్రైవర్ల ప్రవర్తనపై ఫిర్యాదులుంటే స్వీకరించి వెంటనే ఆ సమాచారాన్ని పర్యవేక్షక బృందం సమీప పోలీస్‌ స్టేషన్‌కు చేరవేస్తుంది. 
– ఓలా సెక్యూరిటీ రెస్పాన్స్‌ టీమ్‌ నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ప్రయాణికులకు వెంటనే రక్షణ కల్పిస్తారు. 

50 వేల మందికి పైగా ప్రయాణం... 
గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిత్యం సుమారు 50 వేల మంది ప్రయాణికులు ఓలా సేవలను వినియోగించుకుంటున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంతోపాటు ఐటీ కారిడార్లలో ఓలా క్యాబ్‌ల వినియోగం ఎక్కువగా ఉంది. 5 వేల మందికిపైగా లీజు పద్ధతిలో ఓలా వాహనాలను నిర్వహిస్తుండగా మరో 20 వేలకుపైగా ఓలాతో అనుసంధానమైన వాహనాలు నడుస్తున్నాయి. ఉబెర్, మేరు వంటి ఇతర క్యాబ్‌ సంస్థలు ఉన్నప్పటికీ ప్రజారవాణా రంగంలో వినూత్న చర్యలు చేపట్టడం ద్వారా ఈ సంస్థ ఎక్కువగా ప్రాచూర్యంలోకి వచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement