
ఉరికంబంపై ఊగిసలాట
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై నారాయణ ఎద్దేవా
పార్లమెంట్‌లో దాడిచేసిన వారు ఉగ్రవాదులే
మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉరికంబంపై ఊగిస లాడుతున్నాయని సీపీఐ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఎద్దేవాచేశారు. పార్లమెంట్‌లో మైకులు విరగ్గొట్టి కత్తులుగా వాడటం, పెప్పర్ స్ప్రే చల్లి వీధిరౌడీలకంటే హీనంగా తన్నుకోవ డం ప్రపంచ చరిత్రలో ఎప్పు డూ జరగలేదన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం ఆయన విలేకరుతో మాట్లాడారు. గతంలో పార్లమెంట్ భవనంపై దాడిచేసిన వారిని ఉరితీయాలని అందరం డిమాండ్ చేశామని, కానీ లోక్‌సభలో తోటి ఎంపీలపై దాడిచేసిన వారి సంగతేమిటని ప్రశ్నించారు. వారు ముమ్మాటికి ఉగ్రవాదు లేనని ఆరోపించారు. వీడియో పుటేజ్‌లను పరిశీలించి సంఘటనకు బాధ్యులైన వారిని ఉరితీసినా పాపం లేదన్నారు. దోషులను శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించాలని, లేకుంటే రిలయన్స్, అంబానీ, ప్రపంచ బ్యాంకులు దేశ సార్వభౌమత్వాన్ని శాసిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అన్నిపార్టీల అభిప్రాయాలు, పలు కమిషన్ల నివేదికలు, జీఓఎం సిఫార్సులాంటి అన్ని చర్చలు, ఇతర ప్రక్రియలు పూర్తయ్యాయని, అందుకే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తెలంగాణ బిల్లును చర్చ లేకుండానే ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ర్ట విభజన పట్ల రాజకీయ పార్టీలు చేసిన నిర్ణయాలకు కట్టుబడకపోవడమే ఈ అరాచకాలకు మూలమన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామన్న బీజేపీ, చంద్రబాబు సావాసదోషంతో మాటమారుస్తోందని దుయ్యబట్టారు. జాతీయస్థాయిలో చక్రం తిప్పగలనన్న ఫోజులకు మాత్రమే బాబు ఇతర రాష్ట్రాల నేతలు కలిసి సమన్యాయం అంటున్నారని విమర్శించారు. సమస్యను రాష్ట్రంలో సృష్టించి ఢిల్లీలో పరిష్కారాన్ని వెదుకులాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పడమటి ఎద్దులా మొండికేస్తున్నాడని ధ్వజమెత్తారు.