హసన్‌పర్తి/హన్మకొండ సిటీ,
ఏదైనా పదవికి పోటీ చేయాలంటే కనీస కోరం అవసరం... అలాంటి కోరం ఇక్కడ అవసరమే లేదు. రిజర్వేషన్ అయితే చాలు... ఎన్నిక ఏకగ్రీవమే. ఓపెన్ అయితే కొంత ఇబ్బంది అరుునప్పటికీ ఎన్నిక లాంఛనమే. ఇదీ... నాలుగు గ్రామాలున్న హన్మకొండ మండల ప్రత్యేకత. వరంగల్ నగర పాలక సంస్థలో గ్రామాల విలీనం నేపథ్యంలో ఈ మండలం అందరి నోళ్లలో నానగా... తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైన తరుణంలో మరోసారి తెరపైకి వచ్చింది.
గతంలో హన్మకొండ మండల అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ ఉండేది. 23 గ్రామాలకు 23 ఎంపీటీసీ సభ్యులు, ఒక జెడ్పీటీసీ సభ్యుడు ఉండేవారు. హన్మకొండ మండలం నగరానికి చుట్టుపక్కల విస్తరించి ఉండడం... మండల పరిషత్ కార్యాలయం నగర నడి బొడ్డున ఉండడంతో ఎంపీపీ పదవి కోసం కుస్తీ పడేవారు. కానీ... హన్మకొండ మండల పరిధిలోని 19 గ్రామాలు ఏడాది క్రితం గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌లో విలీనమైన నేపథ్యంలో అక్కడి పరిస్థితి తారుమారైంది.
ఆ మండలంలో మిగిలినవి నాలుగు గ్రామాలు మాత్రమే. ప్రస్తుతం హన్మకొండ మండలంలోని కొండపర్తి, ముల్కలగూడెం, నర్సింహులగూడెం, వనమాల కనపర్తి గ్రామాలకు రెండు ఎంపీటీసీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. గురువారం ప్రకటించిన రిజర్వేషన్ ప్రకారం కొండపర్తి ఎంపీటీసీ బీసీ మహిళకు రిజర్వ్ కాగా, వనమాల కనపర్తి (నర్సింహులగూడెం, ముల్కలగూడెం) ఎంపీటీసీ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు. ఇందులో ఎవరు గెలిచినా... చివరకు మండల పరిషత్ అధ్యక్షురాలిగా మహిళ ఎన్నిక కావడం లాంఛనమే.
రిజర్వేషన్ అయితే ఏకగ్రీవమే...
హన్మకొండ మండల ఎంపీపీ పీఠం రిజర్వేషన్ అయితే ఏకగ్రీవమే. బీసీ కేటగిరిలో రిజర్వేషన్ చేస్తే కొండపర్తి నుంచి ఎన్నికయ్యే అభ్యర్థి ఎంపీపీ పీఠం అధిరోహిస్తారు. ఒకవేళ ఎస్సీ రిజర్వేషన్ అయితే వనమాల కనపర్తి నుంచి ఎన్నికయ్యే అభ్యర్థి ఎంపీపీగా బాధ్యతల స్వీకరిస్తారు. ఓపెన్ కేటగిరి అరుుతే... ఇద్దరి మధ్య పోటీ తప్పదు.
జెడ్పీటీసీ మహిళే...
హన్మకొండ మండలంలోని నాలుగు గ్రామాల్లో సుమారు ఎనిమిది వేల జనాభా ఉంది. ఈ లెక్కన సుమారు ఆరు వేల ఓటుండగా... ఒక జెడ్పీటీసీ స్థానాన్ని కేటాయించారు. రెండు ఎంపీటీసీ స్థానాలు మహిళలకే రిజర్వ్ కాగా... జెడ్పీటీసీ స్థానం కూడా బీసీ మహిళకే రిజర్వ్ కావడం విశేషం.