అనంతపురం నగరంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తొమ్మిదోతరగతి విద్యార్థిని రెండు నెలల క్రితం ప్రసవించింది. ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఈ విషయం బయటకు చెబితే సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి దాపురిస్తుంది.
గత నెలలో ఉరవకొండ నుంచి ఓ బాలిక పురిటినొప్పులతో ప్రభుత్వాస్పత్రికి చేరింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకున్నాడు. పాఠశాలకు వెళ్లే క్రమంలో పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడడంతో సదరు బాలిక గర్భం దాల్చినట్లు తేలింది.
అనంతపురం సెంట్రల్: జిల్లాలో బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో పది మందికిపైగా బాలికలు ప్రసవించారు. కొన్ని ఘటనలు బయటకు వస్తున్నా... మరికొన్ని వెలుగులోకి రావటం లేదు. దీనంతటికీ కారణం సాంకేతిక ముసుగులో యువత పెడదారి పడుతుండడమే. యువతే కాకుండా పెద్ద వయస్కులు, చదువుకున్న ఉద్యోగులు, విద్యాబోధన చేసే గురువులు లేకపోలేదు. వావి వరసలు మరిచి క్రూరమృగాలుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు వెలుగుచూసిన ప్రతిసారీ పిల్లలను బయటకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాంకేతిక విప్లవం అరచేతిలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు మరీ ఎక్కువయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ వాడకం సులభతరమైంది. అయితే మంచికి వినియోగించాల్సిన టెక్నాలజీని.. చెడుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండడంతో యువత పెడదోవ పడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు తల్లిదండ్రులు సంపాదనపై దృష్టి సారించి పిల్లలను సన్మార్గంలో నడిపించాలనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఈ కారణాల వలన యువత పెడదారి పడుతుండడంతో పాటు అఘాయిత్యాలకు పాల్పడుతోంది.
బాల్య వివాహాలు అధికం
బాలికలపై అఘాయిత్యాలే కాకుండా బాల్యవివాహాలు కూడా అధికం అవుతున్నాయి. విద్యా హక్కు చట్టం, వేధింపులు అరికట్టేందుకు పోక్సో లాంటి అనేక చట్టాలు వచ్చాయి. బాల్య వివాహాల నియంత్రణకు చట్టాలున్నాయి. బాల్య వివాహాలు చేసుకున్న వారు, ప్రోత్సహిస్తున్న వారు కూడా శిక్షార్హులు. తొమ్మిది సంవత్సరాలకు పైగా శిక్ష పడే అవకాశముంది. చట్టాలు కఠినంగా ఉన్నాయని చెబుతున్నా బాలికలపై మాత్రం నేరాలు ఆగడం లేదు. కొన్ని పెద్దలు నిశ్చయించి జరిపిస్తుంటే.. మరికొందరు తెలిసీ తెలియని వయస్సులో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. దీని వలన జరిగే అనర్థాలను వివరించి చైతన్యం కల్పించాల్సిన అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదు. మారుమూల ప్రాంతాల్లో సైతం బాలికా చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తే తప్ప నేరాలు నియంత్రించలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బాలికల రక్షణకు చర్యలు
బాలికల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. బాల్య వివాహాలు నిరోధించేందుకు చైల్డ్‌లైన్ 1098, పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకొని తమ దృష్టికి వచ్చిన వివాహాలను నిలుపుదల చేస్తున్నాం. మరికొన్ని వాటికి కౌన్సెలింగ్ ద్వారా మార్పులు తీసుకొస్తున్నాం. బాల్య వివాహాలు, అఘాయిత్యాలు నివారించేందుకు కిశోరి వికాసం ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. బాలికల హక్కులను హరిస్తే చట్ట ప్రకారం వారిపై క్రిమినిల్ కేసులు నమోదు చేయిస్తున్నాం. – చిన్మయాదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, మహిళా,శిశు సంక్షేమశాఖ
జిల్లాలో బాలికలపైజరిగిన లైంగిక వేధింపుల వివరాలు
ఏడాది వేధింపుల సంఖ్య
2015 35
2016 32
2017 36
2018 18
Comments
Please login to add a commentAdd a comment