నరసాపురం బరి..ఉద్దండుల గురి.. | Narasapuram Parliamentary Constituency Review | Sakshi
Sakshi News home page

నరసాపురం బరి..ఉద్దండుల గురి..

Published Mon, Mar 25 2019 10:13 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

Narasapuram Parliamentary Constituency Review - Sakshi

కనుమూరి రఘురామకృష్ణంరాజు, నాగేంద్రబాబు, వేటుకూరి వెంకటశివరామరాజు

సాక్షి, భీమవరం: ఎంతో మంది ఉద్దండులను అందించిన నరసాపురం లోక్‌సభా స్థానానికి రాష్ట్రంలో ప్రత్యేకస్థానముంది. ఇక్కడి నుంచి ఎంతోమంది ప్రముఖులు పోటీపడ్డారు. దేశరాజకీయాల దిశనూ మార్చారు. 
 

15సార్లు ఎన్నికలు 
ఈ లోక్‌సభాస్థానానికి 1957 నుంచి ఇప్పటి వరకు 15 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 8 సార్లు కాంగ్రెస్, 4సార్లు టీడీపీ,  2సార్లు బీజేపీ, ఒకసారి సీపీఐ అభ్యర్థులు గెలిచారు. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.  భీమవరం, ఉండి,  పాలకొల్లు, నరసాపురం,  తణుకు, ఆచంట, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలు ఉండగా ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన మధ్యే ప్రధాన పోటీ. 


పీవీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది నరసాపురమే
1991లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్‌రాజు గెలిచారు. ఆ సమయంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వం సంక్షోభంలో పడటంతో విజయకుమార్‌రాజు నేతృత్వంలో ఐదుగురు టీడీపీ ఎంపీలు కేంద్రంలోని  కాంగ్రెస్‌కు మద్దతిచ్చి పీవీ ప్రభుత్వాన్ని నిలబెట్టారు. అప్పట్లో నరసాపురం పేరు మార్మోగింది. 


ఆ రెండు సామాజిక వర్గాలదే హవా
ఈ లోక్‌సభాస్థానంలో క్షత్రియ, కాపు సామాజికవర్గాలదే ఆధిపత్యం. ఇక్కడ ఆ రెండు వర్గాలకు చెందిన వారే ఎంపీగా ఎన్నికవుతున్నారు. తొలిసారి  1957లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా  ఉద్దరాజు రామం లోక్‌సభలో అడుగు పెట్టారు. 1962 నుంచి 71 వరకూ రెండుసార్లు కాంగ్రెస్‌ తరఫున దాట్ల బలరామరాజు గెలిచారు. 1971లో కాంగ్రెస్‌ తరఫున ఎం.టి.రాజు ఎన్నికయ్యారు. 1977–84 వరకూ కాంగ్రెస్‌ నుంచి రెండు పర్యాయాలు అల్లూరి సుభాష్‌చంద్రబోస్‌ లోక్‌సభకు వెళ్లారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ జరిగింది. 1984లో టీడీపీ నుంచి భూపతిరాజు విజయ్‌కుమార్‌రాజు గెలుపొందారు. ఆ తర్వాత  1989లో టీడీపీ అభ్యర్థిగా విజయ్‌కుమార్‌రాజు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నాచు శేషగిరిరావు పోటీపడ్డారు. అప్పటి వరకు క్షత్రియ వర్గమే ఎంపీ పీఠాన్ని దక్కించుకోవడంతో అత్యధిక ఓట్లు కాపు సామాజిక వర్గానికి చెందిన శేషగిరిరాజు పోటీ పడడంతో నాచు గెలుపు నల్లేరుపై నడకేనని భావించారు.

అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ  విజయ్‌కుమార్‌రాజు 13,802 ఓట్ల ఆధిక్యంతో గెలుపొదడంతో ఓటర్లు కుల ప్రమేయం లేని తీర్పునిచ్చారని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. 1991 ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయ్‌కుమార్‌రాజు, కాంగ్రెస్‌ నుంచి సినీనటుడు యూవీ కృష్ణంరాజు బరిలో నిలవగా విజయ్‌కుమార్‌రాజు గెలిచారు. ఈ సమయంలోనే  కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రధానమంత్రి పీవీ నర్సింహరావు పీఠాన్ని నిలబెట్టేందుకు తెలుగు ఆత్మగౌరవం పేరుతో విజయకుమార్‌రాజు మరో నలుగురు టీడీపీ ఎంపీలతో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 1996లో టీడీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు గెలుపొందారు. 1998లో కాంగ్రెస్‌ నుంచి కనుమూరి బాపిరాజు గెలిచారు.  1999లో యునైటెడ్‌ ఫ్రంట్‌ పార్టీల పొత్తుతో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి సినీనటుడు  యూవీ కృష్ణంరాజు విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా  చేగొండి వెంకట హరరామజోగయ్య (హరిబాబు), బీజేపీ నుంచి యూవీ కృష్ణంరాజు పోటీ పడగా హరి బాబును విజయం వరించింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించడంతో టీడీపీ, కాంగ్రెస్, పీఆర్పీ మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది. టీడీపీ అభ్యర్థిగా తోట సీతారామలక్ష్మి, కాంగ్రెస్‌ నుంచి కనుమూరి బాపిరాజు, పీఆర్పీ నుంచి గుబ్బల తమ్మయ్య పోటీపడ్డారు. బాపిరాజు 1,14,690 ఓట్ల భారీ మెజార్టీతో విజయ కేతనం ఎగురవేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదరడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా వంకా రవీంద్రనాథ్,  బీజేపీ అభ్యర్థిగా గోకరాజు గంగరాజు, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా కనుమూరి బాపిరాజు పోటీచేశారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో బీజేపీ గెలిచింది.  


ఎంపీలంతా  కేంద్రాన్ని శాసించిన వారే....
నరసాపురం నుంచి ఎంపీగా ఎన్నికైన నాయకులంతా దాదాపుగా కేంద్రాన్ని శాసించిన నాయకులే.  తొలిసారి సీపీఐ నుంచి ఎన్నికైన ఉద్దరాజు రామం ఆ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత దాట్ల బలరామరాజు, ఎంటీ రాజులు కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషించారు. అల్లూరి సుభాష్‌చంద్రబోస్‌ రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లోనూ తన హవాను నడిపారు.  బోస్‌ ఇందిరాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా మెలిగి అసెంబ్లీ ఎన్నికలకు  జిల్లాలో అభ్యర్థుల ఎంపికలో కీలకపాత్ర పోషించారు. శాసనసభ్యునిగా రెండు సార్లు ఎన్నికయ్యారు. టీడీపీలో గెలుపొందిన విజయ్‌కుమార్‌ రాజు ఆ పార్టీలో రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడంతోపాటు పార్టీ అధినేత దివంగత ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచారు. బీజేపీలో ఎంపీగా ఉన్న కృష్ణంరాజు కేంద్ర మంత్రివర్గంలో పనిచేశారు.  కాంగ్రెస్‌ నుంచి ఎన్నికైన బాపిరాజు ఆ పార్టీని భుజాన వేసుకుని నడిచారు. ప్రస్తుత ఆర్‌ఎస్‌ఎస్‌లో జాతీయ స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎంపీగా ఎన్నికైన గోకరాజు గంగరాజుది  బీజేపీలో కీలకపాత్రే.


ప్రధాన సమస్యలు
పార్లమెంట్‌ నియోజకవర్గం అభివృద్ధికి సహజవనరులు పుష్కలంగా ఉన్నా  పారిశ్రామికంగా ఎటువంటి అభివృద్ధికీ నోచుకోలేదు. ఎంతోకాలంగా నరసాపురం వద్ద వశిష్టగోదావరిపై వంతెన కలగానే మిగిలింది. ఆక్వారంగం అభివృద్ది చెందుతున్నా ప్రభుత్వపరంగా  మౌలిక సదుపాయాల కల్పన, ప్రోత్సాహం కరువైంది. గోదావరి ఏటిగట్టు పటిష్టం చేయడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఏటిగట్లు పనులు నేటికీ పూర్తి చేయనేలేదు. జాతీయ రహదారులు 216, 216 ఏ అభివృద్ది పనులు నత్తనడకన సాగుతున్నాయి.  గోదావరి చెంతనే ఉన్నా కాలుష్యం వల్ల తాగునీటి ఎద్దడి నెలకొంది.  భీమవరం, ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల్లో రైల్వే ఫ్లైఓవర్ల నిర్మాణం కొలిక్కిరాలేదు.  


అభ్యర్థి దొరక్క టీడీపీ విలవిల
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ లోక్‌సభా స్థానాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న టీడీపీ ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థి దొరకక విలవిల్లాడింది.  టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ 4 సార్లు టీడీపీ, రెండుసార్లు టీడీపీ మద్దతుతో బీజేపీ, మూడుసార్లు కాంగ్రెస్‌ గెలిచాయి. ఈసారి ఇక్కడ ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజును బలవంతంగా పోటీలోకి దించారు. అలాగే జనసేన నుంచి ఆ పార్టీ అధినేత సోదరుడు నాగేంద్రబాబు బరిలోకి దిగారు.  


వైఎస్సార్‌ సీపీ హవా
ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వైఎస్సార్‌సీపీ గాలి వీస్తోంది. ఆ పార్టీ తరఫున పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తున్నారు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండడంతో ప్రజల్లో ఆదరణ వెల్లువెత్తుతోంది. ప్రస్తుతం విజయావకాశాలు ఆయనకే ఎక్కువగా ఉన్నాయి. 


అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్లు ఇలా.. 
నియోజకవర్గం        మొత్తం ఓటర్లు     పురుషులు    మహిళలు    ఇతరులు
తాడేపల్లిగూడెం            1,96,980       97,078        99,883      19
భీమవరం                    2,29,334      1,12,836    1,16392    106
నరసాపురం                 1,59,144      79,727         79,416      01
పాలకొల్లు                     1,80,965      89,491         91,435     39
ఆచంట                         1,66,421      82,547         83,866     08
ఉండి                            2,11,647     1,04,925    1,06,707    15
తణుకు                         2,18,163     1,06,804    1,11,353    06 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement