నమ్మక ద్రోహం చంద్రబాబు నైజం
- త్వరలో ప్రజా పక్షాన పోరాటాలు
- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్
రావికమతం : పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలు, రైతులు, పేదలను నమ్మించి గొంతుకోయడం కొత్తేమీ కాదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. పార్టీ చోడవరం నియోజకవర్గ విస్తృతస్థాయీ కార్యకర్తల సమావేశం శనివారం సాయంత్రం రావికమతంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించి అనంతరం మాట్లాడారు. ఎలాగూ ఎన్నికల్లో ఓడిపోతామనే భావనతో చంద్రబాబు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి నేడు మాట తప్పుతున్నారని ఆరోపించారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలు చేశారా అని నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పార్టీలకు అతీతంగా పెన్షన్లు ఇస్తే వాటిని దొంగసాకులు చూసి చంద్రబాబు ప్రభుత్వం తొలగిస్తోందన్నారు. నిరుద్యోగులకు భృతి, రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, 24 గంటల కరెంటు ఏవని ప్రశ్నించారు. త్వరలో ప్రజా సమస్యలపై పోరుబాట పట్టనున్నట్టు చెప్పారు. వారం రోజుల్లో గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేయనున్నట్టు ప్రకటించారు.
నిత్యం అందుబాటులో ఉంటా : ధర్మశ్రీ
గత ఎన్నికల్లో లీడర్లున్నా సరైన క్యాడర్ లేకపోవడం వల్లే స్వల్ప ఓట్లతో ఓటమి చవిచూశామని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. ఇందుకు కారణం తాను చేసుకున్న పొరపాటు కూడా కారణమన్నారు. ఎన్నికల ముందు వరకూ తాను కాంగ్రెస్‌లో ఉన్నందున వైఎస్సార్ సీపీకి ఏ ఒక్కరినీ పోనివ్వకుండా అడ్డుకున్నానని, ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చినా క్యాడర్ మనస్సు గెలవలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అమర్‌నాథ్ ఆధ్వర్యంలో కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటానన్నారు.
అనంతరం అమర్‌నాథ్, ధర్మశ్రీలను పలు మండలాల నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. మండల పార్టీ కన్వీనర్ పందల దేవా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ ముక్కా మహాలక్ష్మినాయుడు, డీసీసీబీ డెరైక్టర్ గుమ్ముడు సత్యదేవ, నాయకులు ఆశరి గోవిందరావు, పతివాడ చిన్నంనాయుడు, నాగేశ్వరరావు, ఎం.శంకర్రావు, బొడ్డేడ సూర్యనారాయణ, కొవ్వూరు బాబులు, పోతల శ్రీను, బోళెం నర్సింహమూర్తి, కర్రి తమ్మునాయుడు, కోవెల జనార్దన్, ఆ పార్టీ నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.