girl childday
-
వాళ్లు సమాజానికి మూలస్తంభాలు
సిరిసిల్ల: ఆడపిల్ల పుట్టిందంటే ఇంటికి మహాలక్ష్మీ అరుదెంచిందని భావిస్తారు. స్త్రీలు పూజించబడిన చోట దేవతలు నివసిస్తారంటారు. నవీన మానవ సమాజంలో మాత్రం ఇంకా ఆడపిల్లలకు సముచిత స్థానం లేదనడం అతిశయోక్తి కాదు. దేశంలో ప్రతీ 1,000 మంది పురుషులకు 943 మంది మహిళలు మాత్రమే ఉన్నారంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. సభ్య సమాజానికి మూల బిందువైన ఆడపిల్లలను గర్భంలో ఉన్నప్పుడు తుంచేయడం, భ్రూణ హత్యలకు పాశవికంగా పాల్పడడం వంటి చర్యలు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయేందుకు కారణమవుతున్నాయి. ప్రతీ వ్యవస్థలోనూ పురుషుడికే అగ్రపీఠం ఇవ్వడం వల్ల మహిళలు నిరాదరణకు గురవుతున్నారు. లింగ నిష్పత్తి ప్రకారం దేశంలో ప్రతీ 1,000 మంది బాలురకు 1981లో 962 మంది, 1991లో 945 మంది 2011లో 919 మంది బాలికలు ఉన్నారు. ప్రతీ పదేళ్లకు ఈ సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ ఉండడం ప్రమాదస్థితికి దర్పణం పడుతోంది. ఈ లెక్కల ప్రకారం స్త్రీ, పురుష జనాభా నిష్పత్తి సమతూకంలో ఉండడంలో దేశం 41వ స్థానంలో ఉంది. బాలిక దినోత్సవం వెనుక.. సనాతన దేశంలో బాలికల పట్ల వివక్షను నిర్మూలించేందుకు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏటా జనవరి 24న బాలికా దినోత్సవం జరుపుతోంది. ఆడపిల్లలను చదవనిద్దాం.. ఎదగనిద్దాం అనే నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఆడపిల్లల హక్కులపై అవగాహన కల్పించడం, వారి సామాజిక పురోగతికి అవసరమైన ప్రోత్సాహం, సమానావకాశాలను అందించేలా కృషి చేస్తోంది. స్త్రీలకు ఉన్నత విద్య, ఆరోగ్యం, పోషకాహారం వంటివి అందించే దిశగా పలు ప్రయత్నాలు జరుపుతోంది. పలు పథకాలను రూపొందించి అమలు చేస్తోంది. ప్రత్యేకంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సారథ్యంలో పలు పథకాలను రూపొందించింది. బేటీ బచావో..బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన పథకాలను అమలు చేస్తోంది. పదేళ్ల లోపు బాలికల పేరిట పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించిన వారికి 9.1శాతం వడ్డీని అందిస్తోంది. ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇస్తోంది. దేశంలో ప్రస్తుతం 440జిల్లాల్లో ఈ పథకం అమలులో ఉంది. కొనసాగుతున్న వివక్ష.. ఆడపిల్లను లక్ష్మీదేవితో సమానంగా చూసే సభ్య సమాజంలో ఇంకా లింగ వివక్ష కొనసాగుతూ ఉండడం విషాదం. చదువుకొని ఉద్యోగాలు చేయాలా.. ఊళ్లు ఏలాలా అనే ప్రశ్నలతో ఉన్నత విద్యను ఆడపిల్లలకు అందకుండా చేస్తున్నారు. రెండేళ్ల తేడాతో ఉన్న అబ్బాయి, అమ్మాయి ఉన్న ఇంట్లో ఆడపిల్లలను బడి మాన్పించి, అబ్బాయిని చదివించే నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యకు చేరేసరికి ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతూ కనిపించడమే ఇందుకు నిదర్శనం. భ్రూణహత్యలు.. పెంచి పెద్ద చేయడంతో పాటు కట్నాలిచ్చి పెళ్లి చేయడం భారంగా భావించే కొంత మంది తల్లిదండ్రులు పుట్టబోయేది ఆడ శిశువు అని తెలుసుకుని గర్భంలోనే తుంచేస్తున్నారు. కడుపులో ఉండగానే శిశువు ఆడ, మగ అని నిర్ధారించే స్కానింగ్ పరీక్షలను చట్ట పరిధిలో నేరంగా పరిగణిస్తున్నా ఇంకా భ్రూణ హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. బాల్య వివాహాలు.. యుక్త వయసు రాకముందే ఆడపిల్లలకు వివాహాలు చేస్తే భారం తగ్గుతోంది, బాధ్యత తీరుతుంది అని తల్లిదండ్రులు భావించడం కారణంగా బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సమాజంలో అమ్మాయిలకు భద్రత కరువైందన్న భావనతో ఉన్నత చదువులకు దూరంగా ఉంచుతున్నారు. పేదరికం, నిరక్షరాస్యత తదితర కారణాలు కూడా ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రుల వివక్షకు కారణమవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో.. జిల్లా ఆవిర్భావం నుంచి సమగ్ర శిశు రక్షణ పథకం ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలో ఒక శిశు సంరక్షణ కేంద్రం నిర్వహించబడుతోంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 30 బాల్య వివాహాలను నిలువరించగలిగారు. యుక్త వయసుకు ముందే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడం వల్ల కలిగే నష్టాలపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆపరేషన్ స్మైల్ ద్వారా దాదాపు 60 మంది బడి బయటి పిల్లలను గుర్తించారు. మరో 65 మందిని ఆపరేషన్ ముస్కాన్‌లో గుర్తించారు. 22 మంది అట్రాసిటీ బాధితులకు నష్ట పరిహారం ఇచ్చారు. 14 మంది అనాథ హెచ్ఐవీ బాధితులకు నెలకు రూ.1000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఉన్నతంగా చదివించాలి లింగ వివక్షను నిర్మూలించే ప్రక్రియ కుటుంబంతోనే ప్రారంభం కావాలి. ఆడపిల్లలను మగ పిల్లలతో సమానంగా చూడాలి. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను కూడా ఉన్నతంగా చదివించాలి. ప్రతీ రంగంలోనూ అమ్మాయిలు ప్రతిభ చాటుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా అందుతున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని అమ్మాయిలు ఎదిగేలా సానుకూల వాతావరణాన్ని సృష్టించాలి. – సుచరిత, బాల రక్షాభవన్ కోఆర్డినేటర్ సమాజానికి మూలస్తంభాలు మానవ సమాజానికి మూలస్తంభాలైన ఆడపిల్లలను చదవనివ్వడం, ఎదగనివ్వడం సమాజం కనీస బాధ్యత. ప్రతీ ఆడపిల్ల స్వయంపోషిత స్థితికి ఎదిగే వరకు వివాహాన్ని వాయిదా వేసుకోగలగాలి. పరాధీన మనస్తత్వంతో పెంచడం మంచిది కాదు. తన కాళ్లమీద తాను నిలబడేంత వరకు అమ్మాయిలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి. – రౌతు అలేఖ్యపటేల్, సీడీపీవో, సిరిసిల్ల -
తొమ్మిదోతరగతి విద్యార్థిని ప్రసవం..
అనంతపురం నగరంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తొమ్మిదోతరగతి విద్యార్థిని రెండు నెలల క్రితం ప్రసవించింది. ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఈ విషయం బయటకు చెబితే సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి దాపురిస్తుంది. గత నెలలో ఉరవకొండ నుంచి ఓ బాలిక పురిటినొప్పులతో ప్రభుత్వాస్పత్రికి చేరింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకున్నాడు. పాఠశాలకు వెళ్లే క్రమంలో పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడడంతో సదరు బాలిక గర్భం దాల్చినట్లు తేలింది. అనంతపురం సెంట్రల్: జిల్లాలో బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో పది మందికిపైగా బాలికలు ప్రసవించారు. కొన్ని ఘటనలు బయటకు వస్తున్నా... మరికొన్ని వెలుగులోకి రావటం లేదు. దీనంతటికీ కారణం సాంకేతిక ముసుగులో యువత పెడదారి పడుతుండడమే. యువతే కాకుండా పెద్ద వయస్కులు, చదువుకున్న ఉద్యోగులు, విద్యాబోధన చేసే గురువులు లేకపోలేదు. వావి వరసలు మరిచి క్రూరమృగాలుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు వెలుగుచూసిన ప్రతిసారీ పిల్లలను బయటకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాంకేతిక విప్లవం అరచేతిలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు మరీ ఎక్కువయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ వాడకం సులభతరమైంది. అయితే మంచికి వినియోగించాల్సిన టెక్నాలజీని.. చెడుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండడంతో యువత పెడదోవ పడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు తల్లిదండ్రులు సంపాదనపై దృష్టి సారించి పిల్లలను సన్మార్గంలో నడిపించాలనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఈ కారణాల వలన యువత పెడదారి పడుతుండడంతో పాటు అఘాయిత్యాలకు పాల్పడుతోంది. బాల్య వివాహాలు అధికం బాలికలపై అఘాయిత్యాలే కాకుండా బాల్యవివాహాలు కూడా అధికం అవుతున్నాయి. విద్యా హక్కు చట్టం, వేధింపులు అరికట్టేందుకు పోక్సో లాంటి అనేక చట్టాలు వచ్చాయి. బాల్య వివాహాల నియంత్రణకు చట్టాలున్నాయి. బాల్య వివాహాలు చేసుకున్న వారు, ప్రోత్సహిస్తున్న వారు కూడా శిక్షార్హులు. తొమ్మిది సంవత్సరాలకు పైగా శిక్ష పడే అవకాశముంది. చట్టాలు కఠినంగా ఉన్నాయని చెబుతున్నా బాలికలపై మాత్రం నేరాలు ఆగడం లేదు. కొన్ని పెద్దలు నిశ్చయించి జరిపిస్తుంటే.. మరికొందరు తెలిసీ తెలియని వయస్సులో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. దీని వలన జరిగే అనర్థాలను వివరించి చైతన్యం కల్పించాల్సిన అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదు. మారుమూల ప్రాంతాల్లో సైతం బాలికా చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తే తప్ప నేరాలు నియంత్రించలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాలికల రక్షణకు చర్యలు బాలికల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. బాల్య వివాహాలు నిరోధించేందుకు చైల్డ్‌లైన్ 1098, పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకొని తమ దృష్టికి వచ్చిన వివాహాలను నిలుపుదల చేస్తున్నాం. మరికొన్ని వాటికి కౌన్సెలింగ్ ద్వారా మార్పులు తీసుకొస్తున్నాం. బాల్య వివాహాలు, అఘాయిత్యాలు నివారించేందుకు కిశోరి వికాసం ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. బాలికల హక్కులను హరిస్తే చట్ట ప్రకారం వారిపై క్రిమినిల్ కేసులు నమోదు చేయిస్తున్నాం. – చిన్మయాదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, మహిళా,శిశు సంక్షేమశాఖ జిల్లాలో బాలికలపైజరిగిన లైంగిక వేధింపుల వివరాలు ఏడాది వేధింపుల సంఖ్య 2015 35 2016 32 2017 36 2018 18 -
చిట్టితల్లిపై చిన్నచూపు
ఆడపిల్ల, అబల, వంటింటి కుందేలు.. లాంటి ఎన్నో అవమానాల పరిధులు దాటి అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ మహిళలు రాణిస్తున్నారు. సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేకత కోసం నిరంతరం మగవారితో పోటీ పడుతున్నారు. నింగి, నేలా మాదేనంటూ దూసుకెళ్తున్నారు. సత్తా చాటుతున్నారు.. ఒక రకంగా మగపిల్లల కంటే ఆడపిల్లలే నయమనిపించే పరిస్థితులు, ఘటనలు సమాజంలో కనిపిస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఇంకా సమాజంలో ఆడపిల్లంటే చిన్న చూపే ఉంది. వారిపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడపిల్ల వద్దు.. మగపిల్లాడే ముద్దు అని చాలామంది భావిస్తున్నారు. మగవారి నిష్పత్తితో పోలిస్తే ఆడపిల్లల నిష్పత్తి తగ్గుతున్నా.. సృష్టికి విరుద్ధంగా వ్యవహరిస్తూ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారు. బాలురతో పోలిస్తే బాలికల నిష్పత్తి తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. కామారెడ్డి క్రైం: మగబిడ్డపై మమకారం చూపే తల్లిదండ్రులు.. ఆడపిల్లను వద్దనుకుంటున్నారు. కడుపులో పెరుగుతున్నది ఆడపిండం అని తెలిస్తే చాలు కడుపులోనే తుంచేస్తున్నారు. జిల్లాలో జనాభా గణాంకాలను పరిశీలిస్తే భవిష్యత్తు ప్రమాదకరమనే హెచ్చరికలు కనిపిస్తాయి. జిల్లా జనాభాలో పురుషుల జనాభా కన్నా మహిళలే ఎక్కువగా ఉన్నారు. పురుష, స్త్రీ నిష్పత్తి 1000 ః 1003గా ఉంది. కానీ బాలబాలికల విషయానికి వచ్చేసరికి బాలికల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆరేళ్లలోపు పిల్లల జనాభాను పరిశీలిస్తే.. మగ పిల్లలు 57,528 మంది ఉంటే, ఆడపిల్లలు 54,138 మందే ఉన్నారు. మగపిల్లలకన్నా ఆడపిల్లలు 3,390 మంది తక్కువగా ఉన్నారు. బాలబాలికల నిష్పత్తి 1000 @ 941గా ఉంది. వారసుడి కోసం.. సమాజంలో మగబిడ్డే వారసుడన్న భావన ఉంది. ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి వెళ్తుంది. అదే మగపిల్లవాడు అయితే వంశాన్ని నిలబెడతాడని, అత్తారింటికి వెళ్లే ఆడపిల్ల వారసురాలు కాదన్న ఉద్దేశం చాలామందిలో బలంగా నాటుకుపోయింది. కొడుకు అయితే తమ బాధ్యతను మోస్తాడనే భావన ఉండడం కూడా ఓ కారణం. దీంతో తొలి కాన్పులో ఆడపిల్ల పుడితే సంతోషిస్తున్నవారూ.. రెండో కాన్పు విషయానికి వచ్చేసరికి గర్భనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు అబార్షన్ చేయించుకుంటున్నారు. పుట్టేది ఆడో మగ శిశువో చెప్పడం చట్టరీత్యా నేరమైనా.. పలు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు డబ్బుపై వ్యామోహంతో నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. దీంతో పుట్టేది ఆడ అని తెలియగానే పలువురు అబార్షన్ చేయించుకుంటుండడంతో జిల్లాలో బాలికల జనాభా నిష్పత్తి పడిపోతోంది. అనర్థాలే... జనాభా పెరుగుదలలో స్త్రీ, పురుష జనాభాలో వ్యత్యాసం ఎక్కువైతే అనర్థాలు తలెత్తే అవకాశాలుంటాయి. ఇప్పటికే చాలా మంది పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలకు అమ్మాయిలు దొరక్క ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆడపిల్లలపై వివక్షకు అంతం పలకాల్సిన అవసరం ఉంది. వ్యత్యాసం పోవాలి.. బాలురు, బాలికల అనే వ్యత్యాసం పోవాలి. అమ్మాయిలను కూడా అబ్బాయిలతో సమానంగా చూడాలి. అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వారికి సరైన ప్రోత్సాహం అందించాలి. విద్యాపరంగా మగపిల్లలకు చదివించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి వ్యత్యాసాలు మంచివి కావు. చదువులో అబ్బాయిల కంటే అమ్మాయిలే రాణిస్తారు. – అనిత, అంగన్వాడీ టీచర్, కామారెడ్డి చిన్నచూపు వద్దు.. ఆడపిల్లలు ఆది పరాశక్తులు. వారిని చిన్నచూపు చూడొద్దు. మగపిల్లలతో సమానంగా చూడాలి. ఆడపిల్లలు దేంట్లోను తీసిపోరు. ఇందిరాగాంధీని మొదలుకుని రాజకీయాల్లో ఐఏఎస్, ఐపీఎస్, పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఆడపిల్లలను చదివిస్తే వారి సత్తా ఏంటో చాటుతారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ పడావో, బేటీ బచావో నినాదాన్ని నిజం చేయాలి. – సీహెచ్.లక్ష్మి, హెచ్ఎం, ప్రాథమిక పాఠశాల, చిన్నమల్లారెడ్డి ఇంటికి మహాలక్ష్మి ఆడపిల్లే... అందరూ మగపిల్లలను కావాలని కోరుకుంటారు. కానీ ఇంటికి ఆడపిల్లే మహాలక్ష్మి. అన్ని రంగాల్లోనూ మగవారితో సమానం గా రాణిస్తున్నారు. ఉన్నతస్థానాల్లో నిలుస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల ఆడపిల్లల పట్ల వివక్ష కనిపిస్తుంది. జనాభా విషయంలో ఆడపిల్లల నిష్పత్తి తగ్గడం మంచిది కాదు. ఆడపిల్లల విషయంలో చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఆడపిల్లలను కాపాడుకోవడం అందరి బాధ్యత. – విజయ, గృహిణి, కామారెడ్డి -
ఈ నెల 24న బహిరంగ కరాటే ప్రదర్శన
ఆడపిల్లలు ఆడపులులతో సమానం అనే విషయాన్ని లోకానికి చాటడానికి భారీ బహిరంగ కరాటే ప్రదర్శన ఏర్పాటు చేయడానికి బాలల హక్కులసంఘం ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 24న బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు బాలల హక్కుల సంఘం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో వేయి మంది బాలికలతో కరాటే ప్రదర్శన నిర్వహించనున్నట్లు బాలల హక్కుల సంఘం పేర్కొంది. ఈ కరాటే ప్రదర్శనకు పబ్లిక్ గార్డెన్స్ వేదిక కానుంది. ఆసక్తి ఉన్న పదమూడేళ్ల లోపు బాలికలు హాజరుకావచ్చని, ఎలాంటి ప్రవేశ రుసుం లేదని, ఇందులో పాల్గొన్న బాలికలకు సర్టిఫికెట్లు కూడా అందజేస్తామని బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్ అనురాధారావు తెలిపారు.