
'కాళ్లు పట్టుకుని మరీ టీడీపీలో చేర్చుకుంటున్నారు'
కాంగ్రెస్ కార్యకర్తలలో ఉత్సాహం నింపేందుకే బస్సు యాత్ర చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ కార్యకర్తలలో ఉత్సాహం నింపేందుకే బస్సు యాత్ర చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకులు చేపట్టిన బస్సు యాత్ర శనివారం విశాఖపట్నం చేరుకుంది. ఈ సందర్బంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ...తాము చేపట్టిన బస్సు యాత్ర ముగిసేలోపు కాంగ్రెస్ పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. తమ బస్సు యాత్ర వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ భారీ సంఖ్యలో సీట్లను కైవసం చేసుకుంటుందని తెలిపారు.
రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగిందన్న భావన సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చాయని, అయితే కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. విభజనతో పార్టీ నుంచి బయటకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను కాళ్లు పట్టుకుని మరీ పచ్చ పార్టీ చేర్చుకుంటుందని టీడీపీపై రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు.