సాగర్‌నగర్ (విశాఖ తూర్పు) : సమాచార, సాంకేతిక రంగంలో వస్తున్న ఆధునాతన మార్పులపై గీతం విశ్వవిద్యాలయం ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో రెండ్రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఎన్‌ఎస్‌టీఎల్ అసోసియేషన్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ ముఖ్యఅతిథిగా హాజరై సదస్సును ప్రారంభిస్తూ సమాచార, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రీ ఇన్‌ఫోర్స్‌డ్, ఫైబర్ టెక్నాలజీ, కాగ్నిటివ్ రేడియో వంటివి సమాచార వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయని పేర్కొన్నారు.
ఆకాశావాణి విశాఖ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బి. రామకృష్ణ ప్రసాద్ 1970 నుంచి సమాచార వ్యవస్థలో కాలానుగుణంగా వచ్చిన మార్పులను తన ప్రసంగంలో వివరించారు. గీతం వీసీ ప్రొఫెసర్ ఎం.ఎస్.ప్రసాదరావు మాట్లాడుతూ సమాచార, సాంకేతిక విప్లవం గత దశాబ్దకాలంలో ఏ విధంగా మార్పులకు గురైందీ వివరించారు. ఇస్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. లక్ష్మీప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ సి.ధర్మరాజు, ఈసీఈ విభాగాధిపతి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ టి. మాధవి, కో–కన్వీనర్ డాక్టర్ జి. కరుణాకర్ సదస్సు వివరాలను తెలియజేశారు. జాతీయ సదస్సుకు నలుమూలల నుంచి సాంకేతిక రంగ నిపుణులు హాజరయ్యారు. సమాచార రంగంలో చోటు చేసుకున్న మార్పులపై సీడీ ఆవిష్కరించారు.