శోభమ్మ జ్ఞాపకాలతో...
అన్నదానం, రక్తదాన కార్యక్రమాలు
* త్వరలో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు : భూమా నాగిరెడ్డి
సాక్షి ప్రతినిధి, కర్నూలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దివంగత శోభా నాగిరెడ్డి (46) జయంతిని ఈనెల 16వ తేదీన నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నట్టు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తెలిపారు. శోభా నాగిరెడ్డి మరణించిన తర్వాత వచ్చిన మొదటి జయంతి కావడంతో ఆమె జ్ఞాపకార్థం ఆళ్లగడ్డ, నంద్యాలలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన వివరించారు.
ఆళ్లగడ్డలో 200 మందితో రక్తదాన శిబిరాన్ని మంగళవారం నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా అన్ని హాస్టళ్లలో అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నామని, హరిజనవాడ, మురికివాడలల్లో మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఇక నంద్యాలలోని బధిరుల పాఠశాలతో పాటు హాస్టళ్లలో అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ఆయన ‘సాక్షి’కి వివరించారు. గోశాలల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు.
స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు!
శోభా నాగిరెడ్డి పేరుతో ప్రత్యేకంగా స్పోర్ట్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్టు భూమా నాగిరెడ్డి తెలిపారు. ఈ అకాడమీ ద్వారా యువతకు.. ప్రత్యేకించి గ్రామీణ యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఆమె మరణించిన తర్వాత జయంతి నాటికే అనేక కార్యక్రమాలు నిర్వహించాలని భావించామని.. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇంకా ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తామని భూమా ప్రకటించారు.
నిరాడంబరంగా..
నంద్యాల టౌన్: నిరాడంబరంగా ఉండటమే శోభకు ఇష్టమని.. హంగూ ఆర్భాటాలకు ఆమె ఎప్పుడూ దూరమని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. మంగళవారం దివంగత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆయన తమ 28 ఏళ్ల అన్యోన్య దాంపత్య స్మృతులను సోమవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. పెళ్లయిన కొత్తలో ఆమె పుట్టిన రోజున కానుకలు ఇచ్చేవాడినని.. అందుకామె ఎన్నిచ్చినా నీ ప్రేమ, స్నేహం ముందు తక్కువనేవారన్నారు.
రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఆమె పుట్టిన రోజు తనకు ఎంతో ప్రత్యేకమన్నారు. రెండు మూడు సార్లు పుట్టిన రోజున కలువలేకపోయానన్నారు. అప్పట్లో ఎంపీగా తాను ఢిల్లీలో, ఎమ్మెల్యేగా ఆమె హైదరాబాద్‌లో.. పిల్లలు హాస్టల్‌లో.. ఇలాంటి కారణాలతో ఆ వేడుకలు చేసుకోలేని పరిస్థితి తలెత్తిందన్నారు. ప్రజల క్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నప్పుడు ఎడబాటు తప్పదని సర్దుకుపోయేవాళ్లమన్నారు. హైదరాబాద్‌లో అందరం కలిసినప్పుడు ఎంతో హాయిగా గడిపేవాళ్లమని గుర్తు చేసుకున్నారు.
శోభ ఎప్పుడూ ఆళ్లగడ్డ ప్రజల మధ్య ఉండటానికే అమితాసక్తి చూపేవారన్నారు. ఆమె పుట్టిన రోజు నాడు పెద్ద ఎత్తున తరలివచ్చే ప్రజలతో ఇల్లు సందడిగా మారిపోయేదన్నారు. తుది శ్వాస వరకు కూడా ఆమె ప్రజల కోసమే పరితపించారన్నారు. శోభ భౌతికంగా దూరమైనా.. ప్రజల ఆదరాభిమానాల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటుందన్నారు.
ఆమె లేకుండా పుట్టిన రోజు వేడుక జరుపుకోవాలంటే గుండె బరువెక్కుతోందన్నారు. ఆమె కలను సాకారం చేస్తూ.. నంద్యాల, ఆళ్లగడ్డను అభివృద్ధిలో ముందుంచుతామన్నారు. పార్టీ శ్రేణులు కూడా ఆమె ఆశయ సాధన దిశగా పని చేసినప్పుడే శోభ ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు.