వచ్చే ఎన్నికల్లో సీపీఐ ఒంటరిగానే పోటీ చేస్తుంది
ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టే స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను.. 53 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను అని చెప్పే కిరణ్.. చిత్తూరు వెళ్లి ఎన్నికల్లో పోటీచేయడమెందుకని ప్రశ్నించా రు. ఇప్పుడు ప్రత్యామ్నాయంలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు పరాయి పార్టీల పంచల్ని వెతుక్కుంటున్నారని విమర్శించారు. కాళ్ల పారాణి ఆరకముందే బీజేపీ, టీడీపీ విడాకులు తీసుకున్నాయని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. విభజన నేపథ్యంలో ఈనెల 4న విజయవాడలో 13 జిల్లాలతో కూడిన ప్రాంతీయ సదస్సు, 12న వరంగల్‌లో తెలంగాణ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు.