నంద్యాల ఉప ఎన్నికపై కొనసాగుతున్న వివాదం
అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్ధిత్వంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. నంద్యాల ఉప ఎన్నికలో తాను నూటికి నూరుపాళ్లు పోటీ చేసి తీరతానని శిల్పా మోహన్‌రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి స్పష్టం చేశారు. కొద్దిరోజుల క్రితమే శిల్పా సోదరులు సీఎంను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. తన వర్గాన్ని కాపాడుకోవడానికి, తన ఉనికిని నిలబెట్టుకోవడానికి పోటీ చేయక తప్పదని స్పష్టం చేశారు. మరోవైపు మంత్రి అఖిలప్రియ కూడా తమ అనుచరులకే సీటు ఇవ్వాలని పట్టుపడుతున్నారు.
దీంతో ఇరువురి మధ్య విభేదాల నేపథ్యంలో ఏకాభిప్రాయం కోసం చంద్రబాబు పాట్లు పడుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి కళా వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి అఖిలప్రియ, మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరై నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై చర్చించారు. నంద్యాల ఉప ఎన్నికపై నేతలతో కళా వెంకట్రావు విడివిడిగా భేటీ అవుతున్నారు. అలాగే ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్రెడ్డి కూడా వెంకటరావుతో మాట్లాడారు. కళా వెంకట్రావుతో చర్చల అనంతరం వీరంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవనున్నట్లు సమాచారం.