చంటి బిడ్డతో సీఎం నివాసం వద్ద నిరీక్షిస్తున్న మేరి
గుంటూరు, తాడేపల్లి రూరల్: ఒకే గ్రామానికి చెందిన వారిరువురూ ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. అయితే మూడేళ్ల తర్వాత తన అత్త పోలీసు కేసు పెట్టి తన భర్త నుంచి తనను వేరు చేయాలని చూస్తోందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. టీడీపీ నాయకురాలైన తన అత్త తమ జోలికి రాకుండా చూడాలని సీఎంకు విన్నవించుకునేందుకు చంటిబిడ్డతో సహా సీఎం ఇంటివద్దకు వచ్చి పడిగాపులు కాసింది. ఆమె గోడు వినే వారు ఎవరూ లేక తిరుగుముఖం పట్టింది.
బాధితురాలైన పిల్లి మేరీ తెలిపిన వివరాల ప్రకారం పెదకాకాని మండలం ఉప్పలపాడుకు చెందిన పిల్లి కోటయ్య, మేరీ మూడు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం కోటయ్య కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో మూడేళ్ల పాటు గుంటూరు చుట్టుగుంటలో నివాసం ఉన్నారు. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. మూడు సంవత్సరాల అనంతరం గ్రామంలో టీడీపీ తరఫున వార్డు మెంబరు అయిన అత్త పిల్లి లీల పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు మేరిని, కోటయ్యను పిలిచి విచారించారు.
తామిద్దరం ప్రేమించి, పెళ్లిచేసుకున్నామని చెప్పడంతో పోలీసులు కేసును మూసివేశారు. అయితే అత్త లీల అక్కడితో ఆగకుండా తన భర్తనుంచి తనను విడదీసేందుకు ప్రయత్నిస్తోందని, టీడీపీ నాయకురాలైన తన అత్త లీలకు నచ్చజెప్పి తన కాపురాన్ని నిలబెట్టాలని కోరేందుకు బుధవారం ఆమె సీఎం నివాసం వద్దకు వచ్చింది. ఆమె గోడు అక్కడ ఎవరూ పట్టించుకోలేదు.చివరకు సీఎం భద్రతా సిబ్బంది కలుగజేసుకుని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి నంబర్ ఇచ్చి ఆమెను కలవాలంటూ సూచించి, అక్కడినుంచి పంపించివేశారు.
Comments
Please login to add a commentAdd a comment