సాక్షి, కృష్ణా: నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. లేడీస్ హాస్టల్లో పట్టుబడిన యువకుడు కూడా ట్రిపుల్ ఐటీ విద్యార్థేనని తెలిసింది. విద్యార్థినిల సహకారంతో అతడు వసతి గృహంలోకి చేరినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈనేపథ్యంలో ఆరుగురు విద్యార్థినిలను వర్సిటీ యాజమాన్యం సస్పెండ్ చేసినట్టు తొలుత వార్తలు వచ్చాయి.
అయితే, ఎవరినీ సస్పెండ్ చేయలేదని సమాచారం. విద్యార్థినిలకు కేవలం కౌన్సెలింగ్ మాత్రమే ఇచ్చి పంపించివేశారని, యువకుడికి కూడా కౌన్సెలింగ్‌తో సరిపెట్టారని తెలిసింది. దీంతో యాజమాన్యం తీరుపై విమర్శలు వస్తున్నాయి. లేడీస్ హాస్టల్లో రోజంతా గడిపిన ఓ యువకుడిపై చర్యలు లేకపోవడం గమనార్హం. ఇక సెక్యురిటీ సిబ్బంది, కేర్ టేకర్లపై చర్యలు శూన్యమనే చెప్పాలి!
(చదవండి : లేడీస్ హాస్టల్లో యువకుడు.. ఆరుగురి సస్పెన్షన్!)
మంత్రి ఆగ్రహం..
తీవ్ర విమర్శల నేపథ్యంలో మొత్తం వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీకి నివేదించేందుకు వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం క్రమశిక్షణా కమిటీ విద్యార్థులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ట్రిపుల్ ఐటీ కీలక అధికారులు సెలవులో ఉన్నట్టు తెలిసింది. కాగా, ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సీరియస్ అయ్యారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వర్సిటీలో సెక్యురిటీ లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment