రాష్ట్రం నుంచి వెళ్తున్నాం.. మాకోసం వెతకొద్దు..
Published Thu, Mar 23 2017 10:43 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
► మాకోసం వెతకవద్దు...నారాయణ స్కూల్ విద్యార్థులు
అనంతపురం: అనంతపురం నారాయణ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఇంటి నుంచి పారిపోయారు. మేము ఈ రాష్ట్రం నుంచి వెల్లిపోతున్నాం. మాకోసం వెతకవద్దు. డబ్బులు అనవసరంగా ఖర్చు చేయవద్దు. తొందర్లో తిరిగొస్తాం అని లేఖ రాసి వెళ్ళారు. దీంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు... నగరంలో మూడవరోడ్డులో నివాసముంటున్న సూర్యనారాయణ కుమారుడు కరణం ప్రణవ్‌దీక్షిత్(14), మక్బూల్‌బాషా కుమారుడు మహ్మద్‌షమీర్(14)లు స్థానికంగా నారాయణ స్కూల్‌లో తొమ్మిదోతరగతి చదువుతున్నారు.
అదే పాఠశాలలో పీఈటీ మాస్టర్ మధుసూదన్‌రావు దగ్గర యోగా నేర్చుకుంటున్నారు. ఏమైందో తెలియదు కాని మంగళవారం రాత్రి ఇంటి నుంచి పారిపోయారు. పొద్దుపోయినా ఇంటికి రాకపోవడంతో కగారుపడ్డ తల్లిదండ్రులు నగరమంతా గాలించారు. చివరకు ఇద్దరి ఇళ్లలో దొరికిన లేఖలను చూసిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సీసీ పుటేజీల ఆధారంగా విద్యార్థుల కదలికలను ఆరా తీసిన పోలీసులు సైకిళ్లలో బస్టాండ్‌కు వచ్చి బస్సెక్కి వెల్లిపోయినట్లు తేల్చారు. అయితే ఇంటి నుంచి పారిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తల్లిదండ్రులు మాత్రం యోగాకు పూర్తిగా అడిక్టు అయ్యారని, నిత్యం ఆన్‌లైన్‌లో యోగా గురువుల ఉపన్యాసాలు వింటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో భాగంగా ఎక్కడైనా యోగా గురువు వద్దకు వెళ్ళి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement