‘మాఫీ’పై చంద్రబాబు మోసం చేశారు: నాగిరెడ్డి
* రైతులెవరూ రుణాలు కట్టవద్దని ఎన్నికల సభల్లో ఊదరగొట్టారు
* ఆయన మాటలు నమ్మినవారు పంటబీమా కూడా కోల్పోయారు
* వ్యవసాయ, పంట రుణాలకు తేడా తెలీకుంటే క్షమాపణలు చెప్పాలి
* వైఎస్సార్‌సీపీ రైతు విభాగం నేత నాగిరెడ్డి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు రైతులను మోసం చేశారని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తూ రైతుల వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారని, ఇపుడు పంట రుణాలు మాత్రమేనని మాటమార్చారని దుయ్యబట్టారు. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న స్వల్ప, దీర్ఘ కాలిక, ప్రాసెసింగ్ యూనిట్ తాలూకు తీసుకున్నవన్నీ వ్యవసాయరుణాలేనని ఆయన వివరించారు. తొమ్మిదేళ్లు సీఎంగా, ప్రపంచానికే పాఠాలు చెప్పానని చెప్పుకుంటున్న వ్యక్తికి వ్యవసాయరుణాలు, పంట రుణాలకు తేడా తెలియదా? నిజంగా తెలియకపోతే తనకు తెలియకుండానే వాగ్దానం చేశానని రాష్ట్ర రైతులకు తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు ఎవరికీ మోసం చేసే వ్యక్తిత్వం కల వారు కాదని, అలాంటి వారిని బాబు మోసం చేయడం మంచిది కాదని హితవు చెప్పారు. డ్వాక్రా మహిళల, చేనేత కార్మికుల రుణాలను కూడా మాఫీ చేస్తానని చెప్పి మాట తప్పారన్నారు. రాష్ట్ర విభజనకు ముందే మొత్తం మీద రూ.1.27 లక్షల కోట్ల రుణాలుంటే ఎలా మాఫీ చేస్తారని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నిస్తే... తాను ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నానని, ఎలా చేయాలో తెలుసునని బాబు బుకాయించారని గుర్తుచేశారు.
మీ రిచ్చిన హామీని ఎలా నెరవేరుస్తారని కేంద్ర ఎన్నికల కమిషన్ టీడీపీకి నోటీసులిస్తే... పూర్తి అవగాహనతోనే ఇచ్చామని, తప్పకుండా మాఫీ చే స్తా నని వారికి బాబు సమాధానం ఇచ్చారని చెప్పారు. రైతులెవరూ రుణాలు కట్టొద్దని, తాకట్టుపెట్టిన బంగారం, బ్యాంకుల్లోని దస్తావేజులు ఇంటికి వస్తాయని ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన ఊదరగొట్టారని గుర్తుచేశారు. ఆమాటలు నమ్మి రుణాలు కట్టని రైతులపై ఇపుడు అదనంగా వడ్డీభారం పడిందన్నారు., పంటల బీమా కూడా కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. హుద్‌హుద్ తుపానులో దారుణంగా పంటలు నష్టపోయిన రైతులకు కూడా బీమా రాన్నారు. రైతులను మానసిక సంఘర్షణకు గురి చేస్తూ విశ్వసనీయత లేని నాయకుడనిపించుకున్నారని నాగిరెడ్డి విమర్శించారు.
పొలాలే లేని సింగపూర్‌లాగా చేస్తారా!
రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రాంతంలో చంద్రబాబు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ 365 రోజులూ పంటలు పండే భూములను రైతుల నుంచి లాక్కోవాలని చూస్తున్నారని నాగిరెడ్డి విమర్శించారు. ‘‘మాట మాట్లాడితే బాబు సింగపూర్ చేస్తానంటున్నారు. సింగపూర్‌లో పొలాలే లేవు, మంచినీళ్లకు కూడా మలేసియా నుంచి వెళ్లాల్సిందే.. అక్కంతా వ్యాపారమే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పొలాలు లేకుండా చేయాలనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, రైతుల నోళ్లు కొడితే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బాబు రైతు వ్యతిరేకిగా మారారని చెప్పారు.