communication technology
-
కమ్యూనికేషన్ టెక్నాలజీపై జాతీయ సదస్సు
సాగర్‌నగర్ (విశాఖ తూర్పు) : సమాచార, సాంకేతిక రంగంలో వస్తున్న ఆధునాతన మార్పులపై గీతం విశ్వవిద్యాలయం ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో రెండ్రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఎన్ఎస్టీఎల్ అసోసియేషన్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ ముఖ్యఅతిథిగా హాజరై సదస్సును ప్రారంభిస్తూ సమాచార, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రీ ఇన్ఫోర్స్డ్, ఫైబర్ టెక్నాలజీ, కాగ్నిటివ్ రేడియో వంటివి సమాచార వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయని పేర్కొన్నారు. ఆకాశావాణి విశాఖ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బి. రామకృష్ణ ప్రసాద్ 1970 నుంచి సమాచార వ్యవస్థలో కాలానుగుణంగా వచ్చిన మార్పులను తన ప్రసంగంలో వివరించారు. గీతం వీసీ ప్రొఫెసర్ ఎం.ఎస్.ప్రసాదరావు మాట్లాడుతూ సమాచార, సాంకేతిక విప్లవం గత దశాబ్దకాలంలో ఏ విధంగా మార్పులకు గురైందీ వివరించారు. ఇస్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. లక్ష్మీప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ సి.ధర్మరాజు, ఈసీఈ విభాగాధిపతి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ టి. మాధవి, కో–కన్వీనర్ డాక్టర్ జి. కరుణాకర్ సదస్సు వివరాలను తెలియజేశారు. జాతీయ సదస్సుకు నలుమూలల నుంచి సాంకేతిక రంగ నిపుణులు హాజరయ్యారు. సమాచార రంగంలో చోటు చేసుకున్న మార్పులపై సీడీ ఆవిష్కరించారు. -
స్మార్ట్ సిటీలతో 40 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్మార్ట్ సిటీస్‌తో ఐటీ రంగానికి వచ్చే 5-10 ఏళ్లలో 30-40 బిలియన్ డాలర్ల మేర వ్యాపార అవకాశాలు లభించగలవని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తెలిపింది. స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసం కేంద్రం రూ. 48,000 కోట్లు కేటాయించింది. ప్రతిపాదిత 100 స్మార్ట్ సిటీల్లో ఒక్కొక్క దానికి వార్షికంగా అయిదేళ్ల పాటు రూ. 100 కోట్ల మేర కేంద్ర నిధులు లభించనున్నాయి. స్మార్ట్ సిటీలకు లభించే నిధుల్లో కనీసం 10-15 శాతాన్ని ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీపై (ఐసీటీ) వెచ్చించిన పక్షంలో ఐటీ కంపెనీలకు కనీసం 30-40 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు లభించగలవని అంచనా వేస్తున్నట్లు నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. స్మార్ట్ సిటీల నిర్మాణంలో ఐసీటీ పాత్ర గురించి నాస్కామ్ రూపొందించిన నివేదికను మే 21న ఢిల్లీలో జరిగే స్మార్ట్ సిటీ ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్నట్లు ఆయన వివరించారు. -
కమ్యూనికేషన్ టెక్నాలజీ వినియోగిస్తే వైద్యరంగంలో పెను మార్పులు
షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ కంచికచర్ల : కమ్యూనికేషన్ టెక్నాలజీని వైద్య రంగంలో కూడా ఉపయోగించుకోవచ్చని, ముఖ్యంగా కార్డియాలజీ విభాగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టవచ్చని శ్రీహరికోటలోని షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక మిక్ ఇంజినీరింగ్ కళాశాలలో ‘రీసెంట్ ట్రెండ్స్ అండ్ స్కోప్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిగ్నల్ ప్రాసెసింగ్ కమ్యూనికేషన్’ అంశంపై రెండు రోజులపాటు నిర్వహించే వర్క్‌షాప్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ శాటిలైట్ రంగంలో కమ్యూనికేషన్ విభాగంలో వచ్చిన మార్పులను వివరించారు. వివిధ బ్యాండ్లను ఏయే శాటిలైట్స్‌ను లాంచ్ చేయటానికి వినియోగిస్తారనే వివరాలు వెల్లడించారు. తొలిసారిగా ఎక్స్టెండెడ్, సీ బ్యాండ్లను వినియోగించింది భారతదేశమేనని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా శాటిలైట్ విభాగానికి వె చ్చిస్తున్న డబ్బును స్లైడ్స్ ద్వారా చూపించారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల డీన్ డాక్టర్ చంద్రమోహన్ మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు భవిషత్ తరాలకు అందించే విధంగా అంతరిక్ష ప్రయోగాలు ఉపయోగపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కేబీకే రావు, వైస్ చైర్మన్ నిమ్మగడ్డ శ్రీనివాసరావు, డెరైక్టర్ ఎన్.కృష్ణ, సీఈవో పాండురంగారావు, సీఈసీ హెచ్‌వోడి ప్రొఫెసర్ గురవారెడ్డి, ప్రొఫెసర్ ఆకుల వెంకటనరేష్బాబు, వివిధ ప్రాంతాల నుంచి 150 మంది ఇంజినీరింగ్ పీజీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.