
మోడీ విమర్శలకే పరిమితమయ్యారు: గండ్ర
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికే నరేంద్ర మోడీ పరిమితయ్యారని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మోడీ తన ప్రసంగంలో బీజేపీ విధానం చెప్పలేకపోయారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం-బీజేపీ మధ్య పొత్తుకు మోడీ పర్యటన దోహదపడిందని గండ్ర వ్యాఖ్యానించారు. బాలకృష్ణ, మురళీమోహన్లు...మోడీని ఎందుకు కలిశారో టీడీపీ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ పొత్తుపై చంద్రబాబునాయుడు తన వైఖరిని స్పష్టం చేయాలని గండ్ర అన్నారు. విభజనపై రాష్ట్రపతిని బాబు కలవాలనుకోవటం ఆయన రెండు కళ్ల విధానానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి అస్థిర విధానాలతో చంద్రబాబు మరింత పలుచన అవుతున్నారని గండ్ర అన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర నేతల వైఖరిని హైకమాండ్ గమనిస్తోందని..... వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది అధిష్టానం చూసుకుంటుందని గండ్ర పేర్కొన్నారు.