ప్రమాదం వెనక కుట్ర ఉందనుకోవటం లేదు
అనంతపురం : నాందేడ్ ఎక్స్ప్రెస్ ప్రమాదం వెనక కుట్ర ఉందనుకోవటం లేదని రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. రైలు ప్రమాదం జరగటం బాధాకరమన్నారు. ఈ దుర్ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించినట్లు కోట్ల తెలిపారు. అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు అయిదు లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి లక్ష, స్వల్పంగా గాయపడినవారికి యాభైవేలు ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు.
ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తామని కోట్ల తెలిపారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ఆయన అన్నారు. పదిరోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు కోట్ల పేర్కొన్నారు. మరోవైపు... సాంకేతిక సమస్యలే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఏసీ బోగీలో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. ఫోరెన్సిక్ సిబ్బంది పరీక్షల తర్వాత గానీ అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశముంది.