బాధితురాలు రాజేశ్వరిని పరామర్శిస్తున్న నన్నపనేని రాజకుమారి
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణం): భర్త, అత్త చేతిలో దాడికి గురై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రాజేశ్వరిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. గురువారం కేజీహెచ్‌కు వచ్చిన ఆమె రాజేశ్వరితో పాటు వివిధ కేసుల్లో చికిత్స పొందుతున్న పలువురు మహిళలను పరామర్శించారు. (అయ్యయ్యో.. ఎంత కష్టం!)
ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ ఈ లోకంలో మహిళగా పుట్టడమే నేరమా అని ప్రశ్నించారు. ఆస్పత్రిలో ఉన్న మూడు కేసులను చూసేందుకు వస్తే అవి ఐదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి విజయనగరంలో జరగగా, మిగిలినవి విశాఖపట్నంలో జరిగాయని చెప్పారు. నిండు గర్భిణిగా ఉన్న రాజేశ్వరిని శారీరకంగా, మానసికంగా హింసించిన ఆమె భర్త దామోదర్, అత్త లలితను కఠినంగా శిక్షించినప్పుడే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు.
జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త ఆమెపై భౌతికదాడికి దిగగా, ఆమె అత్తకూడా అదే మార్గంలో నడవడం దుర్మార్గమన్నారు. ఇటువంటి మానవ మృగాలకు సమాజంలో తిరిగే హక్కులేదని, తక్షణమే న్యాయవిచారణ జరిపి త్వరగా శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. నిందితులకు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, న్యాయవాదులు ఎటువంటి సహకారం అందించవద్దని విజ్ఞప్తి చేశారు. రాజేశ్వరి కోలుకున్న తర్వాత ఆమెకు ఉపాధి కల్పించడంతో పాటు పుట్టిన బిడ్డను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు శ్రీవాణి, మణికుమారి, మహిళా సంక్షేమ శాఖ అధికారులు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment