రంగంలోకి దిగిన నారా లోకేష్..
విజయవాడ : కృష్ణాజిల్లాలో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాటలు వీధికెక్కటంతో నేతల మధ్య సమన్వయం కుదిర్చేందుకు చినబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ సోమవారం కృష్ణాజిల్లా నేతలతో భేటీ అయ్యారు.ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి.. విభేదాలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పని చేయాలని నారా లోకేష్ సూచించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను కలుపుకుపోవాలన్నారు.
కాగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యవహార శైలిపై కృష్ణా జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల్లో ఎంతో కాలంగా గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తిని ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని శుక్రవారం బహిర్గతం చేయడంతో ఆయనకు పార్టీలోని ఉమ వ్యతిరేకుల నుంచి మద్దతు లభిస్తోంది. కాగా కాగిత వెంకట్రావు, వల్లభనేని వంశీ, మండలి బుద్ధప్రసాద్ కూడా మంత్రి ఉమకు చాలా దూరంగా ఉంటున్నారు. మరోవైపు శనివారం మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ...తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌పై విమర్శలు గుప్పించడంతో గ్రూపు తగాదాలు ముదిరి పాకాన పడ్డట్లయింది.