
గుడివాడ : సంచలనం సృష్టించిన గుడివాడ రాజేం ద్ర నగర్ జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. దొంగతనం కోసం వచ్చిన జిల్లేల సురేష్ ఒక్కడే ఈ హత్యలకు పాల్పడ్డాడని గుడివాడ డిఎస్పీ మహేష్ తెలి పారు. కేసును ఏవిధంగా ఛేదించారో విలేకరులకు వివరించారు. నర్సాపురానికి చెందిన జిల్లేల సురేష్ నేర చరిత్ర నచ్చని తండ్రి అక్కడి నుంచి తరిమివేయడంతో గుడివాడలోని ధనియాలపేటలో స్థిరపడ్డారు. అయితే సురేష్ తల్లి ఈ కుటుంబాన్ని వదిలేసి దుబాయ్ వెళ్లిపోయింది. రెండున్నరేళ్ల క్రితం చెన్నైలోని పెరంబదూర్‌లో మెకానిక్‌గా పనిశాడు. సురేష్‌కు కొద్దికాలం క్రితం వాణీప్రియతో పరిచయం ఏర్పడగా ఈమె కారణంగా సురేష్ భార్య జనవరిలోనే వదిలి వెళ్లిపోయింది. వాణీప్రియ కోసం సురేష్ అప్పుల పాలై దొంగతనాలకు తెరతీశాడు.
ఈనెల 8 నుంచి చోరీలకు విఫలయత్నం
పెరంబదూర్‌లో ఉండే సురేష్ ఈనెల 8 నుంచి పలుమార్లు గుడివాడకు వచ్చి రాజేంద్రనగర్‌లో చోరీ చేసేందుకు రెక్కీ నిర్వహించి దొంగతనాలకు ప్రయత్నించాడు. 9న రాజేంద్ర నగర్‌లోని గొల్లపూడి రాజేశ్వరరావు ఇంట్లో, 9న కామినేని బాబూరాజేంద్ర ప్రసాద్ ఇంట్లో, 12న చెన్న కొండలరావు ఇంట్లో, 13న తోట ఆకాష్ ఇంట్లో దొంగతనాలకు యత్నించాడు. తోట ఆకాష్ ఇంట్లో బైక్‌ను దొంగతనం చేసి రైల్వేస్టేషన్‌లో విడిచిపెట్టి వెళ్లాడు. 13న హత్యకు గురైన బొప్పన సాయి చౌదరి ఇంట్లో వెనుక కిటికీ స్క్రూలు తిప్పే ప్రయత్నం చేసి విఫలమై వెళ్లిపోయాడు.
హత్యలు ఇలా..
ఈనెల 15న పెరంబదూర్ నుంచి చెన్నైకి వచ్చి అక్కడి నుంచి విజయవాడకు చేరుకున్నాడు. అనంతరం గుడివాడ బస్టాండ్‌కు చేరుకున్నాడు. 16న రాత్రి 12 గంటల వరకు గుడివాడలోని ఓబార్‌లో కాలం గడిపాడు. అనంతరం సాయి చౌదరి ఇంటి కిటికీని మినీ గ్యాస్‌కట్టర్‌తో కట్ చేశాడు. రాత్రి 3.30 గంటలకు సాయి చౌదరి బెడ్‌రూం డోర్ తీయగా సాయి చౌదరి బయటకు వచ్చి నిందితుడు సురేష్‌తో పెనుగులాటకు దిగాడు. సురేష్ తెచ్చుకున్న కత్తితో మూడుసార్లు పొడవటంతో సాయిచౌదరి మృతిచెందాడు. అనంతరం సాయిచౌదరి భార్యను కత్తితో పొడిచి చంపాడు. ఇద్దరి మృతదేహాలను వేరే రూంలోకి లాక్కెళ్లాడు. అనంతరం బంగారం, నగదు, టీవీ, ఇతర వస్తువులతో పాటు కారును వేసుకుని బేతవోలు మీదుగా విజయవాడ రోడ్డులో వెళ్లాడు. పెనుగులాటలో సురేష్ చొక్కా రక్తం కావటంతో సాయి చౌదరి చొక్కాను వేసుకుని వెళ్లాడు. ఇతను ఉపయోగించిన పనిముట్లు, రక్తం అయిన సురేష్ చొక్కాను మానికొండ శివార్లలో వదిలేశాడు. అక్కడి నుంచి విజయవాడ, మార్టూరు, టంగుటూరు మీదుగా 17న 4గంటలకు పెరంబదూర్ వెళ్లాడు.
పట్టించిన వేలిముద్రలు..
ఇంటి కిటికీని కట్ చేసే సమయంలో సురేష్ వేలిముద్రలు స్పష్టంగా పడ్డాయి. గ్లౌజులు తెచ్చుకున్నా కంగారులో వాడలేదని తెలిసింది. దీంతో వేలిముద్రలు దొరికాయి. సీసీ కెమేరా పుటేజీ, కారు టోల్‌గేట్లు దాటి వెళ్లడం వంటి వాటి ద్వారా 17నే పట్టుకున్నారు.
పోలీసులకు చుక్కలు చూపించాడు...
హత్య జరిగిన తీరు. ఎవరో చేయించి ఉంటారని పుకార్లు హల్‌చల్ చేయడంతో పోలీసు బృందాలు పెద్దఎత్తునే విచారణకు దిగాయి. సురేష్‌ను విచారణకు తీసుకురాగా నలుగురు పేర్లు చెప్పాడు. మొదట సురేష్ తమ్ముడు స్నేహితుడు త్రినాథ్ పేరు చెప్పాడు. త్రినాథ్ పెయింటింగ్ పనిచేసుకుంటాడు. తీరా పోలీసు విచారణలో త్రినాథ్ పాత్రలేదని తేలింది. అలాగే సురేష్ తమ్ముడు రాజీవ్ కిషోర్ పేరు చెప్పాడు . ఇతను కడప జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. సీసీ పుటేజ్ ఆధారంగా లేడని తేల్చారు. సురేష్ తండ్రి విజయ్‌కుమార్ పేరు చెప్పాడు. ఇతని ప్రమేయం కూడా లేదని తేలింది. అయితే సురేష్‌తో పాటు పనిచేసే పెరంబదూర్‌కు చెందిన శివదొరై పేరు చెప్పాడు. శివ సురేష్‌కు కిటికీ ఎలా కట్‌చేయాలి హ్యాండ్ కట్టర్ కొనటానికి, తెచ్చిన బంగారం అమ్మటానికి సాయపడే ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే హత్యసీన్‌లో లేడు. దీనికి సంబంధించిన అన్ని సీసీ కెమేరా పుటేజ్‌లను చూపించారు. వాటి ఆధారంగానే ఒక్కడే ఇది చేశాడని తేల్చారు. విలేకరుల సమావేశంలో వన్‌టౌన్ సీఐ డీవీ రమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment