Nannapaneni Raja Kumari
-
చిన్నారులు బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉంది
ఒంగోలు టౌన్: ఆడ పిల్లలు బయటకు వెళ్లాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అత్యాచారాలు జరుగుతుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. అత్యాచారానికి గురై స్థానిక రిమ్స్‌లో చికిత్స పొందుతున్న దోర్నాల మండలం తుమ్మలబైలు గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక, ప్రేమ పేరుతో మోసగించబడి అత్యాచారానికి గురై చికిత్స పొందుతున్న మార్టూరు మండలం వలపర్ల గ్రామానికి చెందిన పదిహేడేళ్ల బాలికను శుక్రవారం ఆమె పరామర్శించారు. నేరుగా బాధితులతో మాట్లాడే సమయంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈరోజు దురదృష్టకరమైన రోజని చెప్పక తప్పదన్నారు. మైనర్ బాలికలపై ఇలాంటి అత్యాచారాలు జరగడం మానసిక ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలపై ప్రభుత్వం, మహిళా శిశుసంక్షేమశాఖ, మీడియా కలిసి ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. కన్నతండ్రే కాలయముడిగా ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? కన్నతండ్రే కసాయిగా మారి కాలయములుగా ఉంటే ఆ ఆడపిల్లలు ఇంక ఎవరికి చెప్పుకోవాలని నన్నపనేని రాజకుమారి ప్రశ్నించారు. ఇటీవల కాలంలో ఆడపిల్లలపై తండ్రులు, బాబాయిలు, తాతయ్యలతో పాటు ఇరుగు పొరుగువారు ఎక్కువగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు అవుతుండటంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు నిరోధించేందుకు నిర్భయ చట్టం తీసుకొచ్చినా ఘటనలు జరుగుతుండటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారాలు జరగకూడదని, ప్రజలను చైతన్యపరచాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జిల్లాల వారీగా ర్యాలీలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. సఖీ ఒన్‌స్టాప్ సెంటర్ పరిశీలన రిమ్స్ ఆవరణలో ఉన్న సఖీ ఒన్‌స్టాప్ సెంటర్‌ను మహిళా కమిషన్ చైర్పర్సన్ పరిశీలించారు. ఆ సెంటర్లో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఇప్పటి వరకు ఎన్ని కేసులు వచ్చాయి, వాటి స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. సెంటర్లో మహిళల రక్షణతో పాటు న్యాయం అందే విషయమై ముద్రించిన వాల్‌పోస్టర్లను ఆమె పరిశీలించారు. నన్నపనేని రాజకుమారి వెంట మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, రిమ్స్ డైరెక్టర్ మస్తాన్‌సాహెబ్, మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ టీవీ శ్రీనివాస్, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ పి.సరోజిని, ఏపీడీ జి.విశాలాక్షి, ఐసీపీఎస్ డీసీపీఓ ఎన్. జ్యోతిసుప్రియ, సళీ ఒన్‌స్టాప్ సెంటర్ లీగల్ కౌన్సిలర్ సిరిగిరి సరళ ఉన్నారు. -
మా కాపురం నిలబెట్టండి...
గుంటూరు, తాడేపల్లి రూరల్: ఒకే గ్రామానికి చెందిన వారిరువురూ ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. అయితే మూడేళ్ల తర్వాత తన అత్త పోలీసు కేసు పెట్టి తన భర్త నుంచి తనను వేరు చేయాలని చూస్తోందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. టీడీపీ నాయకురాలైన తన అత్త తమ జోలికి రాకుండా చూడాలని సీఎంకు విన్నవించుకునేందుకు చంటిబిడ్డతో సహా సీఎం ఇంటివద్దకు వచ్చి పడిగాపులు కాసింది. ఆమె గోడు వినే వారు ఎవరూ లేక తిరుగుముఖం పట్టింది. బాధితురాలైన పిల్లి మేరీ తెలిపిన వివరాల ప్రకారం పెదకాకాని మండలం ఉప్పలపాడుకు చెందిన పిల్లి కోటయ్య, మేరీ మూడు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం కోటయ్య కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో మూడేళ్ల పాటు గుంటూరు చుట్టుగుంటలో నివాసం ఉన్నారు. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. మూడు సంవత్సరాల అనంతరం గ్రామంలో టీడీపీ తరఫున వార్డు మెంబరు అయిన అత్త పిల్లి లీల పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు మేరిని, కోటయ్యను పిలిచి విచారించారు. తామిద్దరం ప్రేమించి, పెళ్లిచేసుకున్నామని చెప్పడంతో పోలీసులు కేసును మూసివేశారు. అయితే అత్త లీల అక్కడితో ఆగకుండా తన భర్తనుంచి తనను విడదీసేందుకు ప్రయత్నిస్తోందని, టీడీపీ నాయకురాలైన తన అత్త లీలకు నచ్చజెప్పి తన కాపురాన్ని నిలబెట్టాలని కోరేందుకు బుధవారం ఆమె సీఎం నివాసం వద్దకు వచ్చింది. ఆమె గోడు అక్కడ ఎవరూ పట్టించుకోలేదు.చివరకు సీఎం భద్రతా సిబ్బంది కలుగజేసుకుని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి నంబర్ ఇచ్చి ఆమెను కలవాలంటూ సూచించి, అక్కడినుంచి పంపించివేశారు. -
మీకు సోము వీర్రాజే సరిపోతాడు...
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ లాబీలో సోమవారం మంత్రి కళా వెంకట్రావు, మాజీ మంత్రి మాణిక్యాలరావు, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మధ్య సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పైడికొండల మాణిక్యాలరావు పేరు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి...అడ్వాన్స్ కంగ్రాట్స్ అంటూ మాణిక్యాలరావును అభినందించారు. అయితే తాను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కావడం లేదని, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అవుతారని, ఆయన పేరు ప్రతిపాదించినట్లు చెప్పారు. అందుకు ప్రతిగా నన్నపనేని మాట్లాడుతూ.. మీరే అధ్యక్షుడని అందరు అనుకుంటున్నారని అనగా, మీకు సోము వీర్రాజే సరిపోతాడంటూ మాణిక్యాలరావు నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరోవైపు మంత్రి కళా వెంకట్రావు కూడా మాణిక్యాలరావును చూసి..కొత్త శత్రువులకు నమస్కారం అంటూ నవ్వుతూ పలకరించారు. మోదీ మహిళలను బాధ పెడుతున్నారు.. ఇక ఏపీకి ప్రత్యేక హోదాపై నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ..‘ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీలోని రెండున్నర కోట్ల మంది మహిళలను పెడుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు ఇస్తే మోదీకి నోటీసులు పంపుతాను. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ బాగా బాధ పడుతున్నారు. మోదీ, బీజేపీ అధినాయకత్వం లోక్‌సభ స్పీకర్‌ను తెగ ఇబ్బంది పెడుతున్నారు. ఇన్ని అవమానాలు భరించడం దేనికంటూ సుమిత్రా మహాజన్‌కు లేఖ రాస్తాను.’ అని అన్నారు. -
25 శాతం భార్యాబాధిత కేసులే
ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని వెల్లడి సాక్షి, అమరావతి: మహిళా కమిషన్‌కు అందుతున్న కేసుల్లో 25 శాతం మహిళా బాధితులైన పురుషుల నుంచి వస్తున్నవేనని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. భార్యలు కొడుతున్నారంటూ సాక్ష్యాలుగా వీడియోలు కూడా చూపిస్తున్నారని చెప్పారు. బుధవారం తాత్కాలిక అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతుండగా నన్నపనేని అటువైపుగా వెళ్తూ ఆగారు. ఆమెను చూసిన సోమిరెడ్డి.. మహిళా కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. మగవాళ్లు తమను చూస్తున్నారంటూ ఎవరైనా మహిళ ఫిర్యాదు చేయగానే కేసులు పెట్టేయడం ఎంతవరకు సబబని ఆయన నవ్వుతూ అడిగారు. ఈ విషయంలో పురుషుల పట్ల మహిళా కమిషన్ దయ చూపించాలన్నారు. దీంతో నన్నపనేని స్పందిస్తూ.. చూస్తేనే కేసులు పెడుతున్నారనడం సరికాదని, అసభ్యంగా చూస్తేనో, ప్రవర్తిస్తేనో మాత్రమే కేసులుంటాయని జవాబిచ్చారు. -
నన్నపనేని కారు ఢీ : వ్యక్తికి తీవ్ర గాయాలు
-
ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నన్నపనేని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారిని ప్రభుత్వం నియమించింది. ఐదేళ్లపాటూ ఆమె మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కమిషన్ రోజు వారీ కార్యకలాపాలు నిర్వహించడానికి వీలుగా 19 మంది సిబ్బందిని ప్రభుత్వం మంజూరు చేసింది.