నారాయణను మంత్రిపదవి నుంచి బర్తరఫ్ చేయాలి
కడప ఎడ్యుకేషన్: మంత్రి నారాయణవి విద్యాసంస్థలు కావని, ఆవి కారాగారాలని పిల్లల ప్రాణాలను హరించే చెరశాలలని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ మంత్రి నారాయణపై ధ్వజమెత్తారు. కడప నగరంలో మంగళవారం వైఎస్సాఆర్ స్టూడెంట్ జిల్లా అధ్యక్షుడు ఖాజారహ్మతుల్లా ఆధ్వర్యంలో సంధ్య సర్కిల్ నుంచి కోటిరెడ్డి సర్కిల్ వరకు మంత్రి నారాయణ దిష్టిబొమ్మతో శవయాత్రను నిర్వహించి అనంతరం కోటిరెడ్డి సర్కిల్‌లో దహనం చేశారు. ఈ సందర్భంగా ఖాజా రహ్మతుల్లా మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక క్లాస్‌రూముకు 60 మంది ఉండాల్సి ఉంటే నారాయణ కళాశాలల్లో మాత్రం వందమందికి పైగా ఉంటున్నారన్నారు.
వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నా విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయిందన్నారు. ఎంతమంది విద్యార్థులు చనిపోయినా నారాయణ విద్యాసంస్థల అధిపతి మంత్రి నారాయణపై చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మంత్రపదవి నుంచి నారాయణను బర్తరఫ్ చేయాలన్నారు. తిరుపతిలో మనోజ్‌కుమార్, సాయిచరణ్‌నాయక్‌లు చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కేసుమాత్రం ముందుకు సాగడం లేదన్నారు. అసలు వారివి హత్యలా లేక ఆత్మహత్యలా అనేవి ప్రశ్నలుగా మిగిలిపోయాయన్నారు. ఇదే సమస్య ఓ సాధారణ కళాశాలలో జరిగితే ఇలాగే ప్రభుత్వం వ్యవహరించేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్క తిరుపతిలోనే కాదు కడప, నెల్లూరు. గుంటూరు. కర్నూల్‌తోపాటు రాష్ట్రం మొత్తం మీదే ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. నారాయణ ధనదాహానికి పసిమొగ్గలు నేలరాలుతున్నారని అందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యల కేసులో న్యాయం చేయాలని అడిగిన వైఎస్సార్ విద్యార్థిసంఘం నాయకులపై అక్రమ కేసులు బనాయించారన్నారు. విద్యార్థుల భవిషత్తు కోసం మేము జైలు కెళ్లడానికైనా సిద్ధమన్నారు. కానీ తల్లితండ్రులు కూడా ఒక్కసారి ఆలోచించి పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ స్టూడెంట్ నాయకులు మాసిన్, గంగాధర్, విజయ్, రహీమ్, శ్రీనాద్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.