పారదర్శకంగా కౌంటింగ్
♦ పొరపాట్లకు తావివ్వొద్దు
♦అప్రమత్తతతో వ్యవహరించండి
♦అధికారులు, సిబ్బందికి కలెక్టర్ సూచన
కర్నూలు (అగ్రికల్చర్): నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి పొరపాట్లకూ తావివ్వరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కౌంటింగ్ అధికారులు, అసిస్టెంట్లు, సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ఈ నెల 28న ఉదయం ఎనిమిది గంటలకు నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మొదలవుతుందన్నారు. సిబ్బంది ఆదివారం రాత్రికే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేస్తామన్నారు. కౌంటింగ్‌లో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. మొత్తం 15 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ఒక టేబుల్ రిటర్నింగ్ అధికారికి ఉంటుందని తెలిపారు.
ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు వినియోగిస్తున్నామన్నారు. ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ ఆఫీసర్, కౌంటింగ్ అసిస్టెంట్, సూక్ష్మ పరిశీలకుడు ఉంటారని తెలిపారు. రిజర్వుతో సహా 20 మంది కౌంటింగ్ అధికారులు, 20 మంది కౌంటింగ్ అసిసెంట్లను ఓట్ల లెక్కింపునకు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందన్నారు. బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ అవసరం ఉండవని, కంట్రోల్ యూనిట్‌ను మాత్రమే కౌంటింగ్‌కు ఉపయోగిస్తామని వివరించారు. రిజల్ట్ బటన్ నొక్కితే సీరియల్ నంబర్ల వారీగా ఎవరికెన్ని ఓట్లు వచ్చాయనే వివరాలు డిస్‌ప్లే అవుతాయన్నారు. వాటిని రాసుకోవడం, లెక్కించడంలో పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు.
కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా జరుగుతోందా, లేదా అనే విషయాలను సూక్ష్మ పరిశీలకులు గమనిస్తుంటారన్నారు. మొదట రిటర్నింగ్ అధికారి టేబుల్‌పై పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారని, ఇది అరగంటలో పూర్తవుతుందని తెలిపారు. ఆ తర్వాత కంటోల్ యూనిట్లలో నమోదయిన ఓట్లను లెక్కిస్తారని వివరించారు. కౌంటింగ్ సిబ్బందిని సిస్టమ్ ద్వారా టేబుళ్లకు ర్యాండమైజేషన్ పద్ధతిలో కేటాయిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, కర్నూలు, ఆదోని ఆర్డీఓలు హుసేన్‌సాహెబ్, ఓబులేసు, సీపీఓ ఆనంద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయండి : భన్వర్‌లాల్
నూనెపల్లె: నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఆర్‌డీఓ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపినాథ్ జట్టి, రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ హాజరయ్యారు. భన్వర్‌లాల్ మాట్లాడుతూ కౌంటింగ్ రోజున పోలీసులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అనుమతి పత్రాలు ఉన్న వారినే లోపలికి పంపాలన్నారు. కౌంటింగ్ హాల్ వద్ద భద్రత పెంచాలని ఎస్పీని ఆదేశించారు. కౌంటింగ్ వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు.
కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
నూనెపల్లి: ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపినాథ్ జట్టి, రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ శనివారం నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పరిశీలించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రెండింతల భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రజలు కౌంటింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఉండేలా చూస్తామన్నారు. కేంద్రం వద్ద ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే అరెస్టు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్ సుందర్ రెడ్డి, ఏఆర్‌ఓ జయరాంరెడ్డి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.