sv univarsity
-
ఎస్వీయూలో పేలిన నాటుబాంబులు
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ వసతి గృహాల్లో నాటుబాంబుల పేలుళ్లు సంచలనం కలిగించాయి. బుధవారం రాత్రి, గురువారం ఉదయం ఇవి పేలాయి. బుధవారం అర్ధరాత్రి నిద్రలో ఉన్న విద్యార్థులు బాంబు పేలుడుతో లేచి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హెచ్ బ్లాక్ సమీపంలో వేటగాళ్లు అడవిపందులు, ఇతర వన్యమృగాల కోసం పెట్టిన నాటుబాంబులు ఈ కలకలం రేపాయి. ఈ బాంబుల పేలుళ్లలో ఒక పంది, ఒక కుక్క మృతిచెందాయి. ఈ పేలుళ్ల నేపథ్యంలో యూనివర్సిటీ పోలీసులు, బాంబు, డాగ్ స్క్వాడ్ల వారు రంగంలోకి దిగి హెచ్ బ్లాక్ పరిసరాలు జల్లెడ పట్టారు. పేలని రెండు నాటుబాంబులను గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వన్యమృగాల కోసమే... ఎస్వీ యూనివర్సిటీ శేషాచలం అటవీప్రాంతం దిగువన ఉండటంతో ఈ క్యాంపస్‌లో అడవిపందులు, జింకలు, కణితి ఇతర జంతువులు సంచరిస్తుంటాయి. అడవి జంతువుల కోసం వేటగాళ్లు వర్సిటీ వసతి గృహాల సమీపంలో నాటుబాంబులు పెట్టారు. బాంబులు కొరికిన పంది, కుక్క అవి పేలడంతో మృతిచెందాయి. విద్యార్థులు నిత్యం సంచరించే ఈ ప్రాంతంలో నాటుబాంబులు పెట్టడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటనపై వర్సిటీ ఎస్ఐ సుమతి మాట్లాడుతూ వన్యప్రాణుల కోసం పెట్టిన ఈ బాంబులు పేలుడు గుణం కల్గిన టపాసుల్లో వాడే మందుతో తయారు చేసినవని చెప్పారు. వర్సిటీ రిజిస్ట్రార్ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంపై ఏఐఎస్ఎఫ్ నాయకులు రిజిస్ట్రార్‌కు వినతిపత్రం సమర్పించారు. వర్సిటీ ఆవరణ చుట్టూ ఫెన్సింగ్ వేయించాలని, వర్సిటీలో భద్రత పెంచాలని కోరారు. -
కొత్త మొక్కను కనుగొన్న ఎస్వీయూ శాస్త్రవేత్తలు
యూనివర్సిటీ క్యాంపస్(చిత్తూరు జిల్లా) : శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వృక్ష శాస్త్ర విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు శివరామకృష్ణ, యుగంధర్, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన కేటగిరీ–ఈ శాస్త్రవేత్త డాక్టర్ లాల్జీ సింగ్ ‘క్రోటాలేరియా లామెల్లిఫారి్మస్’ అనే నూతన మొక్కను కనుగొన్నారు. తమ పరిశోధనల్లో భాగంగా తూర్పు కనుమల ప్రాంతంలోని చిత్తూరు జిల్లా కైలాస కోన, పూడి ప్రాంతాల్లో ఈ మొక్కను గుర్తించారు. ఈ విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ప్రచురించింది. దీనిపై విస్తృత పరిశోధనలు చేయగా ఈ మొక్క ఎర్ర నేలల్లో పెరుగుతుందని, గడ్డిలో కలిసి ఉంటుందని తేలింది. శివరామకృష్ణ మాట్లాడుతూ ఈ మొక్క గడ్డిలో కలిసిపోయి పగటి పూట సరిగా కనిపించదన్నారు. 10 సెం.మీ ఎత్తు పెరుగుతుందని తెలిపారు. పుత్తూరు సమీపంలోని దుర్గం ప్రాంతంలోనూ ఈ మొక్కలున్నట్టు తాజాగా గుర్తించామన్నారు. దీని ఇతర లక్షణాలపై భవిష్యత్ పరిశోధనలు చేస్తామని శివరామకృష్ణ, యుగంధర్ తెలిపారు. చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు అక్రమాల పుట్ట ‘అమరావతి’ -
సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఏపీ ఎంసెట్
సాక్షి, అమరావతి/యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ప్రవేశ పరీక్షల తాజా షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదల చేశారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంసెట్, సహా వివిధ ప్రవేశ పరీక్షలను ఏప్రిల్‌లోనే నిర్వహించాలని ముందు షెడ్యూళ్లు ఇచ్చినా కరోనా, లాక్డౌన్ల కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. సెప్టెంబర్ మూడో వారంలో ఈ పరీక్షలను నిర్వహించాలని, అక్టోబర్ 15 నుంచి తరగతులు ప్రారంభించాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఉన్నత విద్యామండలి తాజా షెడ్యూల్‌ను రూపొందించింది. ఇలా ఉండగా, ఈ ఏడాది ఏపీ ఐసెట్‌ను ఎస్వీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. 64,822 మంది దరఖాస్తు చేసుకున్నారని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసులురెడ్డి తెలిపారు. 45 పట్టణాల్లో నాలుగు సెషన్స్‌లో ఆన్లైన్ ద్వారా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. -
మాది నేర ప్రవృత్తి కాదు: సెక్స్ వర్కర్లు
సాక్షి, తిరుపతి: ‘సెక్స్‌వర్క్ వేరు హ్యూమన్ ట్రాఫికింగ్ వేరు. కానీ పోలీసులు రెండింటినీ ఒక్కటిగా చూస్తున్నారు. మేము విధిలేని పరిస్థితుల్లో, బతుకుదెరువు కోసమే ఈ వృత్తిలో ఉన్నాం. బలవంతంగా ఎవ్వరినీ ఈ వృత్తిలోకి తీసుకురాం. ఈ వృత్తిలోకి రావాలంటే కట్టుబాట్లు అనుసరించాలి. మాకూ పిల్లలు.. కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వాలు బతుకు దెరువు చూపిస్తే ఈ వృత్తి మానేస్తాము. మేమూ సమాజంలో గౌరంగా ఉండాలని కోరుకుంటున్నాము’ అని సెక్స్ వర్కర్లు పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో రెండురోజుల పాటు జరిగిన జాతీయ సెక్స్‌వర్కర్ల సంఘం సమావేశం శుక్రవారం ముగిసింది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల నుంచి సెక్స్ వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. తాము సంపాదించిన సొమ్ములో కొందరు పోలీసులు, లాయర్లు బలవంతంగా మామూళ్లు వసూలు చేస్తారని, వారు చేసేది న్యాయం, మేము చేసేది అన్యాయమా? అనిప్రశ్నించారు. రౌడీలు, గూండాలు తమపై దౌర్జన్యం చేసి అఘాయిత్యాలకు పాల్పడుతుంటే కాపాడేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటివారిని శిక్షించడం మానేసి తమపై ప్రతాపం ఎందుకని ప్రశ్నించారు. తమకు జరుగుతున్న అన్యాయాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి తమపైనే కక్షసాధింపునకు పాల్పడుతున్నారనే బాధను వ్యక్తం చేశారు. కర్ణాటకలోని బళ్లారి డీసీ నగర్లో పోలీసుల అరాచకం అధికంగా వుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమలాంటి వారికి పుట్టిన పిల్లల కోసం పుణేలో ఓ వసతి గృహాన్ని నడుపుతున్నట్టు తెలిపారు. ఆ జీఓ వల్ల ఉపయోగమే లేదు సెక్స్ వర్కర్లు పునరావాసం కోసం ప్రభుత్వం 2003లో జీవో ఇచ్చిందని, అయితే ఆ జీవో వల్ల ఎవరికీ మేలు జరగలేదని సంఘం సభ్యులు చెప్పారు. ఆ జీవో తమలాంటి వారికి పక్కా ఇళ్లు, ఆదాయ మార్గాలు కల్పించాలని, భృతి చెల్లించాలని చెబుతోందన్నారు. వీటి కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తాము సెక్స్ వర్కర్లమని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పక్కాగృహం, రేషన్‌కార్డు కావాలంటే జన్మభూమి కమిటీల అనుమతి తీసుకోవాలని అధికారులే చెబుతున్నారని వివరించారు. ఆ కమిటీల చుట్టూ నెలల పాటు తిరగాల్సి వస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఎస్పీ కాటమరాజు హాజరుకాగా విగ్స్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఆర్.మీరాతో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సెక్స్‌వర్కర్ల సంఘ సభ్యులు నిషాగూళూరు (కర్ణాటక), సంగీత మనోజ్ (మహారాష్ట్ర), అలివేలు (ఏపీ), కోకిల (తమిళనాడు), లలితకుమారి (జార్ఖండ్) తదితరులు సమావేశానికి హాజరయ్యారు. -
ఎస్వీయూ దూర విద్య పరీక్షలు ప్రారంభం
యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీలో పరీక్షల కోసం ఎంతో కాలం ఎదురు చూసిన విద్యార్థుల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు గురువారం నుంచి పరీక్షలు మొదలయ్యాయి. తొలిరోజు 36 వేల మంది పరీక్షలు రాశారు. రెండేళ్ల తర్వాత దూర విద్య విభాగం పీజీ, యూజీ పరీక్షలు నిర్వహించడంతో అభ్యర్థులు ఆనందంగా పరీక్షలకు హాజరయ్యారు. ఎస్వీయూ దూరవిద్యవిభాగంలో చివరి సారిగా 2014 సంవత్సరం చివర్లో పరీక్షలు జరిగాయి. 2015లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. గురువారం నుంచి పరీక్షలు మొదలు కావడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ పరీక్షలు అక్టోబర్ 4 వరకు కొనసాగుతాయి. 59 కేంద్రాల్లో నిర్వహణ: గురువారం నుంచి మొదలైన ఈ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 59 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 50 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేశారు. అయితే తొలిరోజు పరీక్షలకు కేవలం 36 వేల మంది మాత్రమే హాజరయ్యారు. మదనపల్లెలోని ఒక ప్రైవేట్ కశాశాలలో కాపీయింగ్ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులను పరీశీలకులు గుర్తించారు. తొలి రోజు ప్రశాంతం దూరవిద్య పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయి. మాస్ కాపీయింగ్ నిరోధానికి ఐదు ప్రత్యేక బృందాలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. ఈ బృందం నిరంతర తనిఖీల వల్ల ఎక్కడ కాపీయింగ్ జరగలేదు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. – బి. చంద్రయ్య, ఎస్వీయూ పరీక్షల నియంత్రణాధికారి