లెక్కలు ఈజీ గురూ...! | National Math Day Special Story | Sakshi
Sakshi News home page

లెక్కలు ఈజీ గురూ...!

Published Sat, Dec 22 2018 7:27 AM | Last Updated on Sat, Dec 22 2018 7:27 AM

National Math Day Special Story - Sakshi

రజనీకాంత్‌ను సత్కరిస్తున్న కలెక్టర్‌

గణితానికీ మానవ జీవితానికి విడదీయరాని బంధం వుంది. ప్రతీ విషయానికీ లెక్కలే. పుట్టింది మొదలు చచ్చేంత వరకూ అన్నింటికీ లెక్కలే. అయినా గణితమంటే చిన్నతనం నుంచి ప్రతీ ఒక్కరిలోనూ తెలియని భయం.  కానీ ఇష్టపడి చదివి, సాధన చేస్తే లెక్కలంత సులువైన పాఠ్యాంశం లేదని చాటి చెబుతున్నారు సాలూరుకు చెందిన రామానుజన్‌ గణిత క్లబ్‌ నిర్వాహకులు. గడచిన 18ఏళ్లగా మున్సిపల్‌ బంగారమ్మపేట ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రజనీకాంత్, పిల్లల్లో గణితం పట్ల నెలకొన్న తెలియని భయాన్ని పోగొట్టేందుకు కృషి చేస్తున్నారు. గణితశాస్త్ర పితామహుడైన శ్రీనివాస రామానుజన్‌ పేరున 2001లో రామానుజన్‌ గణిత క్లబ్‌ను స్థాపించారు. అప్పటి నుంచి గణితంపై కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

విజయనగరం, సాలూరు: జిల్లాలో మరెక్కడా లేని విధంగా రజనీకాంత్‌ గణిత క్లబ్‌ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. ఉత్తరాంధ్ర స్థాయిలో కూడా ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తూ గణితం పట్ల ఆసక్తి పెంచేందుకు కృషి చేస్తున్నారు. జిల్లా స్థాయిలో సాలూరు రామానుజన్‌ గణిత క్లబ్‌ 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఏటా ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏటా వేలాది మంది విద్యార్థులు ప్రతిభా పరీక్షలో పాల్గొనెలా చేస్తున్నారు. గణితం పట్ల ఆసక్తిని పిల్లల్లో పెంపొందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాణాన్ని కూడా అందిపుచ్చుకున్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రామానుజన్‌మేథ్స్‌క్లబ్‌.ఆర్గ్‌ అనే వెబ్‌సైట్‌ను 2015లో క్లబ్‌ నిర్వాహకులు ప్రారంభించారు. 

అవార్డు తెచ్చిపెట్టిన సేవలు
రామానుజన్‌ గణిత క్లబ్‌ ద్వారా అందిస్తోన్న సేవలతో పాటు విద్యావ్యాప్తికి రంభ రజనీకాంత్‌ చేస్తోన్న సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మాస్టారు చేస్తోన్న సేవలకు గుర్తింపుగా 2007లో కలెక్టర్‌ కిషోర్‌ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో గౌరవించారు. 2010లో ఉత్తరాంధ్ర స్థాయిలో రోటరీ ఎక్సలెన్స్‌ అవార్డ్‌ను కోలగట్ల వీరభద్రస్వామి అవార్డ్‌ను అందించారు. 

మిత్రుల సహకారం మరవలేనిది
గడచిన 18ఏళ్లగా రామానుజన్‌ గణిత క్లబ్‌ సేవలు ఉత్తరాంధ్ర స్థాయిలో విస్తరించడం వెనుక తనకు మిత్రులు అందిస్తోన్న సహాయసహకారాలు ఎంతో కీలకమని రజనీకాంత్‌ చెప్పారు. ముఖ్యంగా ఎంవి.గౌరీశంకర్, బి.వీరభద్రరావు, ఎన్‌.అశోక్‌కుమార్‌ తదితరుల వెన్నంటి వుండి తోడ్పాటు అందిస్తున్నారు. నా వద్ద చదువుకున్న పూర్వ విద్యార్థులు కూడా ప్రతిభా పరీక్ష పరీక్ష నిర్వహణలో స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు.

గణితంలో దిట్ట యాళ్ల
విజయనగరం, బొబ్బిలి రూరల్‌: పూసల చట్రాలు....క్యాలిక్యులేటర్లు...కంప్యూటర్లు...రోబోలు ఎన్ని వచ్చినా అవన్నీ మానవ మేధస్సుతో వచ్చినవే. మానవ మేధస్సు ముందు ఇవన్నీ తీసికట్టు అని గతంలో ఆర్యభట్ట, శకుంతలాదేవి, లక్కోజు సంజీవరాయశర్మ, శ్రీనివాసరామనుజం వంటి వారు అనేక మంది నిరూపించారు. గణితంలో మరో అధ్యాయం వేదగణితం..దీనికి ఈ ప్రాంతంలో బీజం వేసిన నేరళ్ల నారాయణమూర్తి మాస్టారు వంటి వారు ఉన్న ఈ ప్రాంతంలోనే గణితంలో ఎన్నో సులభ ప్రక్రియలకు శ్రీకారం చుట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు యాళ్ల శ్రీనివాసరావు. సీతానగరం మండలం జానుమళ్లువలసకు చెందిన శ్రీనివాసరావు బొబ్బిలి సంస్థానం పాఠశాలలో బాలసాహిత్య రచయిత ఎన్వీఆర్‌ సత్యనారాయణమూర్తి శిష్యరికంలో గణితంలో పలు కీలకాంశాలు నేర్చుకున్నారు. ఎంఎస్సీ, బీఈడీ చదివిన శ్రీనివాసరావు బొబ్బిలిలో ఉంటూ ప్రైవేటు ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు. గణితంలో తన ప్రతిభతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికారŠుడ్సలో స్థానం సాధించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement