జగన్, చంద్రబాబుకు ఎన్డీఎమ్ఏ లేఖ
న్యూఢిల్లీ: ఫైలిన్ తుఫాన్ తీవ్రరూపం దాల్చచడంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎమ్ఏ) అప్రమత్తమయింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు పొంచివుండడంతో ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది. సహాయక చర్యలు కొనసాగించేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఎన్డీఎమ్ఏ ఉపాధ్యక్షుడు కోరారు.
మానవతా దృక్పథంలో ఆందోళన కార్యక్రమాలు 15 రోజులు వాయిదా వేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇరువురు నేతలకు లేఖలు రాశారు. ఢిల్లీలో దీక్ష చేస్తున్న చంద్రబాబుకు లేఖ అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర సిబ్బంది తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొనాల్సివుందని తెలిపారు.
ఫైలిన్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కళింగపట్నం - పారాదీప్ల మధ్య ఈనెల 12న ఫైలిన్ తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు ఎన్ఎమ్డీఏ సహాయక బృందాలు పంపింది. ఒడిశాకు 8, ఆంధ్రప్రదేశ్కు 9 బృందాలు పంపింది. అలాగే ఎయిర్ఫోర్స్, నావికాదళం, ఆరోగ్య శాఖల సహకారం కూడా ఎన్ఎమ్డీఏ కోరింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచింది.
శ్రీకాకుళం: 08942 240557, 9652838191
గుంటూరు : 08644 - 223800
తూర్పుగోదావరి: 08856 - 233100
పశ్చిమగోదావరి: 08812 230617
నెల్లూరు: 1800 425 2499, 08612 331477