ఉపాధి అవకాశాలు పొందిన నిరుద్యోగులకు అనుమతి పత్రాలు ఇస్తున్న మంత్రి కృష్ణదాస్, తదితరులు
సాక్షి, నరసన్నపేట: డీఆర్‌డీఏ, సీడాప్ ఆధ్వర్యంలో నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ మేళాలో 30 కంపెనీ ప్రతినిధులు పాల్గొనగా, జిల్లా వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు తరలివచ్చారు. 4,723 మంది నిరుద్యోగులు తమ అభ్యరి్థత్వాన్ని నమోదు చేసుకోగా, వీరిలో 1,653 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. మరో 432 మంది విశాఖపట్నంలో శిక్షణకు పంపారు. ముందుగా ఈ మేళాను ప్రారంభించిన ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టకపోవడంతో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా ముందుకు వెళ్తుందన్నారు.
ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో దేశ చరిత్రలోనే నాలుగు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహనరెడ్డి మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రుజువైందన్నారు. అదేవిధంగా పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగావకాశాలు ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం తీసుకువచ్చామని గుర్తు చేశారు. ప్రతీ నియోజకవర్గాల్లో జాబ్‌మేళాలు ఏర్పాటు చేసి వందలాది మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. దీంతోపాటు ఏటా జనవరిలో ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు.
జాబ్‌మేళాకు హాజరైన నిరుద్యోగులు
ఉపాధి జ్యోతిని వినియోగించుకోండి..
ఆగస్టు 23న ప్రారంభించిన ఉపాధి జ్యోతి పథకాన్ని నిరుద్యోగులు వినియోగించుకోవాలని మంత్రి కృష్ణదాస్ కోరారు. ఈ వెబ్‌సైట్లో జిల్లా నుంచి 30 వేల మంది, నరసన్నపేట నియోజకవర్గం నుంచి 5,300 మంది నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ వెబ్‌సైట్లో నమోదు చేసుకున్న వారికి జాబ్‌మేళాలో ప్రాధాన్యమిస్తామన్నారు. పార్టీ యువజన విభాగం ప్రతినిధి ధర్మాన కృష్ణచైతన్య మాట్లాడుతూ ప్రతీ ఆర్నెల్లకోసారి నరసన్నపేటలో జాబ్‌మేళా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
పరిశీలించిన కలెక్టర్..
జాబ్‌మేళా నిర్వహణ తీరును కలెక్టర్ జే నివాస్ పరిశీలించారు. ఇక్కడ నిరుద్యోగులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. అధిక మంది నిరుద్యోగులను ఎంపిక చేయాలని కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కల్యాణచక్రవర్తి, నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజర్ గోవిందరావు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కరిమి రాజేశ్వరి, సీడాప్ మేనేజర్ రామ్మోహన్, వైఎస్సార్‌సీపీ నాయకులు చింతు రామారావు, ఆరంగి మురళి, మెండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment