Cabs companies
-
క్యాబ్ ప్రయాణికుల భద్రతకు ‘గార్డియన్’
సాక్షి, హైదరాబాద్ : క్యాబ్ ప్రయాణికులను ప్రత్యేకించి మహిళలను మరింత భద్రంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు దేశీ క్యాబ్ సేవల దిగ్గజం ఓలా త్వరలో హైదరాబాద్‌లో సరికొత్త సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. నిర్దేశిత మార్గం నుంచి వాహనం దారితప్పిన లేదా ఆగిన సమయాల్లో ప్రయాణికులను నేరుగా ఫోన్లో సంప్రదించడం, డ్రైవర్ ప్రవర్తనపై ఫిర్యాదులుంటే తక్షణమే సమీప పోలీసుస్టేషన్‌కు సమాచారం పంపే ఏర్పాట్లతో కూడిన రియల్‌టైమ్ ట్రాకింగ్ వ్యవస్థ ‘గార్డియన్’ను ప్రవేశపెట్టనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లర్నింగ్ టూల్స్ ఆధారంగా ట్రాకింగ్ వ్యవస్థ పనిచేయనుంది. స్ట్రీట్ సేఫ్ పేరిట చేపడుతున్న దేశవ్యాప్త రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ఈ వ్యవస్థను ఓలా తీసుకొచ్చింది. ముంబై, పుణే, బెంగళూరు నగరాల్లో ఓలా గతవారమే ‘గార్డియన్’ను ప్రారంభించింది. ఈ నెలాఖర్లోగా ఢిల్లీ, కోల్‌కతా సహా మరికొన్ని నగరాలకూ దీన్ని విస్తరించనుంది. ముందస్తు రక్షణ... రాత్రి వేళల్లో మహిళా ప్రయాణికుల భద్రత పోలీసులు, క్యాబ్ సంస్థలకు తరచూ సవాల్‌గా మారుతోంది. ప్రస్తుతం క్యాబ్‌లు బుక్ చేసుకొనే సమయంలోనే వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, డ్రైవర్ ఫొటో తదితర వివరాలు ప్రయాణికుల స్మార్ట్ఫోన్లలో కనిపిస్తున్నా ప్రయాణ సమయాల్లో డ్రైవర్ల ప్రవర్తనను అంచనా వేయడం మాత్రం కష్టసాధ్యమవుతోంది. రాత్రి వేళల్లో డ్రైవర్ల ప్రవర్తనపై తరచుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఒక మహిళ క్యాబ్‌లో ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ట్వీట్ చేశారు. ఈసీఐఎల్ ప్రాంతంలోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. దీంతో రాత్రి 10 దాటాక మహిళలు క్యాబ్‌లలో వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాతే బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ముందస్తు రక్షణ వ్యవస్థ మాత్రం ఉండట్లేదు. ఈ నేపథ్యంలో ఓలా ప్రవేశపెట్టనున్న ‘గార్డియన్’వ్యవస్థ ద్వారా వాహనం గమనాన్ని ప్రతిక్షణం ట్రాక్ చేస్తూ ప్రయాణ సమయంలోనే ప్రయాణికుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు అవకాశం లభించనుంది. భద్రతకు భరోసా ... శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, సికింద్రాబాద్, నాంపల్లి,కాచిగూడ రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్ బస్స్టేషన్లు, తదితర ప్రధాన కూడళ్ల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులతోపాటు హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్ వంటి ఐటీ కారిడార్లలో క్యాబ్ సర్వీసులను వినియోగించే సాఫ్ట్వేర్ నిపుణులకు పూర్తి భద్రత కల్పించేందుకు ఓలా ‘గార్డియన్’దొహదపడనుంది. ప్రత్యేకించి మహిళా ప్రయాణికుల భద్రతకు ‘గార్డియన్’బలమైన అస్త్రంగా పనిచేస్తుందని, ప్రజారవాణా రంగంలో తొలిసారి దీన్ని ప్రవేశపెట్టామని ఓలా ప్రతినిధి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఎలా పనిచేస్తుంది... – ‘గార్డియన్’వ్యవస్థ ద్వారా ప్రయాణికులకు, ఓలా సెక్యూరిటీ రెస్పాన్స్ టీమ్ (ఎస్ఆర్టీ)కు మధ్య ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ బృందం ప్రతి వాహనాన్ని నిరంతరం ట్రాక్ చేస్తుంది. – ప్రయాణికులు ఎంపిక చేసుకున్న మార్గంలో కాకుండా డ్రైవర్ వేరే మార్గంలోకి మళ్లినట్లుగా అనుమానం వస్తే వెంటనే ప్రయాణికులకు ఈ బృందం ఫోన్ చేస్తుంది. ఆ మార్గం సరైనదేనా లేక ఏమైనా ఇబ్బందులున్నాయా అని అడిగి తెలుసుకుంటుంది. – అదే సమయంలో డ్రైవర్ల ప్రవర్తనపై ఫిర్యాదులుంటే స్వీకరించి వెంటనే ఆ సమాచారాన్ని పర్యవేక్షక బృందం సమీప పోలీస్ స్టేషన్‌కు చేరవేస్తుంది. – ఓలా సెక్యూరిటీ రెస్పాన్స్ టీమ్ నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ప్రయాణికులకు వెంటనే రక్షణ కల్పిస్తారు. 50 వేల మందికి పైగా ప్రయాణం... గ్రేటర్ హైదరాబాద్‌లో నిత్యం సుమారు 50 వేల మంది ప్రయాణికులు ఓలా సేవలను వినియోగించుకుంటున్నారు. శంషాబాద్ విమానాశ్రయంతోపాటు ఐటీ కారిడార్లలో ఓలా క్యాబ్‌ల వినియోగం ఎక్కువగా ఉంది. 5 వేల మందికిపైగా లీజు పద్ధతిలో ఓలా వాహనాలను నిర్వహిస్తుండగా మరో 20 వేలకుపైగా ఓలాతో అనుసంధానమైన వాహనాలు నడుస్తున్నాయి. ఉబెర్, మేరు వంటి ఇతర క్యాబ్ సంస్థలు ఉన్నప్పటికీ ప్రజారవాణా రంగంలో వినూత్న చర్యలు చేపట్టడం ద్వారా ఈ సంస్థ ఎక్కువగా ప్రాచూర్యంలోకి వచ్చింది. -
క్యాబ్...భద్రత ఏది సాబ్?
⇒ క్యారెక్టర్ సర్టిఫికెట్ లేకుండా డ్రైవర్ల నియామకాలు ⇒ ప్రవర్తనపై కొరవడిన పర్యవేక్షణ ⇒ నిబంధనలు ఉల్లంఘిస్తున్న క్యాబ్స్ సంస్థలు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని క్యాబ్‌లలో ప్రయాణికులకు భద్రత లేకుండాపోతోంది. డ్రైవర్ల నియామకాల్లో క్యాబ్ సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ఈ సంస్థల పనితీరుపై పర్యవేక్షణ, నిఘా కొనసాగించవలసిన రవాణా, పోలీసు విభాగాలు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నాయి. నగరంలోని వేలాది వాహనాలు ఎలాంటి వ్యక్తుల చేతుల్లో ఉన్నాయనే అంశంపై స్పష్టత లేదు. మేరు, డాట్స్, ఓలా, ఎల్లో, గ్రీన్‌క్యాబ్స్ తదితర 15కు పైగా క్యాబ్ సంస్థలు నగరంలో వేలాది వాహనాలతో ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పిస్తున్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు. ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు ఎక్కువ శాతం క్యాబ్స్పైనే ఆధార పడుతున్నారు.24 గంట లూ రవాణా సదుపాయాన్ని కల్పించే క్యాబ్ సంస్థలు లాభార్జనే తప్ప ప్రయాణికుల భద్రతను పట్టించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధం.. ఆర్టీఏ నిబంధనల ప్రకారం క్యాబ్ సంస్థలు కనీసం ఐదు వాహనాలను సొంతంగా సమకూర్చుకొని ప్రత్యేకమైన కార్యాలయంతో పాటు, అన్ని రకాల భద్రతా నిబంధనలకు అనుగుణంగా అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. నగరంలోని చాలా సంస్థలు కేవలం కాల్ సెంటర్లుగా వ్యవహరిస్తున్నాయి. సొంత వాహనాలు, నమ్మకమైన డ్రైవర్లు లేకుండానే సేవలు అందిస్తున్నాయి, పైగా వాటి కార్యాలయాలపై ఆర్టీఏ అధికారులకు స్పష్టత లేకపోవడం గమనార్హం. ఆర్టీఏ నిబంధనల మేరకు క్యాబ్ సంస్థలుగా లెసైన్స్ పొందినవి ఏటా లెసైన్స్‌లను రెన్యువల్ చేసుకోవాలి. కానీ ఇదేదీ కనిపించడం లేదు. అత్యవసర పరిస్థితులు, మహిళా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకమైతే తప్ప స్పందించని ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యంతో అనేక సంస్థలు నిబంధనలను తుంగలో తొక్కి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ‘క్యారెక్టర్’ లేదు... నగరంలోని ఒకటి, రెండు మినహా మిగతా క్యాబ్ సంస్థలు డ్రైవర్ల క్యారెక్టర్‌పై నిశితమైన పరిశీలన లేకుండానే వ్యాపార ప్రకటనలు, ఆదాయమే లక్ష్యంగా ఎడాపెడా వాహనాల సంఖ్యను పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాహన యజమాని చిరునామా, పర్మిట్ గడువు తదితర అంశాలతో పాటు ఆ వాహనాన్ని నడిపే డ్రైవర్ ప్రవర్తనపై పోలీసుల సర్టిఫికెట్ తప్పనిసరి. వారిపై గతంలో ఏమైనా కేసులు నమోదై ఉన్నాయా, జైలుకు వెళ్లారా, చుట్టుపక్కల వారితో గొడవలు, కొట్లాటలకు దిగడం వంటి అంశాలపై స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి క్యారెక్టర్ సర్టిఫికెట్ తీసుకోవాలి. క్యాబ్ సంస్థలు ఇలాంటి ధ్రువీకరణ లేకుండానే డ్రైవర్లను నియమిస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్ చేపడతాం: రఘునాథ్, జేటీసీ హైదరాబాద్ మోటారు వాహన నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లెసైన్సులు ఇవ్వడమే కాదు. వాటిని రద్దు చేసే అవకాశం కూడా ఉంది. వాహనాన్ని నడిపేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్న ఒక వ్యక్తికి డ్రైవింగ్ లెసైన్స్ పొందే హక్కు ఉంది. చెడు ప్రవర్తన, మద్యం తాగి వాహనాలను నడపడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, డ్రగ్స్ తీసుకోవడం వంటి వాటి ఆధారంగా లెసైన్స్‌లను రద్దు చేసే అధికారం ఉంది. బుధవారం నుంచి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం.