Nuzvid Triple IT
-
ట్రిపుల్ ఐటీ ఘటనలో ట్విస్ట్!
సాక్షి, కృష్ణా: నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. లేడీస్ హాస్టల్లో పట్టుబడిన యువకుడు కూడా ట్రిపుల్ ఐటీ విద్యార్థేనని తెలిసింది. విద్యార్థినిల సహకారంతో అతడు వసతి గృహంలోకి చేరినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈనేపథ్యంలో ఆరుగురు విద్యార్థినిలను వర్సిటీ యాజమాన్యం సస్పెండ్ చేసినట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఎవరినీ సస్పెండ్ చేయలేదని సమాచారం. విద్యార్థినిలకు కేవలం కౌన్సెలింగ్ మాత్రమే ఇచ్చి పంపించివేశారని, యువకుడికి కూడా కౌన్సెలింగ్‌తో సరిపెట్టారని తెలిసింది. దీంతో యాజమాన్యం తీరుపై విమర్శలు వస్తున్నాయి. లేడీస్ హాస్టల్లో రోజంతా గడిపిన ఓ యువకుడిపై చర్యలు లేకపోవడం గమనార్హం. ఇక సెక్యురిటీ సిబ్బంది, కేర్ టేకర్లపై చర్యలు శూన్యమనే చెప్పాలి! (చదవండి : లేడీస్ హాస్టల్లో యువకుడు.. ఆరుగురి సస్పెన్షన్!) మంత్రి ఆగ్రహం.. తీవ్ర విమర్శల నేపథ్యంలో మొత్తం వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీకి నివేదించేందుకు వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం క్రమశిక్షణా కమిటీ విద్యార్థులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ట్రిపుల్ ఐటీ కీలక అధికారులు సెలవులో ఉన్నట్టు తెలిసింది. కాగా, ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సీరియస్ అయ్యారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వర్సిటీలో సెక్యురిటీ లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశాలిచ్చారు. -
లేడీస్ హాస్టల్లో యువకుడు.. ఆరుగురి సస్పెన్షన్!
-
లేడీస్ హాస్టల్లో యువకుడు..
సాక్షి, కృష్ణా: నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. అక్కడి సెక్యురిటీ లోపాలు మరోసారి బయటపడ్డాయి. విద్యార్థినుల హ్టాస్టల్లోకి ఓ యువకుడు చొరబడిన ఘటన వెలుగుచూసింది. విద్యార్థినిల సహకారంతో అతడు వసతి గృహంలోకి చేరినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. వివరాలు.. నూజివీడు ట్రిపుల్ ఐటీలోని లేడీస్ హాస్టల్లోకి ఓ యవకుడు చొరబడ్డాడు. కొందరు విద్యార్థినుల సహకారంతో కిటీకీ ఊచలు విరగొట్టి హాస్టల్లోని ఓ గదికి చేరాడు. రోజంతా అక్కడే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం విద్యార్థినులంతా గదికి తాళం వేసి యథావిధిగా కాలేజీకి వెళ్లారు. అయితే, ఆ గదిలో మనుషుల అలికిడి గ్రహించిన తోటి విద్యార్థులు విషయాన్ని సెక్యురిటీ సిబ్బందికి తెలిపారు. దాంతో వారు తాళం పగులగొట్టి గదిలో నక్కిన యువకుడిని పట్టుకున్నారు. విషయం ట్రిపుల్ ఐటీ యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించింది. కొందరు విద్యార్థినుల సహకారంతో అతను లోపలికి వెళ్లగలిగాడని తేలింది. యువకుడికి సహకరించిన ఆరుగురు విద్యార్థినులను యూనివర్సిటీ మేనేజ్మెంట్ సస్పెండ్ చేసినట్టు తెలిసింది. పట్టుబడిన యువకుడు కూడా ట్రిపుల్ ఐటీ విద్యార్థి కావడం గమనార్హం. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న సెక్యురిటీ సిబ్బందిపై విచారణ నివేదిక వచ్చిన అనంతరం చర్యలు తీసుకోనున్నారు. -
ఆ కాంట్రాక్టర్‌పై అంత ప్రేమ ఎందుకో?
* మురికినీటి తరలింపులో నిబంధనలు ఉల్లంఘన * ఏడాదికి రూ.52లక్షలు అప్పనంగా చెల్లింపు * దోచిపెడుతున్న ట్రిపుల్ఐటీ అధికారులు నూజివీడు : నూజివీడు ట్రిపుల్‌ఐటీలో శుద్ధిచేసిన మురికినీటిని బయటకు తరలించేందుకు ట్రిపుల్ఐటీ ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్‌కు సంబంధిత అధికారులు అప్పనంగా లక్షలాది రూపాయలను దోచిపెడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులు, సిబ్బంది వారి అవసరాలకు ఉపయోగించగా వచ్చే మురుగునీటిని ట్రిపుల్‌ఐటీలో ఏర్పాటు చేసిన ఎస్టీపీ(సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లో శుద్ధిచేసినప్పటికీ... ఇంకా కొన్ని మలినాలు మిగిలి ఉన్న నీటిని కాంట్రాక్టు పొందిన వ్యక్తి జనావాసాలు లేని బయట దూరప్రాంతాలకు ట్యాంకర్లతో తరలించాల్సి ఉంది. అయితే ఈ నీటిని దూర ప్రాంతాలకు ట్యాంకర్లతో తరలించకుండానే కాంట్రాక్టర్‌కు అప్పనంగా నెలకు రూ. 4.40 లక్షలు ట్రిపుల్ఐటీ అధికారులు అందజేస్తున్నారని తెలుస్తోంది. ట్రిపుల్‌ఐటీలో విద్యనభ్యసిస్తున్న 7వేల మంది విద్యార్థుల అవసరాలకు, మెస్‌లలో వాడిన నీటిని శుద్ధిచేసి వెలుపలికి పంపించేందుకు ఆవరణలోనే ఎస్టీపీని నిర్మించారు. అయితే దీనినుంచి నీటిని వెలుపలికి పంపేందుకు ఎలాంటి డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో రోజుకు వచ్చే దాదాపు 12లక్షల లీటర్ల నీటిని బయటకు తరలించేందుకు ట్యాంకర్లను వినియోగిస్తున్నారు. అయితే ఈ పనిని కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏ రోజుకారోజు ట్యాంకర్లలో ఈ నీటిని తీసుకెళ్లి ఊరివెలుపల తోటలలోనో, వాగులలోనే పారబోసి రావాలి. దీనికి గానూ వెయ్యి లీటర్లకు రూ.12.20పైసల చొప్పున చెల్లించేటట్లు టెండర్ల ప్రక్రియ ద్వారా మూడేళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే కాంట్రాక్టర్ నీటిని ట్యాంకర్లలో తరలించకుండా మోటర్లతో నీళ్ల ట్యూబ్‌ల ద్వారా ట్రిపుల్‌ఐటీని ఆనుకుని ఉన్న రాజీవ్‌స్వగృహకు కేటాయించిన స్థలంలో వదిలేస్తున్నారు. అంతేగాకుండా ప్రతిరోజూ రాత్రిపూట ట్రిపుల్‌ఐటీని ఆనుకుని ఉన్న గొడుగువారిగూడెం గ్రామం పైకి ఈ నీటిని వదిలేస్తున్నాడు. ఈ విషయం తెలిసినా ట్రిపుల్ ఐటీ అధికారులు కాంట్రాక్టర్‌కు నెలకు రూ4.40లక్షలు చెల్లించేస్తున్నారు. ట్యూబ్‌లతో బయటకు తరలించేటప్పుడు కాంట్రాక్టర్‌కు ఏ విధంగా బిల్లు చెల్లిస్తున్నారో అంతుబట్టడం లేదని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు మురుగునీరు గ్రామంలోకి వస్తుండడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు, ఈగలు ఉధృతమై తాము గ్రామంలో నివశించలేకపోతున్నామని గొడుగువారిగూడెం గ్రామస్తులు ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు కాంట్రాక్టర్‌కు వత్తాసు పలుకుతున్నారు తప్పితే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ఐటీ మురుగునీటి సమస్యను పరిష్కరించకుండా కాలం గుడుపుతున్న అధికారుల వైఖరికి నిరసనగా ఈనెల మొదటి వారంలో నిర్వహించిన జన్మభూమి వార్డు సభను సైతం గ్రామస్తులు అడ్డుకుని అధికారులను నిలదీశారు. కాంట్రాక్టు ముగిసినా రెండేళ్లుగా ఈ కాంట్రాక్టరే... ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ కాలపరిమితి ముగిసి రెండేళ్లవుతున్నా మరళా టెండర్లు పిలిచి కాంట్రాక్టును ఇవ్వకుండా ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్‌కే గడువు పొడిగిస్తూ వస్తున్నారు. పోటీవస్తే ఎవరైనా ఇంతకన్నా తక్కువకు టెండర్ వేస్తే ట్రిపుల్ఐటీకి డబ్బులు ఆదా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు పొడిగించారనేది బహిరంగ రహస్యమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లు పిలిచాం నేను కొత్తగా వచ్చా. గతంలో ఎందుకు పొడిగించారో తెలియదు. టెండర్ల ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం టెండర్లను ఆహ్వానించాం. త్వరలోనే కొత్త కాంట్రాక్టర్ వస్తారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం. మురికినీరు వదిలేస్తున్నారని గొడుగువారిగూడెం గ్రామస్తుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. - కే హనుమంతరావు, ఇన్చార్జి డెరైక్టర్ -
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
నూజివీడు : కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థి కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుంటూరుకు చెందిన శ్రీకాంత్ ప్రసన్న కుమార్ గా గుర్తించారు. కాగా అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. చదువులో ఒత్తిడి కారణంగానే శ్రీకాంత్ ప్రసన్న కుమార్ ఆత్మహత్యకు పాల్పడి వుంటాడని తోటి విద్యార్థులు భావిస్తున్నారు. కళాశాల యాజమాన్యం మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో నవీన్ అనే విద్యార్థి కూడా భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
ప్రాణం తీసిన పేస్ బుక్ పరిచయం
గుంటూరు : ఆ యువతీ యువకులిద్దరివీ వేర్వేరు ప్రాంతాలు. ఇంటర్నెట్లో ఫేస్బుక్ సైట్ ద్వారా ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. స్నేహం పెరగటంతో పెద్దలకు తెలియకుండా తిరగటం మొదలెట్టారు. ఈ సరదాయే.. చివరికి ఆ యువతి ప్రాణాలను బైక్ ప్రమాద రూపంలో బలిగొంది. కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నగరానికి చెందిన ధీరజ్ సింగ్ కు చిలకలూరిపేటకు చెందిన విద్యార్థినితో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంటర్ చదువుతున్న ఆ విద్యార్థిని సోమవారం ఇంటి వద్ద నుంచి బయలుదేరి ధీరజ్‌తో కలిసి బైక్‌పై నూజివీడు వెళ్లింది. రాత్రి కావడంతో హాస్టల్లోకి అనుమతించకపోవడంతో ఇద్దరూ కలిసి బైక్‌పై గుంటూరు తిరిగి వస్తున్నారు. తెల్లవారుజామున చినకాకాని వద్దకు వచ్చేసరికి విద్యార్థిని కప్పుకున్న బెడ్‌షీట్ చక్రంలో ఇరుక్కుపోవటంతో బైక్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో విద్యార్థినికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా ధీరజ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు విద్యార్థిని తల్లిదండ్రుల మాత్రం తన కుమార్తెను ధీరజ్ చంపేశాడని ఆరోపిస్తున్నారు.