
బాధిత బాలిక ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్న నన్నపనేని
ఒంగోలు టౌన్: ఆడ పిల్లలు బయటకు వెళ్లాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అత్యాచారాలు జరుగుతుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. అత్యాచారానికి గురై స్థానిక రిమ్స్‌లో చికిత్స పొందుతున్న దోర్నాల మండలం తుమ్మలబైలు గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక, ప్రేమ పేరుతో మోసగించబడి అత్యాచారానికి గురై చికిత్స పొందుతున్న మార్టూరు మండలం వలపర్ల గ్రామానికి చెందిన పదిహేడేళ్ల బాలికను శుక్రవారం ఆమె పరామర్శించారు. నేరుగా బాధితులతో మాట్లాడే సమయంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈరోజు దురదృష్టకరమైన రోజని చెప్పక తప్పదన్నారు. మైనర్ బాలికలపై ఇలాంటి అత్యాచారాలు జరగడం మానసిక ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలపై ప్రభుత్వం, మహిళా శిశుసంక్షేమశాఖ, మీడియా కలిసి ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.
కన్నతండ్రే కాలయముడిగా ఉంటే ఎవరికి చెప్పుకోవాలి?
కన్నతండ్రే కసాయిగా మారి కాలయములుగా ఉంటే ఆ ఆడపిల్లలు ఇంక ఎవరికి చెప్పుకోవాలని నన్నపనేని రాజకుమారి ప్రశ్నించారు. ఇటీవల కాలంలో ఆడపిల్లలపై తండ్రులు, బాబాయిలు, తాతయ్యలతో పాటు ఇరుగు పొరుగువారు ఎక్కువగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు అవుతుండటంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు నిరోధించేందుకు నిర్భయ చట్టం తీసుకొచ్చినా ఘటనలు జరుగుతుండటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారాలు జరగకూడదని, ప్రజలను చైతన్యపరచాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జిల్లాల వారీగా ర్యాలీలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
సఖీ ఒన్‌స్టాప్ సెంటర్ పరిశీలన
రిమ్స్ ఆవరణలో ఉన్న సఖీ ఒన్‌స్టాప్ సెంటర్‌ను మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పరిశీలించారు. ఆ సెంటర్‌లో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఇప్పటి వరకు ఎన్ని కేసులు వచ్చాయి, వాటి స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. సెంటర్‌లో మహిళల రక్షణతో పాటు న్యాయం అందే విషయమై ముద్రించిన వాల్‌పోస్టర్లను ఆమె పరిశీలించారు. నన్నపనేని రాజకుమారి వెంట మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, రిమ్స్ డైరెక్టర్ మస్తాన్‌సాహెబ్, మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ టీవీ శ్రీనివాస్, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ పి.సరోజిని, ఏపీడీ జి.విశాలాక్షి, ఐసీపీఎస్ డీసీపీఓ ఎన్. జ్యోతిసుప్రియ, సళీ ఒన్‌స్టాప్ సెంటర్ లీగల్ కౌన్సిలర్ సిరిగిరి సరళ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment