ఆచార్యదేవోభవ | National leaders, political leaders, establishing a statues. | Sakshi
Sakshi News home page

ఆచార్యదేవోభవ

Published Thu, Sep 5 2013 5:58 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

National leaders, political leaders, establishing a statues.

ఇంద్రియాల(భూదాన్‌పోచంపల్లి), న్యూస్‌లైన్: జాతీయ నాయకులు, రాజకీయ నాయకులకు విగ్రహాలు నెలకొల్పడం చూశాం. కానీ, భూదాన్‌పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలో ఓ ఉపాధ్యాయుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా అతని వర్ధంతి కార్యక్రమాలు, గురుపూజోత్సవం రోజున అతడిని స్మరించుకొంటారు. ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రానికి చెందిన కొప్పుల దామోదర్‌రెడ్డి ఇంద్రియాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా 1976 నుంచి 1983 వరకు పనిచేశారు.
 
 పాఠశాల భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో గ్రామస్తుల ద్వారా విరాళాలు సేకరించి శ్రమదానం చేసి 4 అదనపు తరగతి గదులు నిర్మించారు. 7వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయించారు. గ్రామం నుంచి మండల కేంద్రానికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పాటు వర్షం వస్తే రోడ్డు దిగబడేది. దీంతో గ్రామానికి వచ్చే బస్సు  రద్దయ్యింది. దామోదర్‌రెడ్డి గ్రామస్తులను కూడగట్టి శ్రమదానం చేసి రోడ్డుకు మట్టిపోసి మరమ్మతులు చేయించారు.
 
 రద్దు చేసిన బస్సును తిరిగి నడిపించాలని కోరుతూ 1983 ఆగస్టు 28న దిల్‌సుఖ్‌నగర్ డిపో మేనేజర్‌తో మాట్లాడి స్కూట ర్‌పై వస్తుండగా పోచంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. దామోదర్‌రెడ్డి విద్యాబోధనతో పాటు గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ ఆ నేపథ్యం లోనే మరణించడంతో గ్రామస్తులు అతని విగ్రహాన్ని పాఠశాల ఆవరణలో ఉన్న గాంధీ, నెహ్రూ విగ్రహాల పక్కన ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అతను మరణించిన రోజున గ్రామంలో ర్యాలీ, పిల్లలకు వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 5న ప్రత్యేకంగా స్మరించుకొని నివాళులు అర్పిస్తారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement