మాది నేర ప్రవృత్తి కాదు: సెక్స్‌ వర్కర్లు | National Sex Workers Meeting In SV University | Sakshi
Sakshi News home page

మాది నేర ప్రవృత్తి కాదు: సెక్స్‌ వర్కర్లు

Published Sat, Mar 24 2018 9:09 AM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

National Sex Workers Meeting In SV University - Sakshi

తిరుపతిలో నిర్వహించిన సెక్స్‌ వర్కర్ల జాతీయ సమావేశం

సాక్షి, తిరుపతి: ‘సెక్స్‌వర్క్‌ వేరు హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ వేరు. కానీ పోలీసులు రెండింటినీ ఒక్కటిగా చూస్తున్నారు. మేము విధిలేని పరిస్థితుల్లో, బతుకుదెరువు కోసమే ఈ వృత్తిలో ఉన్నాం. బలవంతంగా ఎవ్వరినీ ఈ వృత్తిలోకి తీసుకురాం. ఈ వృత్తిలోకి రావాలంటే కట్టుబాట్లు అనుసరించాలి. మాకూ పిల్లలు.. కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వాలు బతుకు దెరువు చూపిస్తే ఈ వృత్తి మానేస్తాము. మేమూ సమాజంలో గౌరంగా ఉండాలని కోరుకుంటున్నాము’ అని సెక్స్‌ వర్కర్లు పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో రెండురోజుల పాటు జరిగిన జాతీయ సెక్స్‌వర్కర్ల సంఘం సమావేశం శుక్రవారం ముగిసింది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల నుంచి సెక్స్‌ వర్కర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. తాము సంపాదించిన సొమ్ములో కొందరు పోలీసులు, లాయర్లు బలవంతంగా మామూళ్లు వసూలు చేస్తారని, వారు చేసేది న్యాయం, మేము చేసేది అన్యాయమా? అనిప్రశ్నించారు. రౌడీలు, గూండాలు తమపై దౌర్జన్యం చేసి అఘాయిత్యాలకు పాల్పడుతుంటే కాపాడేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటివారిని శిక్షించడం మానేసి తమపై ప్రతాపం ఎందుకని ప్రశ్నించారు. తమకు జరుగుతున్న అన్యాయాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి తమపైనే కక్షసాధింపునకు పాల్పడుతున్నారనే బాధను వ్యక్తం చేశారు. కర్ణాటకలోని బళ్లారి డీసీ నగర్‌లో పోలీసుల అరాచకం అధికంగా వుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమలాంటి వారికి పుట్టిన పిల్లల కోసం పుణేలో ఓ వసతి గృహాన్ని నడుపుతున్నట్టు తెలిపారు.

ఆ జీఓ వల్ల ఉపయోగమే లేదు
సెక్స్‌ వర్కర్లు పునరావాసం కోసం ప్రభుత్వం 2003లో జీవో ఇచ్చిందని,  అయితే ఆ జీవో వల్ల ఎవరికీ మేలు జరగలేదని సంఘం సభ్యులు చెప్పారు. ఆ జీవో తమలాంటి వారికి పక్కా ఇళ్లు, ఆదాయ మార్గాలు కల్పించాలని, భృతి చెల్లించాలని చెబుతోందన్నారు. వీటి కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తాము సెక్స్‌ వర్కర్లమని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పక్కాగృహం, రేషన్‌కార్డు కావాలంటే జన్మభూమి కమిటీల అనుమతి తీసుకోవాలని అధికారులే చెబుతున్నారని వివరించారు. ఆ కమిటీల చుట్టూ నెలల పాటు తిరగాల్సి వస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఎస్పీ కాటమరాజు హాజరుకాగా విగ్స్‌ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఆర్‌.మీరాతో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సెక్స్‌వర్కర్ల సంఘ సభ్యులు  నిషాగూళూరు (కర్ణాటక), సంగీత మనోజ్‌ (మహారాష్ట్ర), అలివేలు (ఏపీ), కోకిల (తమిళనాడు), లలితకుమారి (జార్ఖండ్‌) తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement