ఆడపిల్ల, అబల, వంటింటి కుందేలు.. లాంటి ఎన్నో అవమానాల పరిధులు దాటి అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ మహిళలు రాణిస్తున్నారు. సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేకత కోసం నిరంతరం మగవారితో పోటీ పడుతున్నారు. నింగి, నేలా మాదేనంటూ దూసుకెళ్తున్నారు. సత్తా చాటుతున్నారు.. ఒక రకంగా మగపిల్లల కంటే ఆడపిల్లలే నయమనిపించే పరిస్థితులు, ఘటనలు సమాజంలో కనిపిస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఇంకా సమాజంలో ఆడపిల్లంటే చిన్న చూపే ఉంది. వారిపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడపిల్ల వద్దు.. మగపిల్లాడే ముద్దు అని చాలామంది భావిస్తున్నారు. మగవారి నిష్పత్తితో పోలిస్తే ఆడపిల్లల నిష్పత్తి తగ్గుతున్నా.. సృష్టికి విరుద్ధంగా వ్యవహరిస్తూ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారు. బాలురతో పోలిస్తే బాలికల నిష్పత్తి తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
కామారెడ్డి క్రైం: మగబిడ్డపై మమకారం చూపే తల్లిదండ్రులు.. ఆడపిల్లను వద్దనుకుంటున్నారు. కడుపులో పెరుగుతున్నది ఆడపిండం అని తెలిస్తే చాలు కడుపులోనే తుంచేస్తున్నారు. జిల్లాలో జనాభా గణాంకాలను పరిశీలిస్తే భవిష్యత్తు ప్రమాదకరమనే హెచ్చరికలు కనిపిస్తాయి. జిల్లా జనాభాలో పురుషుల జనాభా కన్నా మహిళలే ఎక్కువగా ఉన్నారు. పురుష, స్త్రీ నిష్పత్తి 1000 ః 1003గా ఉంది. కానీ బాలబాలికల విషయానికి వచ్చేసరికి బాలికల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆరేళ్లలోపు పిల్లల జనాభాను పరిశీలిస్తే.. మగ పిల్లలు 57,528 మంది ఉంటే, ఆడపిల్లలు 54,138 మందే ఉన్నారు. మగపిల్లలకన్నా ఆడపిల్లలు 3,390 మంది తక్కువగా ఉన్నారు. బాలబాలికల నిష్పత్తి 1000 @ 941గా ఉంది.
వారసుడి కోసం..
సమాజంలో మగబిడ్డే వారసుడన్న భావన ఉంది. ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి వెళ్తుంది. అదే మగపిల్లవాడు అయితే వంశాన్ని నిలబెడతాడని, అత్తారింటికి వెళ్లే ఆడపిల్ల వారసురాలు కాదన్న ఉద్దేశం చాలామందిలో బలంగా నాటుకుపోయింది. కొడుకు అయితే తమ బాధ్యతను మోస్తాడనే భావన ఉండడం కూడా ఓ కారణం. దీంతో తొలి కాన్పులో ఆడపిల్ల పుడితే సంతోషిస్తున్నవారూ.. రెండో కాన్పు విషయానికి వచ్చేసరికి గర్భనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు అబార్షన్ చేయించుకుంటున్నారు. పుట్టేది ఆడో మగ శిశువో చెప్పడం చట్టరీత్యా నేరమైనా.. పలు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు డబ్బుపై వ్యామోహంతో నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. దీంతో పుట్టేది ఆడ అని తెలియగానే పలువురు అబార్షన్ చేయించుకుంటుండడంతో జిల్లాలో బాలికల జనాభా నిష్పత్తి పడిపోతోంది.
అనర్థాలే...
జనాభా పెరుగుదలలో స్త్రీ, పురుష జనాభాలో వ్యత్యాసం ఎక్కువైతే అనర్థాలు తలెత్తే అవకాశాలుంటాయి. ఇప్పటికే చాలా మంది పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలకు అమ్మాయిలు దొరక్క ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆడపిల్లలపై వివక్షకు అంతం పలకాల్సిన అవసరం ఉంది.
వ్యత్యాసం పోవాలి..
బాలురు, బాలికల అనే వ్యత్యాసం పోవాలి. అమ్మాయిలను కూడా అబ్బాయిలతో సమానంగా చూడాలి. అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వారికి సరైన ప్రోత్సాహం అందించాలి. విద్యాపరంగా మగపిల్లలకు చదివించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి వ్యత్యాసాలు మంచివి కావు. చదువులో అబ్బాయిల కంటే అమ్మాయిలే రాణిస్తారు.
– అనిత, అంగన్‌వాడీ టీచర్, కామారెడ్డి
చిన్నచూపు వద్దు..
ఆడపిల్లలు ఆది పరాశక్తులు. వారిని చిన్నచూపు చూడొద్దు. మగపిల్లలతో సమానంగా చూడాలి. ఆడపిల్లలు దేంట్లోను తీసిపోరు. ఇందిరాగాంధీని మొదలుకుని రాజకీయాల్లో ఐఏఎస్, ఐపీఎస్, పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఆడపిల్లలను చదివిస్తే వారి సత్తా ఏంటో చాటుతారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ పడావో, బేటీ బచావో నినాదాన్ని నిజం చేయాలి.
– సీహెచ్.లక్ష్మి, హెచ్‌ఎం, ప్రాథమిక పాఠశాల, చిన్నమల్లారెడ్డి
ఇంటికి మహాలక్ష్మి ఆడపిల్లే...
అందరూ మగపిల్లలను కావాలని కోరుకుంటారు. కానీ ఇంటికి ఆడపిల్లే మహాలక్ష్మి. అన్ని రంగాల్లోనూ మగవారితో సమానం గా రాణిస్తున్నారు. ఉన్నతస్థానాల్లో నిలుస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల ఆడపిల్లల పట్ల వివక్ష కనిపిస్తుంది. జనాభా విషయంలో ఆడపిల్లల నిష్పత్తి తగ్గడం మంచిది కాదు. ఆడపిల్లల విషయంలో చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఆడపిల్లలను కాపాడుకోవడం అందరి బాధ్యత.
– విజయ, గృహిణి, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment